- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
అప్పుల పరిమితి పెంచండి.. కేంద్రాన్ని కోరిన హరీశ్ రావు
దిశ, తెలంగాణ బ్యూరో : కరోనా పరిస్థితుల కారణంగా తెలంగాణ రాష్ట్రంలో లాక్‌డౌన్ విధించాల్సి వచ్చిందని, ఇప్పటికీ దాన్ని కొనసాగిస్తూనే ఉన్నామని, ఆర్థికంగా ఇబ్బందులను ఎదుర్కొంటున్నామని, దీన్ని దృష్టిలో పెట్టుకుని ఎఫ్ఆర్‌బీఎం కింద అదనపు రుణం తీసుకోడానికి అనుమతి ఇవ్వాలని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌కు రాష్ట్ర ఆర్థిక మంత్రి హరీశ్ రావు విజ్ఞప్తి చేశారు. ప్రస్తుతం ఎఫ్ఆర్‌బీఎం కింద రాష్ట్ర జీఎస్‌డీపీలో నాలుగు శాతం మేరకు మాత్రమే రుణాలను తీసుకునే పరిమితులు ఉన్నాయని, దీన్ని మరో శాతం పెంచి ఐదు శాతం వరకు తీసుకునేందుకు అనుమతి ఇవ్వాలని కోరారు. జీఎస్టీ కౌన్సిల్ సమావేశంలో పాల్గొన్న సందర్భంగా మంత్రి హరీశ్ రావు ఈ ప్రస్తావన చేశారు.
ప్రస్తుతం అమలవుతున్న లాక్‌డౌన్ ఎప్పటివరకు కొనసాగుతుందో తెలియదని, మే నెలలో ఈ కారణంగానే సుమారు రూ. 4,100 కోట్ల మేర ఆదాయాన్ని కోల్పోయామని వివరించారు. ఇలాంటి పరిస్థితుల్లో ఎఫ్ఆర్‌బీఎం పరిమితిని పెంచక తప్పదని, దేశ, రాష్ట్ర ఆర్థిక కార్యక్రమాలు పుంజుకోడానికి వీలు కలుగుతుందని, ఉద్యోగ కల్పన కూడా మెరుగవుతుందన్నారు. గత వారం జరిగిన కౌన్సిల్ సమావేశాల్లోనూ ఇదే విజ్ఞప్తి చేసిన హరీశ్ రావు ఇప్పుడు కూడా దాన్ని ప్రస్తావించడం గమనార్హం. గతేడాది కరోనా కారణంగా కొన్ని షరతులతో ఐదు శాతం వరకు రుణాలు తీసుకోడానికి కేంద్ర ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. ఈ ఏడాది కూడా దాన్నే కొనసాగించాలన్నది హరీశ్ రావు వాదన.
వ్యాక్సిన్ పంపిణీని వేగవంతం చేయాలి..
కొవిడ్ వ్యాక్సిన్‌ను కేంద్రం త్వరగా పంపిణీ చేయాలని కేంద్ర మంత్రికి హరీశ్ రావు విజ్ఞప్తి చేశారు. రాష్ట్రాల అవసరాలకు అనుగుణంగా వ్యాక్సిన్‌ను అందించేందుకు కేంద్ర ప్రభుత్వమే చొరవ తీసుకుని విదేశాల నుంచి దిగుమతి చేసుకోవాలని, అందుకు అనుగుణంగా వేగంగా చర్యలు చేపట్టాలని సూచించారు. దేశంలో ప్రజలందరికీ ఉచిత వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని త్వరగా చేపట్టి ప్రాణాలు కాపాడాలని కోరారు. అవసరాల మేరకు తగినంత మోతాదులో దేశీయంగా వ్యాక్సిన్ ఉత్పత్తి కావడం లేదని, దిగుమతి చేసుకుని ప్రణాళికాబద్ధంగా వేగంగా ప్రజలకు అందించాలని సూచించారు. థర్డ్ వేవ్ వస్తుందన్న శాస్త్రవేత్తల హెచ్చరిక నేపథ్యంలో వ్యాక్సినేషన్ కార్యక్రమం త్వరగా చేపట్టాలన్నారు.
కరోనా చికిత్సకు అవసరమైవ ఆక్సిజన్, పల్స్ ఆక్సీమీటర్లు, హ్యాండ్ శానిటైజర్లు, వెంటిలేటర్ సహా ఇతర వైద్య సామగ్రిపై పన్నుల విధింపు క్రమబద్ధీకరణ కోసం మేఘాలయ సీఎం కన్రాడ్ సంగ్మా నేతృత్వంలోని గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్ చేసిన సిఫారసులకు హరీశ్ రావు మద్దతు తెలిపారు.