ఢిల్లీ హైకోర్టుకు ఆర్ఆర్ఆర్

by srinivas |
ఢిల్లీ హైకోర్టుకు ఆర్ఆర్ఆర్
X

దిశ, ఏపీ బ్యూరో: వైఎస్సార్సీపీ రెబెల్ ఎంపీ రఘురామకృష్ణం రాజు గత కొంత కాలంగా సొంత పార్టీపై తీవ్ర పోరాటం చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ పోరాటాన్ని ఇదివరకే ఢిల్లీ తీసుకెళ్లిన రఘురామకృష్ణం రాజు ఇప్పుడు ఢిల్లీ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. తనకు భద్రత కల్పించడం పై ఢిల్లీ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసిన సంగతి తెలిసిందే. దీనిపై ఆయన మాట్లాడుతూ, తనకు రాష్ట్ర బలగాలతో భద్రత వద్దని, కేంద్ర ప్రభుత్వ బలగాలతో భద్రత కల్పించాలని పిటిషన్‌లో కోరామని చెప్పారు. తన సొంత నియోజకవర్గం నరసాపురంలో తాను పలు కార్యక్రమాలు నిర్వహించాల్సి ఉందని, వాటికి హాజరుకాలేకపోతున్న నేపథ్యంలో తనకు కేంద్ర బలగాలతో భద్రత కల్పిస్తే నియోజకవర్గంలో ప్రజాసేవలో పాల్గొంటానని పిటిషన్‌లో పేర్కొన్నట్టు తెలిపారు. దీనిని విచారించిన ఢిల్లీ హైకోర్టు ఇంటెలిజెన్స్ బ్యూరో ద్వారా నివేదికలు తెప్పించుకుని భద్రత కల్పించాలని సూచించిందని చెప్పారు. దీనిపై రేపు రాష్ట్రపతిని కలిసి, రక్షణ కోరనున్నానని ఆయన వెల్లడించారు. ఈ సందర్భంగా రాష్ట్రంలో నెలకొన్న పరిస్థితిని ఆయనకు వివరిస్తానని, రాజధాని అంశంపై కూడా ఆయనకు వివరిస్తానని రఘురామకృష్ణం రాజు అన్నారు. మూడు రాజధానుల అంశంపై రాష్టపతికి లేఖ ఇస్తానని చెప్పిన ఆయన, అమరావతిని ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్‌గా కొనసాగించాలని డిమాండ్ చేశారు. అలాగే రాష్ట్ర ప్రభుత్వం దేవాదాయ ధర్మాదాయ శాఖ నిధులను అమ్మఒడి పథకానికి కేటాయించడాన్ని ఆయన ఆక్షేపించారు. తన సొంత పార్టీలోని మంత్రే తనపై ఫిర్యాదు చేశారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. అయోధ్యలో రామ మందిర్ నిర్మాణానికి తన వంతుగా 3 లక్షల 96 వేల రూపాయలను అందిస్తున్నట్టు చెప్పారు. ఈ మేరకు ట్విట్టర్‌లో చెక్ ఫోటో పెట్టారు. అయోధ్యలో రామమందిర నిర్మాణానికి ప్రతి ఒక్కరు తమ వంతుగా సహాయం అందించాలని ఆయన పిలుపునిచ్చారు.

👉 Download Dishadaily Android App
👉 Download Dishadaily IOS App
👉 Follow us on whatsApp channel
👉 Follow us on Share chat

Next Story

Most Viewed