రైతులకు షాకింగ్ న్యూస్.. అలా చేస్తే రైతుబంధు కట్!!

by Anukaran |   ( Updated:2021-12-16 22:23:27.0  )
Raitubandhu
X

దిశ, తెలంగాణ బ్యూరో : రైతుబంధుకు బంధనాల ప్రక్రియ మొదలవుతోంది. ఇప్పటి వరకు కొండలు, గుట్టలు, లే అవుట్లు, బీడు, పడావు భూములన్నింటికీ రైతుబంధు ఇవ్వగా తాజాగా వరి సాకుతో ఆంక్షలు మొదలుకానున్నాయి. ఓవైపు రైతుబంధుకు ఆర్థిక కష్టాలు వెంటాడుతున్నాయి. ప్రతీ సీజన్‌లో రూ.7,500 కోట్లు పెనుభారమవుతున్నాయి. ఈ భారాన్ని ఎంతోకొంత తగ్గించుకునేందుకు సర్కారు ప్లాన్ వేసినట్లు తెలుస్తోంది. దీనికి వ్యవసాయ శాఖపై నెపం వేస్తున్నట్లు భావిస్తున్నారు. ఇప్పటికే వరి వద్దని, యాసంగిలో ధాన్యం కొనమంటూ సీఎం కేసీఆర్ స్పష్టంగా ప్రకటించారు. తాజాగా వ్యవసాయ శాఖ వరి వేస్తే రైతుబంధు కట్ చేయాలని నివేదించినట్లు అధికార పార్టీ అనుకూల మీడియాలో కథనాలు వెలువరించారు. మరోవైపు ఈ నెల 15 నుంచే రైతుబంధు చెక్కులు జారీ అంటూ ప్రభుత్వం తరుపున ప్రకటించారు. కానీ అనూహ్యంగా దాన్ని వాయిదా వేశారు. వరి రైతులకు ఆపేయడంలో భాగంగానే చెక్కుల పంపిణీ వాయిదా వేశారనే అనుమానాలు సైతం వ్యక్తమవుతున్నాయి. దీనికి ఇప్పుడు సాకుగా ప్రత్యామ్నాయ పంటలు దొరికాయి. వరి వద్దని, ప్రత్యామ్నాయ పంటల వైపు వెళ్లాంటూ వ్యవసాయ శాఖ, ప్రభుత్వం పదేపదే చెప్పుతోంది. ఇప్పుడు రైతుబంధును లింక్​పెట్టింది.

54 లక్షల ఎకరాలకు ప్రశ్నార్థకమే..!!

రాష్ట్రంలో యాసంగి సీజన్‌లో 54 లక్షల ఎకరాల్లో వరి సాగు చేస్తున్నారు. యాసంగి సాధారణ సాగు 31 లక్షల ఎకరాలు ఉంటే.. గత ఏడాది యాసంగిలో 53 లక్షలు దాటింది. ముందస్తు అంచనాల ప్రకారం ఈసారి 54 లక్షల ఎకరాలు దాటుతుందని అంచనా వేశారు. కానీ అనూహ్యంగా ధాన్యం కొనుగోళ్ల ఇబ్బందులు తదితర అంశాలు రావడంతో వరిసాగు వద్దంటూ ప్రభుత్వం తేల్చి చెప్పింది. అయితే తాజాగా వరి వేస్తే రైతుబంధు నిలిపివేయాలంటూ వ్యవసాయ శాఖ సిఫారసు చేసినట్లుగా అధికారవర్గం నుంచి లీకులిచ్చారు. దీన్ని అధికార పార్టీ మీడియానే వెల్లడించింది. వరి వేయవద్దంటే రైతులు వినడం లేదని, ధాన్యం కొనమని కేంద్రం చెప్పుతుండటంతో వ్యవసాయ శాఖ కొద్దిరోజులుగా నిపుణులను సంప్రదించినట్లు వెల్లడించింది. దీనిలో భాగంగానే వ్యవసాయ శాఖ ఉన్నతాధికారులు ప్రతిపాదనలు చేశారని, వరి సాగు చేసే రైతులకు రైతుబంధును నిలిపివేస్తే కంట్రోల్​లోకి వస్తుందంటూ సూచించినట్లు నివేదికల్లో పేర్కొన్నట్లు లీకు చేశారు.

దీనిపై సీఎం కేసీఆర్ కూడా చిరునవ్వు నవ్వి రైతులపై కోపగించుకుంటే ఎలా అంటూ, పరిష్కారం ఆలోచిద్దామంటూ దాట వేశారంటూ కథనం సాగదీశారు. ఒకవేళ వరి సాగు చేసిన విస్తీర్ణానికి రైతుబంధు కట్​ చేయాలనుకుంటే 54 లక్షల ఎకరాలకు రైతుబంధు రానట్టే.

క్రాప్​ హాలిడేకు సూచనలా..?

ఈ వ్యవహారం మొత్తం రైతులను సందిగ్థంలో పడేసినట్లు అవుతోంది. వరి సాగు చేస్తే.. రైతుబంధు రాదని ప్రభుత్వానికి నివేదికలు ఇచ్చినట్లు చెప్పుతుండటంతో రైతులు సాగుపై ఆందోళనలో ఉంటున్నారు. ఇప్పటికే వరిసాగు చేయాలా.. వద్దా అనేది మిలియన్​డాలర్ల ప్రశ్నగా మారింది. అయినప్పటికీ.. గతేడు యాసంగితో పోలిస్తే వరిసాగు పెరుగుతోంది. బుధవారం నాటి నివేదికల ప్రకారం 13వేల ఎకరాల్లో వరి నార్లు వేశారు. గతేడు ఇదే సమయానికి వరిసాగు 5 వేల ఎకరాలే. కానీ ఈసారి పెరిగినట్లే కనిపిస్తోంది. ఇప్పుడు ధాన్యం కొనుగోలు చేయం, రైతుబంధు ఇవ్వమంటే రైతులు వరిసాగుకు దూరమవుతారనే అంచనాలు కూడా వేసుకుంటున్నారు. ఇలాంటి సమయంలో పంటలు సాగు చేయని భూములకు ఎకరాకు రూ.5 వేల చొప్పున రైతుబంధు ఇచ్చినా నష్టమేమీ లేదని, కానీ సాగు చేస్తే ధాన్యం కొనాలంటే ఇబ్బందులు వస్తాయనే కోణంలో కూడా ఈ విషయాన్ని లీకు చేసినట్లుగా రైతులు అనుమానిస్తున్నారు.

అటు ఆర్థిక కష్టాలు

మరోవైపు రైతుబంధుకు ఆర్థిక కష్టాలు వెంటాడుతున్నాయి. వాస్తవానికి మంగళవారం నుంచి రైతుల ఖాతాల్లో రైతుబంధు సొమ్ము జమ చేయనున్నట్లు వ్యవసాయ శాఖ వెల్లడించింది. కానీ దీనిపై ఎలాంటి నిర్ణయం బయటకు రాలేదు. రైతుల ఖాతాల్లో కూడా జమ కాలేదు. ఆర్థిక శాఖ అధికారులు మాత్రం రైతుబంధుకు సరిపడా నిధులు లేవంటున్నారు. ప్రస్తుతం రూ.3 వేల కోట్లు అందుబాటులో ఉన్నాయని, కానీ ఇప్పుడు పెరిగిన రైతుల ప్రకారం రూ. 7508 కోట్లు కావాలని లెక్కలేశారు. కొత్తగా 2.82 లక్షల మంది రైతులు రైతుబంధు ఖాతాల్లో చేరారు. వీరి చేరికతో అదనంగా 66,311 ఎకరాలు పెరిగింది. దీనికి మొత్తంగా రూ.7,508.78 కోట్లు కావాల్సి ఉంటోంది. కానీ ప్రస్తుతం అంత సొమ్ము కూడా ఆర్థిక శాఖ సర్దుబాటు చేయలేకపోతోంది. ఇదే సమయంలో వరి సాగు చేసే భూమికి రైతుబంధు కట్​చేస్తే.. ప్రభుత్వానికి భారీగానే మిగిలే అవకాశాలున్నాయి.

రెండు విధాలుగా లాభాలు

వరి సాగుకు.. రైతుబంధుకు లింకు పెట్టితే ప్రభుత్వానికి రెండు విధాలుగా కలిసి రానుంది. లీకులిచ్చినట్టుగానే వరిసాగుకు రైతుబంధు ఆపేస్తే సగానికిపైగా నిధులు ఖజానాలోనే ఉండనున్నాయి. వరి తప్ప ప్రత్యామ్నాయం లేదనుకునే రైతులు ఎలాగైనా వరిసాగు చేస్తారు. ప్రస్తుత అంచనా 54 లక్షల ఎకరాలు అనుకుంటే.. చివరకు 30 లక్షల్లో వరి సాగు చేసినా.. దాదాపుగా రూ. 1500 నుంచి రూ. 1800 కోట్ల వరకు ప్రభుత్వానికి మిగిలే అవకాశం ఉంది. మరోవైపు వచ్చే యాసంగి ధాన్యం కొనుగోలు చేయమంటూ కేసీఆర్​తేల్చి చెప్పారు. ఈ సమయంలో రైతుబంధు కూడా రాదనుకుంటే ప్రత్యామ్నాయ పంటల వైపు మళ్లే అవకాశాలు కూడా ఉన్నాయి. పప్పు దినుసులు, ఆహార ధాన్యాలు, కూరగాయలసాగు, ఆయిల్​ఫాం సాగును పెంచినట్లైతే ప్రభుత్వానికి వచ్చే ఇబ్బందులేమీ ఉండవు. ఇలా రైతులను భయపెట్టినా ప్రత్యామ్నాయ సాగు పెరుగుతుందని కూడా భావిస్తున్నారు. మొత్తంగా ఒకే దెబ్బకు రెండు పిట్టల సామెతలా సర్కారు కలిసి వచ్చే అవకాశాలున్నాయి.

పెద్దలకు వద్దంటారా..?

మరోవైపు వందల ఎకరాలు ఉన్నవాళ్లకు కూడా రైతుబంధు జమ అవుతోంది. ఇలాంటి అంశాన్ని గతంలో ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్​రెడ్డి అసెంబ్లీలోనే వ్యతిరేకించారు. తాజాగా మాజీ మంత్రి ఈటల రాజేందర్​ కూడా ఇదే ఎత్తిచూపారు. ఒకవేళ రైతుబంధు కష్టాల నుంచి తప్పించుకునేందుకు సీలింగ్​విధిస్తే కూడా కొంత కలిసి రానుంది. వాస్తవంగా రైతుబంధు లబ్ధిదారుల్లో మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, సినీ ప్రముఖులకు, వ్యవసాయాన్ని మానేసి ఉద్యోగాలు, వ్యాపారాలు చేసుకుంటున్నవారికి, విదేశాల్లో ఉంటున్నవారున్నారు. తెలంగాణ సామాజిక అభివృద్ధి నివేదిక ప్రకారం రాష్ట్రంలో రెండు హెక్టార్ల (సుమారు ఐదు ఎకరాల) కుపైగా వ్యవసాయ భూమి ఉన్నవాళ్లు 14.2%. వీరి ఆధీనంలో 44.6% వ్యవసాయ భూమి ఉంది. రైతు బంధు సాయంలో 44.6% వాటాదారులు. మిగతా 55.4% మందిలో పది ఎకరాలకుపైబడిన వారే. వీరిలో 3.3 శాతం మంది.. 19 శాతం భూముల్లో వ్యవసాయమే చేయడం లేదు. అయినా కూడా రైతు బంధు సాయం అందుతోంది.

అసంతృప్తులకు చెక్.. రైతు కేంద్రంగా టీఆర్ఎస్ ప్రోగ్రామ్స్!

Advertisement

Next Story

Most Viewed