‘సీఎంకి కూడా నోటీసులు పంపుతాడేమో’

by srinivas |
raghurama krishnam raju,
X

దిశ ఏపీ బ్యూరో: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో గత రెండు రోజులుగా నరసాపురం ఎంపీ రఘురామకృష్ణరాజు హాట్ టాపిక్‌గా మారారు. షోకాజ్ నోటీసులందగానే వారం రోజుల్లో సమాధానమిస్తానంటూ, మూడు రోజుల క్రితం దిల్లీ వెళ్లిన రఘురామకృష్ణం రాజు అక్కడ లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లా, జాతీయ ఎన్నికల కమిషన్‌తో పాటు పలువురు బీజేపీ నేతలను కలిశారు. ఈ క్రమంలో ఇంగ్లిష్ మీడియం విద్యను అమలు చెయ్యడం రాజ్యాంగ విరుద్ధమని, రాజ్యాంగ ఉల్లంఘనకి పాల్పడుతున్న పార్టీ మనుగడ సాధ్యమా? అని ప్రశ్నించిన ఆయన, దిల్లీలో మాట్లాడుతూ, తానేనాడూ పార్టీని కానీ, పార్టీ అధినేతను కానీ విమర్శించలేదని స్పష్టం చేశారు.

తనకు పంపిన షోకాజ్ నోటీసులు నేరుగా తనకు అందలేదని వెల్లడించారు. ఒక మీడియా సంస్థ ద్వారా తనకు షోకాజ్ నోటీసులు వచ్చినట్టు చెప్పారు. తానింతవరకు పార్టీకి వ్యతిరేకంగా ఒక్క ముక్క కూడా మాట్లాడలేదని తెలిపారు. అయినప్పటికీ తనకు షోకాజ్ నోటీసులు పంపారని ఆవేదన వ్యక్తం చేశారు. తనకు నోటీసులు ఎందుకు పంపారో ఇప్పటికీ అర్థంకాక తల బద్దలు కొట్టుకుంటున్నానని రఘురామకృష్ణం రాజు తెలిపారు. తానింత వరకు మూడు లేక నాలుగు సార్లే బహిరంగంగా మాట్లాడానని తెలిపారు. అది కూడా ఒకసారి పార్లమెంటులో భాష గురించి, రెండో సారి ఏపీలో స్కూళ్లను ఇంగ్లీషు మీడియం గురించి, మరోసారి టీటీడీ ఆస్తుల విక్రయం గురించి, ఇంకోసారి పార్టీ పరువు తీస్తున్న నేతల గురించి మాట్లాడానని అన్నారు.

ఇందులో భక్తులు ఇచ్చిన ఆస్తులను కాపాడుకోలేక అమ్ముకోవడం సరికాదని, ఆస్తుల విక్రయాలు ఆపాలని తాను చేసిన విజ్ఞప్తికి సీఎం సానుకూలంగా స్పందించి, ఆస్తుల విక్రయం నిర్ణయాన్ని విరమించుకున్నారని చెప్పారు. అయితే ఈ విషయంలో పార్టీ జనరల్ సెక్రటరీ తనకు నోటీసులు పంపడం ఏంటో తెలియడంలేదని, పార్టీ జాతీయ అధ్యక్షుడైన సీఎంకు కూడా నోటీసులు పంపుతాడేమోనంటూ వ్యంగ్యం ప్రదర్శించారు.

Advertisement

Next Story