జగన్‌ను పల్లెత్తు మాట అనలేదు

by  |
జగన్‌ను పల్లెత్తు మాట అనలేదు
X

దిశ, ఏపీ బ్యూరో: నరసాపురం ఎంపీ రఘురామ కృష్ణంరాజు హస్తినలో రాజకీయాన్ని రక్తికట్టిస్తున్నారు. అందితే జుట్టు, అందకపోతే కాళ్లు అన్న రీతిన… గతనెల రోజులుగా సొంత పార్టీపై తిరుగుబావుటా ఎగురవేసిన రఘురామకృష్ణం రాజు, షోకాజ్ నోటీసులందగానే ఢిల్లీకి పయనమయ్యారు. తొలుత లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లాతో సమావేశమైన తర్వాత జాతీయ ఎన్నికల కమిషన్‌ను కలిసి షోకాజ్ నోటీసు పంపే అధికారం పార్టీకి ఉందా? అని ఆరాతీశారు. ఆ పార్టీ జెండాపై పోటీ చేసి గెలిచి, ఆ పార్టీ సార్వభౌమత్వాన్ని ప్రశ్నించడం చట్టప్రకారం నిలిచే అవకాశం లేదని తేలిన నేపథ్యంలో తాను పార్టీని కానీ, పార్టీ అధినేతను కానీ పల్లెత్తుమాట అనలేదని తేల్చి చెప్పారు.

ఇవాళ కేంద్రమంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌, హోం శాఖ సహాయమంత్రి కిషన్‌రెడ్డిని కూడా కలిశారు. ఇతర బీజేపీ నేతలతో సమావేశమయ్యారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ తమ పార్టీ ఎంపీ విజయసాయిరెడ్డి సోషల్ మీడియాను ఉపయోగించుకుని తనపై కుట్రలకు పాల్పడుతున్నారని ఆరోపించారు. సీఎం జగన్‌ను తాను పల్లెత్తు మాట అనకపోయినా తన అనుకూల సోషల్ మీడియాలో, ఆయన సామాజికవర్గానికి చెందిన గ్రూపుల్లో తప్పుడు ప్రచారం చేస్తున్నారని విమర్శించారు. తనపై లేనిపోని అవాస్తవాలను ప్రచారం చేయిస్తున్నారని మండిపడ్డారు. తనకు సంబంధం లేని ఒక కేసును తనకు లింక్ చేసి బురద చల్లే ప్రయత్నం చేస్తున్నారని, పార్టీని నుంచి తనను పంపించేసి, స్వచ్ఛందంగా పార్టీ నుంచి వెళ్లిపోయానని చిత్రీకరించేందుకు ప్రయత్నిస్తున్నారన్నారు. తన ప్రాణాలకు ముప్పుందని కిషన్‌రెడ్డితో చెప్పి, కేంద్ర భద్రతా సిబ్బందితో రక్షణ కల్పించాలని కోరానని స్పష్టం చేశారు. తనపై కక్షగట్టిన విజయసాయిరెడ్డి.. తనపై దాడులకు తెగబడేలా కుట్రలు చేస్తున్నారని ఆయన ఆరోపించారు.


Next Story

Most Viewed