రజినీ ‘బాబా’ రాజకీయం!

by Prasanna |   ( Updated:2020-02-10 08:36:45.0  )
రజినీ ‘బాబా’ రాజకీయం!
X

దాదాపు పాతికేండ్ల నుంచి క్రియాశీల రాజకీయాల్లోకి తమ అభిమాన హీరో తలైవా సూపర్‌స్టార్ రజినీకాంత్ ఎప్పుడెస్తారోనని ఎదురు చూస్తున్న అభిమానులకు తీపి కబురు అందింది. ఏప్రిల్ 16 తర్వాత రజినీ పార్టీని క్రియాశీలంగా నడుపుతారని ఆయన అనుయూయులు చెబుతున్నారు. దక్షిణ భారతదేశంలో ప్రధానంగా ద్రవిడ అస్తిత్వ ఉద్యమాలకు నెలవైన తమిళనాట రజినీ ద్రవిడ స్టైల్ పాలిటిక్స్ చేస్తారా? లేదా స్పిరిట్యువల్ పాలిటిక్స్ చేస్తారా.. తన రంగు కాషాయం కాదని చెబుతున్న నటమిత్రుడు కమల్‌తో కలిసి పనిచేస్తారా అనేది రాజకీయవర్గాల్లో ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది.

కాషాయ గూటికి కబాలి?

ఇప్పటికే బాబా రాజకీయం చేస్తాననీ, తనవి ఎంజీ రామచంద్రన్, దైవత్వ రాజకీయమని పలుసార్లు రజినీ చెప్పారు. కానీ, కార్యాచరణ ప్రకటించలేదు. బీజేపీలో చేరతాననీ అధికారికంగా ఎక్కడా రజినీ ప్రకటించకపోయినప్పటికీ స్పిరిచ్యువల్ పాలిటిక్స్ అనడం, సీతారాముల విగ్రహాలపై పెరియార్ చెప్పుల దండేసి ఊరేగించారని చెప్పడం, దానిపై నిరసనలు వ్యక్తమైనా అవే మాటలకు తాను కట్టుబడి ఉన్నానని కబాలీ చెప్పడాన్ని గుదిగుచ్చి పరిశీలిస్తే రజినీ కమలం గూటికి చేరతారని రాజకీయ పరిశీలకులు అభిప్రాయపడుతున్నారు.

పాతికేండ్ల నుంచి వెయిటింగ్

1996 నుంచి రజినీ రాజకీయాల్లోకి రావడానికి వెయిటింగ్ చేస్తున్నారని అభిమానులంటున్నారు. 1996లో తమిళ అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా ఏఐఏడీఎంకే మళ్లీ అధికారంలోకి వస్తే తమిళనాడును దేవుడు కూడా కాపాడలేడనీ, అప్పటి డీఎంకే, టీఎంసీ కూటమిని బలపర్చాలని అభిమానులను అభ్యర్థించారు. ఆ కూటమి విజయం సాధించింది. సార్వత్రిక ఎన్నికల్లోనూ ఆ కూటమిని రజినీ బలపర్చారు. అప్పడు అదృశ్యమైన రజినీ మళ్లీ 2004లో తెరమీదకు వచ్చి తాను వ్యక్తిగతంగా బీజేపీకి మద్దతిస్తానని చెప్పారు. ఇక ఆ తర్వాత మళ్లీ రాజకీయం గురించి పెద్దగా మాట్లాడలేదు. ఆ తర్వాత మళ్లీ 31 డిసెంబర్ 2017న రాజకీయాల్లోకి వస్తానని ప్రకటించారు. 2021లో తమిళనాట 234 అసెంబ్లీ స్థానాలు తాను పోటీ చేస్తానని స్పష్టం చేశారు.

పొత్తు పొడిచేనా?

ఇప్పటికే తమిళనాట అధికార పార్టీ ఏఐఏడీఎంకేతో బీజేపీ పొత్తులో ఉంది. ఈ నేపథ్యంలో రజినీ కమలంతో కరచాలనం చేసేనా? అనేది ఆసక్తికరంగా మారింది. టీటీవీ దినకరన్ వర్గంతో ఎట్టి పరిస్థితుల్లో రజినీ కలవబోరనీ వార్తలొస్తుండగా, బీజేపీకి సంబంధించిన నాయకులు గురుమూర్తి మాత్రం రజినీ తప్పక బీజేపీతో పొత్తు పెట్టకుంటారని చెబుతున్నారు. అయితే, సీఎం పళనిస్వామి మాత్రం తాము బలపడ్డామని వచ్చే సారి కూడా ఏఐఏఎండీకేదే అధికారమని ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో పొత్తు పొడుస్తుందా లేదా అనేది తెలియాలంటే వేచి చూడాల్సిందే.

నటమిత్రుడితో నడిచేనా?

నటమిత్రుడు కమలహాసన్‌తో కలిసి అవసరమైతే పనిచేస్తానని రజినీ తెలిపారు. అయితే, కమల్ మాత్రం తను రంగు కాషాయం కాదనీ, బలమైదన ద్రవిడవాదమని చెప్పారు. ఇప్పటికే ఆయన బై ఎలక్షన్స్‌లో ఆయన పార్టీ మక్కల్ నీది మయ్యుం పోటీ చేసింది. రజినీ ఇప్పటికే సీఏఏకు మద్దతు తెలిపారు. మస్లింలకు సీఏఏతో ఎలాంటి ముప్పు లేదని చెప్పారు. ఈ నేపథ్యంలో కమల్ రజినీ కలిసి పోటీ చేస్తారా? అసలు ఆ అవకాశం ఉందా.. అనేది వారి తదుపరి కార్యాచరణను బట్టే తెలుస్తుందంటున్నారు రాజకీయ పరిశీలకులు.

తమిళ ముఖ చిత్రంలోకి ‘పీకే’

రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ (పీకే) డీఎంకేకు వ్యూహాలు వేసేందుకు సిద్ధం కావడంతో తమిళ రాజకీయం ఇంకా రసవత్తరంగా మారనుంది. తమిళనాట రాజకీయ శూన్యతం ఉందని కొందరు చెబుతున్న నేపథ్యం కూడా ఉంది. జయలలిత, కరుణానిధిల మరణానంతరం ఆ పార్టీలు ఇక జనంలో లేవని, కాబట్టి రజినీ వచ్చి ఆ శూన్యతను నింపాలని ఎప్పటి నుంచో రజినీని కోరుతున్న సంగతి తెలిసిందే. రజినీ మక్కల్ మంద్రం పేరిట అభిమానులతో ఇప్పటికే రజినీ కార్యక్రమాలు కొనసాగిస్తున్నారు. ఒంటరిగా వచ్చి అన్ని స్థానాల్లో పోటీ చేస్తారా లేక బీజేపీకి జూనియర్ పార్ట్‌నర్‌గా మారి కేంద్ర మద్దతును రజినీ ఆశిస్తారా? అనేది తెలియాలంటే ఏప్రిల్ నెల, ఆ తదనంతర రజినీ కార్యాచరణ పరిశీలించాల్సిందేనని అంటున్నారు విశ్లేషకులు.

Advertisement

Next Story

Most Viewed