హైటెక్ సిటీకి తీరనున్న.. ‘హై స్పీడ్’ కష్టాలు

by Shyam |
Railway under bridge
X

దిశ, కూకట్ పల్లి: కూకట్​పల్లి ట్రాఫిక్​జామ్​కు కేరాఫ్​అడ్రస్​.. హైటెక్ సిటీకి కూతవేటు దూరంలో ఉండడంతో నిత్యం వాహనాల రద్దీ.. ఆ రహదార్లు వాహనదారులకు నరకాన్ని పరిచయం చేస్తున్నాయి. ఉదయం, సాయంత్ర లక్షల సంఖ్యలో వాహనాల రాక పోకలు సాగుతుంటాయి. ఈ రోడ్డు గుండా ప్రయాణించాలంటనే జనం బేజారవుతుంటారు. హైటెక్ సిటీ సమీపంగా ఉండటంతో సాఫ్ట్​వేర్, ఐటీ ఉద్యోగులకు కేంద్రంగా కూకట్ పల్లి ప్రాంతం మారింది. రోజూ కిలోమీటర్ల మేర ఏర్పడుతున్న ట్రాఫిక్ జాం సమస్యను పరిష్కరించడానికి కేపీహెచ్బీ కాలనీ నుంచి హైటెక్ సిటీ వరకు రైల్వే ఓవర్ బ్రిడ్జితో పాటు దానికి ప్రత్యామ్నాయ మార్గంగా రైల్వే అండర్ బ్రిడ్జి ఏర్పాటు పనులు చేపట్టారు. పనులు చురుకుగ్గా కొనసాగుతుండడంతో మరో నెల రోజుల్లో అందుబాటులోకి రానుంది.

59.09 కోట్లతో ఆర్ యూబి నిర్మాణ పనులు:

కూకట్​పల్లిలో ట్రాఫిక్ కష్టాలను అధిగమించేందుకు అధికారులు ప్రత్యేక ప్రణాళికలు రూపొందించారు. అత్యధికంగా సాఫ్ట్ వేర్, ఐటీ ఉద్యోగులు నివసిస్తుండడంతో నిత్యం హైటెక్​సిటీకి రాకపోకలు కొనసాగిస్తుంటారు. ఈ క్రమంలో లక్షలాది వాహనాలతో నిత్యం ట్రాఫిక్​సమస్యలు తలెత్తుతున్నాయి. దీంతో ట్రాఫిక్​సమస్యలకు చెక్​పెట్టేందుకు అండర్​రైల్వే బిడ్జి నిర్మాణానికి పూనుకున్నారు. ఈ క్రమంలో కేపీహెచ్​బీ కాలనీ 7వ ఫేజ్ ఇందూ ఫార్చ్యూన్ ఫీల్డ్స్ ఎదురుగా రైల్వే అండర్ బ్రిడ్జి నిర్మాణ పనులకు పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ 2019 నవంబర్ 14వ తేదీన శంకుస్థాపన చేశారు. రూ.59.09 కోట్ల వ్యయంతో నిర్మాణ పనులను చేపడుతున్నారు. 410 మీటర్ల పొడవు, 20.60 మీటర్ల వెడల్పుతో బ్రిడ్జి ఏర్పాటు చేస్తున్నారు. ఈ పనులను మార్చిలో గా పూర్తి చేసి ప్రజలకు అందుబాటులో తీసుకు వచ్చేందుకు ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు, జోనల్ కమిషనర్ మమత పనులను ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నారు.

అభివృద్ధితో పాటు కళాకారులకు ఉపాధి

రూ.59 కోట్ల వ్యయంతో చేపడుతున్న ఆర్ యూబీ నిర్మాణ పనులు కళాకారులకు సైతం జీవనోపాధి కల్పిస్తుంది. బ్రిడ్జి నిర్మాణ పనులు చివరి దశకు చేరుకున్నాయి. బ్రిడ్జి గుండా ప్రయాణం సాగించే వారిని ఆకట్టుకునేలా అధికారులు బ్రిడ్జి మొదలు నుంచి చివరి వరకు రంగు రంగుల చిత్రాలు చిత్రీకరిస్తున్నారు. ఇందులో ప్రత్యేకంగా స్వచ్ఛ భారత్, పరిసరాల పరిశుభ్రత, అడవుల సంరక్షణ, పర్యావరణ పరిరక్షణ అంశాలపై అవగాహన కల్పించేలా బొమ్మలను చిత్రీకరిస్తున్నారు. సివిల్ పనులు పూర్తి కాగా కేవలం రంగులు వేసే కార్యక్రమమే మిగిలి ఉందని సిబ్బంది చెబుతున్నారు. గత రెండు నెలలుగా 60 శాతం వరకు బొమ్మలు వేసే పని పూర్తి చేయడం జరిగిందని, మిగిలిన కొంత భాగంలోవేయాల్సి ఉందని తెలిపారు.

రెండు నెలలుగా చేస్తున్నాం
రెండు నెలలు గా బ్రిడ్జి మొత్తం బొమ్మలు, రంగు రంగుల పూలను చిత్రీకరించే పనుల్లోఉన్నాం. ఇంకా నెల రోజుల్లో పనులు పూర్తి అవుతాయి. గతంలో ఉప్పుగూడ అండర్ బ్రిడ్జి పనులను రెండు నెలలో పూర్తి చేశాం. బ్రిడ్జి పనులతో మాకు ఉపాధి దొరికింది. –దీపక్, ఆర్టిస్ట్

ఉపాధి పొందుతున్నాం
బ్రిడ్జి పనులతో ఉపాధి లభించింది. రెండు నెలలుగా బ్రిడ్జి పనులు చేపడుతున్నాం. ఎన్నో ఏండ్ల వరకు మేము గీసిన చిత్రాలు సజీవంగా దర్శనమిస్తాయన్న సంతోషం ఎంతో ఉంది. వాహనదారులకు ఆహ్లాదకరంగా ఉండేందుకు ఆలోచింపజేసే రంగురంగుల చిత్రాలు వేస్తున్నాం. – నాగరాజు, ఆర్టిస్ట్

Advertisement

Next Story

Most Viewed