పోతిరెడ్డిపాడు టెండర్లు ఆపండి

by Shyam |
పోతిరెడ్డిపాడు టెండర్లు ఆపండి
X

దిశ, న్యూస్‌బ్యూరో: ఆంధ్రప్రదేశ్ పునర్‌వ్యవస్థీకరణ చట్టం సెక్షన్ 84 ప్రకారం కృష్ణా నదిపై ఏ కొత్త ప్రాజెక్టునైనా అపెక్స్ కౌన్సిల్ అనుమతి తీసుకొని నిర్మించాలని తెలంగాణ నీటి పారుదల శాఖ ముఖ్య కార్యదర్శి రజత్ కుమార్ పేర్కొన్నారు. ఏపీ సర్కార్ శ్రీశైలం ప్రాజెక్టు వద్ద పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ సామర్ధ్యాన్ని 80వేల క్యూసెక్కులకు పెంచుతూ ఈ నెల 5న జారీ చేసిన జీవో ఆర్ టీ 203పై తగు చర్యలు తీసుకొని ప్రాజెక్టు టెండర్లు పిలవకుండా అడ్డుకోవాలని ఈ మేరకు ఆయన కృష్ణా రివర్ మేనేజ్‌మెంట్‌ బోర్డుకు మంగళవారం లేఖ రాశారు. రెండు రాష్ట్రాల ఉమ్మడి ప్రాజెక్టైన శ్రీశైలం నుంచి రోజుకు 8 టీఎంసీల నీటిని ఏకపక్షంగా మళ్లించాలనుకోవడం ఫెడరల్ వ్యవస్థలో ఒక బాధ్యతాయుత రాష్ట్రం చేయదగ్గ పని కాదని, తెలంగాణలో చాలా మంది ప్రజలు ఈ ప్రాజెక్టు నీళ్లపై ఆధారపడి నివసిస్తున్నారని ఆయన బోర్డుకు తెలిపారు.

రాజధాని హైదరాబాద్‌కు తాగునీటి సరఫరా, ఉమ్మడి మహబూబ్‌నగర్, రంగారెడ్డి, నల్గొండ, జిల్లాల్లో మిషన్ భగీరథ పథకం కింద తాగునీరు అందించడంపైనా ఏపీ తీసుకున్న పోతిరెడ్డిపాడు సామర్థ్యం పెంపు నిర్ణయం తీవ్ర ప్రభావం చూపుతుందని పేర్కొన్నారు. అంతేగాక నాగార్జున సాగర్ లెఫ్ట్ బ్యాంక్ కెనాల్, ఎస్‌ఎల్‌బీసీ, కల్వకుర్తి, పాలమూరు రంగారెడ్డి, దిండి ప్రాజెక్టుల కింద ఆయకట్టుకు నీరందకుండా చేయడంతో పాటు శ్రీశైలం లెఫ్ట్ బ్యాంక్ కెనాల్‌లో విద్యుత్ ఉత్పత్తిపైనా నెగెటివ్ ఎఫెక్ట్ ఉంటుందని తెలిపారు. తెలంగాణలోని కృష్ణా బేసిన్ ప్రాజెక్టులను కాదని ఆంధ్రప్రదేశ్‌లోని బేసిన్‌లో లేని ఉన్న ప్రాజెక్టుల కోసం నీటి మళ్లింపు చేపట్టడం సమర్థనీయం కాదని ఆక్షేపించారు. ఇప్పటికే పోతిరెడ్డిపాడు రెగ్యులేటర్ వద్ద టెలీమెట్రి లేనందువల్ల నీటిని ఏపీ ఇష్టమున్నట్టు వాడుకుంటోందని, ఎన్నిసార్లు విజ్ఞప్తి చేసినా కేఆర్ఎంబీ సమావేశాల్లో మొరపెట్టుకున్నా, కేంద్ర ప్రభుత్వ ఆదేశాలున్నా అక్కడ టెలీమెట్రీ ఏర్పాటు చేయలేదని తెలిపారు. శ్రీశైలం ప్రాజెక్టుకు నీటిని కేటాయించేటపుడు పోతిరెడ్డిపాడు నుంచి నీళ్లు మళ్లించడం కుదరదని కృష్ణా వాటర్ ట్రిబ్యునల్ వన్ చెప్పిన విషయాన్ని కృష్ణా రివర్ బోర్డుకు రజత్ కుమార్ ఈ సందర్భంగా గుర్తు చేశారు.

Advertisement

Next Story