రాష్ట్రంలో మూడ్రోజులు వర్షాలు

by Shyam |
రాష్ట్రంలో మూడ్రోజులు వర్షాలు
X

దిశ, న్యూస్‌బ్యూరో: రాష్ట్రంలో రాగల మూడ్రోజుల పాటు వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం ప్రకటించింది. ఈశాన్య మధ్యప్రదేశ్, దాని పరిసర ప్రాంతాలలో అల్పపీడనం కొనసాగుతుందని, దీనికి అనుబంధముగా 2.1 కిలోమీటర్ల ఎత్తువరకు ఉపరితల ఆవర్తనం కొనసాగుతోందన్నారు. వాయువ్య బంగాళాఖాతం, దాని పరిసర ప్రాంతాలలో సుమారుగా ఆగస్టు 13న అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని, వీటి ప్రభావంతో సోమవారం నుంచి అక్కడక్కడ ఉరుములు, మెరుపులతో కూడిన తేలికపాటి నుండి ఒక మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ కేంద్ర అధికారులు తెలిపారు. మంగళవారం రాత్రి వరకు ఆదిలాబాద్, నిర్మల్, కుమ్రంభీం ఆసిఫాబాద్, మంచిర్యాల, నిజామాబాద్, కామారెడ్డి, జగిత్యాల, రాజన్నసిరిసిల్ల, పెద్దపల్లి, కరీంనగర్, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, సిద్దిపేట, మెదక్, సంగారెడ్డి జిల్లాల్లో ఒకట్రెండు చోట్ల భారీ నుండి అతిభారీ వర్షాలు కురిసే అవకాశం ఉందన్నారు. బుధవారం వరకు రాష్ట్రంలోని అయా ప్రాంతాల్లో తేలికపాటి నుండి ఒక మోస్తరు వర్షాలు చాలా చోట్ల కురిసే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం ప్రకటించింది.

సోమవారం రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో ఎడతెరపి లేకుండా వర్షం కురిసింది. గ్రేటర్ పరిధిలోని అన్ని ప్రాంతాల్లో వర్షపాతం నమోదైంది. పలు జిల్లాల్లో భారీ వర్షం కురిసింది. నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ మండలం ఆలూరులో 17.1 సెంటీమీటర్ల వర్షం కురిసింది. అదే విధంగా నిజామాబాద్ జిల్లా నవీపేట మండంలో 16.6 సెంటీమీర్లు, రెంజల్ మండలంలో 13.8 సెంటీమీటర్లు, కామారెడ్డి జిల్లా గాంధారి మండలంలో 13.4 సెంటీమీటర్లు, కరీంనగర్ జిల్లా చిగురుమామిడి మండలంలో 13 సెంటీమీటర్లు, హుజురాబాద్ మండలంలో 11.9 సెంటీమీటర్లు, వరంగల్ అర్బన్ జిల్లా ధర్మసాగర్ మండలంలో 11.8 సెంటీమీటర్ల వర్షం కురిసింది. కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్, ములుగు జిల్లా తాడ్వాయి, రాజన్న సిరిసిల్ల జిల్లా ఇల్లంతకుంట, నిజామాబాద్ జిల్లా మక్లూరు, సిద్దిపేట జిల్లా కోహెడ, నిజామాబాద్ జిల్లా కమ్మర్‌పల్లి, వరంగల్ రూరల్ జిల్లా శాయంపేట ప్రాంతాల్లో సగటు వర్షపాతం 10 సెంటీమీటర్లు నమోదైంది. ములుగు, జయశంకర్ భూపాలపల్లి, వరంగల్ అర్బన్, వరంగల్ రూరల్, నిర్మల్, కరీంనగర్, పెద్దపల్లి జిల్లాలో వర్షం కురిసింది.

Advertisement

Next Story