రాహుల్‌ వివాదాస్పద కామెంట్స్

by Shamantha N |
రాహుల్‌ వివాదాస్పద కామెంట్స్
X

తిరువనంతపురం: కాంగ్రెస్ మాజీ అధ్యక్షుడు, వయానాడ్ ఎంపీ రాహుల్ గాంధీ కేరళలో చేసిన వ్యాఖ్యలు ఆయనను వివాదంలో పడేశాయి. కేరళలో రాజకీయాలు లోతైనవని, ఇక్కడి ప్రజలు రాజకీయ ఉపరితలానికి పరిమితం కారని, సమస్యను క్షుణ్ణంగా పరిశీలించడానికి ఆసక్తి చూపుతారని వివరించారు. గత 15ఏళ్లుగా తాను ఉత్తరాదిలో ఎంపీగా వ్యవహరించానని, అప్పుడు వేరే రాజకీయాలను చూశానని కేరళలో ఓ ర్యాలీని ఉద్దేశించి మంగళవారం తెలిపారు.

తాను కేరళకు రావడం రీఫ్రెషింగ్‌గా ఉన్నదని, హఠాత్తుగా ఉపరితల రాజకీయాలకు పరిమితమయ్యే ప్రజలు కాకుండా సమస్య మూలాలపై ఆసక్తి చూపే ప్రజలు లభించారని అన్నారు. కేరళ ప్రతిపక్ష కాంగ్రెస్ నేత రమేశ్ చెన్నితల నిర్వహిస్తున్న ఐశ్వర్య యాత్రలో పాల్గొన్న రాహుల్ గాంధీ ఈ వ్యాఖ్యలు చేశారు. రాహుల్ గాంధీ వ్యాఖ్యలు దేశాన్ని విచ్ఛిన్నం చేసేలా ఉన్నాయని బీజేపీ దాడికి దిగింది. రాహుల్ వ్యాఖ్యలు బాధాకరమని ఎంపీ స్మృతి ఇరానీ విమర్శించారు. కేంద్ర విదేశాంగ మంత్రి జైశంకర్ ట్వీట్ చేస్తూ దేశం ఒక్కటేనని, ప్రాంతాల వారీగా వేరుచేసి మాట్లాడవద్దని, ఎప్పటికీ విభజించవద్దని పేర్కొన్నారు. కాగా, కాంగ్రెస్‌కూ దేశమంతా ఒక్కటేనని, ఉత్తరాది నుంచే కాంగ్రెస్ ఉన్నత నేతలు ఎన్నికై పాలన చేశారని పార్టీ నేత ఆనంద్ శర్మ అన్నారు.

Advertisement

Next Story

Most Viewed