అసెంబ్లీని సమావేశపర్చాల్సిందే: రాజస్థాన్ సీఎం

by  |
అసెంబ్లీని సమావేశపర్చాల్సిందే: రాజస్థాన్ సీఎం
X

జైపూర్: అసెంబ్లీని సమావేశపరచాలని రాజస్థాన్ సీఎం అశోక్ గెహ్లాట్ పట్టుబట్టారు. అవసరమైతే రాష్ట్రపతి భవన్ వెళ్తామని, పీఎం నివాసం ముందూ ప్రదర్శన నిర్వహిస్తామని హెచ్చరించారు. గవర్నర్ కల్‌రాజ్ మిశ్రా పైనుంచి వస్తున్న ఒత్తిళ్లకు లొంగి సమావేశాలకు నిరాకరిస్తున్నారని శుక్రవారం ఆరోపించి, కాంగ్రెస్ ఎమ్మెల్యేలతో రాజ్‌భవన్‌లో ధర్నాకు దిగిన సంగతి తెలిసిందే. అసెంబ్లీ నిర్వహణపై గవర్నర్ ఆరు అంశాలను లేవనెత్తగా, వాటిని చర్చించడానికి శుక్రవారం రాత్రి సీఎం గెహ్లాట్ క్యాబినెట్ సమావేశాన్ని నిర్వహించారు. శనివారం సాయంత్రమూ క్యాబినెట్ సమావేశాన్ని నిర్వహించారు. 21 రోజలు ముందస్తు నోటీసుగా అసెంబ్లీ నిర్వహణకు అభ్యర్థించాలని, ఏ రోజు నుంచి సమావేశపరచాలన్న తేదీని ప్రస్తావించలేదని, దానికి క్యాబినెట్ ఆమోదమూ అభ్యర్థన లేఖలో లేదన్నారు. సమాశానికి అజెండానూ పేర్కొనలేదని, ఎమ్మెల్యేలు స్వేచ్ఛగా తిరిగే అవకాశం కల్పించాలని, మెజార్టీ ఉండగా ఫ్లోర్ టెస్టు నిర్వహించాల్సిన అవసరమేంటని? సహా గవర్నర్ లేవనెత్తిన పలు అంశాలపై క్యాబినెట్ సమావేశమై చర్చించింది. శనివారం సాయంత్రం నిర్వహించిన క్యాబినెట్ సమావేశానికి ముందు సీఎం గెహ్లాట్ ఎమ్మెల్యేలతో జైపూర్‌ హోటల్‌లో శాసనసభాపక్ష సమావేశాన్ని ఏర్పాటు చేశారు. అసెంబ్లీని సమావేశపరచడానికి ఎక్కడికైనా వెళ్తామని అన్నారు. అయితే, ఎమ్మెల్యేలు మరో 21 రోజులు హోటల్‌లోనే ఉండాల్సి ఉంటుందని సూత్రప్రాయంగా తెలిపారు. మెజార్టీ ఉన్నప్పటికీ ఫ్లోర్ టెస్టు నిర్వహిస్తే మరో ఆరు నెలల వరకు బలపరీక్షకు అవకాశముండదు కాబట్టి, ఎమ్మెల్యేల బేరసారాలకు ఇప్పటికి అడ్డుకట్ట వేయడానికి ఇదే ఉత్తమ మార్గమమని సీఎం భావిస్తున్నట్టు రాజకీయవర్గాలు తెలిపాయి. స్పీకర్, సచిన్ పైలట్ శిబిరాల పిటిషన్ల విచారణను సుప్రీంకోర్టు సోమవారం విచారించనున్న సంగతి తెలిసిందే.

సీఎం చట్టాన్ని ఉల్లంఘించారు: బీజేపీ

రాష్ట్రంలోని పలువురు బీజేపీ నేతలు గవర్నర్ కల్‌రాజ్ మిశ్రాను శనివారం కలిశారు. రాజ్‌భవన్ ఘెరావ్ గురించి మాట్లాడిన సీఎం గెహ్లాట్ సెక్షన్ 124ను ఉల్లంఘించారని, దాదాపు దేశద్రోహానికి పాల్పడ్డారని ఆరోపించారు. గవర్నర్‌తో కరోనా పరిస్థితులపై చర్చించామని, రాష్ట్రంలో రాష్ట్రపతిపాలనను అర్థించలేదని వివరించారు.

కాంగ్రెస్ నిరసనలు

గవర్నర్ అసెంబ్లీని సమావేశపరచాలని డిమాండ్ చేస్తూ కాంగ్రెస్ కార్యకర్తలు జైపూర్ హెడ్‌క్వార్టర్‌లో ప్రదర్శనలు చేపట్టారు. బీజేపీ రాష్ట్ర ప్రభుత్వాన్ని కూలదోయాలని కుట్రలు చేస్తున్నదని, ఈ సందర్భంగా ప్రజాస్వామ్యం కోసం మాట్లాడాలని కాంగ్రెస్ దేశవ్యాప్తంగా ఆన్‌లైన్ క్యాంపెయిన్ నిర్వహించనున్నట్టు ఆ పార్టీ నేత కేసీ వేణుగోపాల్ తెలిపారు.



Next Story

Most Viewed