Homosexual వ్యక్తులను ప్రతిబింబించేలా LGBTQ జెండాలో మార్పు

by Shyam |   ( Updated:2021-06-13 05:40:57.0  )
rainbow-flag
X

దిశ, ఫీచర్స్ : ప్రపంచ వ్యాప్తంగా ఎల్‌జీబీటీక్యూ స‌భ్యులు జూన్ నెలలో వేడుక‌లు చేసుకుంటారు. ఇది వారికి ప్రైడ్ మంత్. స్వలింగ సంప‌ర్కుల‌ హ‌క్కుల కోసం తొలిసారిగా ఈ నెల‌లోనే అమెరికా‌లో ‘స్టోన్‌వాల్‌‌’ నిర‌స‌న‌లు జ‌రిగాయని చెప్పుకుంటారు. వీటి త‌ర్వాతే అమెరికాతోపాటు చాలా ప్రాంతాల్లో స్వలింగ సంప‌ర్కుల‌కు ప్రత్యేక హ‌క్కులు ల‌భించాయి. దాంతో ఎన్నాళ్లో వివక్షకు గురవుతున్న ఎల్‌జీబీటీక్యూ (లెస్బియన్లు, గే, బైసెక్సువల్, ట్రాన్స్‌జెండర్స్‌..)లు ఈ గొప్ప పరిణామాన్ని పండగ సెలబ్రేట్ చేసుకోవడం మొదలుపెట్టారు.

త‌మ ప్రేమ‌, స్నేహ భావాల‌నూ తెలుపుతూ, వారి హక్కులపై అవగాహన కల్పిస్తూ ప‌రేడ్‌లు, మార్చ్‌లు చేస్తుంటారు. ఈ క్రమంలోనే వాళ్లు తమ కమ్యూనిటీని రిప్రజెంట్ చేసేలా ఇంద్రధనస్సు రంగుల్లో ఓ ప్రత్యేకమైన జెండాను కూడా రూపొందించుకున్నారు. అయితే ప్రైడ్ మంత్‌లో భాగంగా, ఆ జెండాలో తాజాగా మార్పులు చేసి, ఇంటర్ సెక్స్‌ పీపుల్‌ను ప్రతిబింబించేలా తీర్చిదిద్దారు.

‘హ్యాపీ ప్రైడ్ 2021! ఎల్‌జీబీటీక్యూ ఉద్యమంలో ఇంటర్‌సెక్స్ చేరింది. ఇంటర్‌సెక్స్ ప్రజలను కూడా మాతో పాటు ఒక్కటి చేసేందుకు ప్రైడ్ ప్రోగ్రెస్ ఫ్లాగ్‌ను మార్చుతూ కొత్తగా డిజైన్ చేశాం’ అని ఇంటర్‌సెక్స్ ఈక్వాలిటీ రైట్స్ యూకే హ్యాండిల్‌ ద్వారా ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేశారు. కొత్త జెండా ఇంటర్‌సెక్స్ ప్రజల దృష్టిని అమితంగా ఆకర్షిస్తోంది. ఈ జెండా(ప్రైడ్ ప్రోగ్రెస్ ఫ్లాగ్‌) విషయం తెలుసుకున్న ప్రపంచవ్యాప్త ఇంటర్‌సెక్స్ వ్యక్తులు తమ ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు.

ఇంటర్‌సెక్స్ జెండాను వాస్తవానికి ఇంటర్‌సెక్స్ హ్యూమన్ రైట్స్ ఆస్ట్రేలియాకు చెందిన మోర్గాన్ కార్పెంటర్ 2013లో రూపొందించారు. ఇక ఎల్‌జీబీటీక్యూ ఫ్లాగ్ విషయానికి వస్తే.. ఇది 1978 నాటిది. బహిరంగ స్వలింగ సంపర్కుడు అమెరికన్ ఆర్టిస్ట్, యాక్టివిస్ట్, డిజైనర్ గిల్బర్ట్ బేకర్ తొలి రెయిన్‌బో ఫ్లాగ్‌ను రూపొందించాడు. స్వలింగ సంపర్కుల కోసం గర్వపడే(ప్రైడ్) చిహ్నాన్ని సృష్టించమని యు.ఎస్ లో బహిరంగంగా స్వలింగ సంపర్కుడిగా ఎన్నుకోబడిన అధికారులలో ఒకరైన హార్వే మిల్క్ తనను కోరినట్లు బేకర్ తరువాత వెల్లడించాడు.

జెండాలోని భిన్న రంగులు( రెడ్, ఆరెంజ్, ఎల్లో, గ్రీన్, వయొలెట్, ఇండిగో) గే సమాజంలోని ‘వైవిధ్యంతో’ సంబంధం కలిగి ఉంటాయి. అంతేకాదు శృంగారానికి గులాబీ, జీవితానికి ఎరుపు, హీలింగ్ -నారింజ, సూర్యరశ్మికి పసుపు, ప్రకృతికి ఆకుపచ్చ, సామరస్యం కోసం ఇండిగో, ఆత్మ కోసం వైలెట్ ప్రతీకలుగా నిలుస్తాయి. జూన్ 25, 1978న శాన్‌ఫ్రాన్సిస్కో గే ఫ్రీడం డే పరేడ్‌లో ఈ రెయిన్‌బో జెండా ఎగిరింది. అయితే కాలక్రమంలో ఇంద్రధనస్సు జెండా అనేక మార్పులను చూసింది. ఆ తర్వాత ఇండిగోను నీలిరంగుతో భర్తీ చేశారు. ఆ తర్వాత అమెరికన్ పౌర హక్కుల కార్యకర్త అంబర్ హైక్స్ నాయకత్వంలో ప్రజల వర్ణాన్ని ప్రతిబింబించేలా 2017లో జెండాలో బ్లాక్ అండ్ బ్రౌన్ రంగు చారలను చేర్చాడు. మళ్ళీ 2018 లో, జెండాను ట్రాన్స్‌జెండర్ కమ్యూనిటీ చేర్చడానికి డేనియల్ క్వాసర్ పున: రూపకల్పన చేశాడు. ఇక ఇప్పుడు ఇంటర్‌సెక్స్ వ్యక్తుల కోసం మరోసారి జెండాను మార్చగా, ఇందులో భాగంగా, రెయిన్ బో జెండాకు, ఇంటర్ సెక్స్ ఫ్లాగ్ మిక్స్ చేశారు.

‘ఇంటర్ సెక్స్ పీపుల్ పుట్టుకతోనే పర్టిక్యులర్ సెక్స్ క్యారెక్టర్ లక్షణాలతో జన్మిస్తారు. వారిని ఆడ, మగగా విభజించలేం. వాళ్లు పరిపూర్ణులు అంతే’ అని యునైటెడ్ నేషన్స్ ఫ్రీ అండ్ ఈక్వల్ వెబ్‌సైట్ నిర్వచించింది.

Advertisement

Next Story