జగన్ ప్రభుత్వంపై రాష్ట్రపతికి ఆర్ఆర్ఆర్ ఫిర్యాదు..

by srinivas |
జగన్ ప్రభుత్వంపై రాష్ట్రపతికి ఆర్ఆర్ఆర్ ఫిర్యాదు..
X

దిశ, ఏపీబ్యూరో:
ఏపీ ప్రభుత్వం పై రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్‌కు వైఎస్సార్సీపీ రెబల్, నరసాపురం ఎంపీ రఘురామకృష్ణం రాజు ఫిర్యాదు చేశారు. ఈ మధ్యాహ్నం రాష్ట్రపతిని కలిసిన ఆయన రాష్ట్రపతికి రెండు లేఖలు ఇచ్చారు. ఒకటి తన భద్రతకు సంబంధించిన అంశాలపై లేఖ కాగా, రెండోది రాష్ట్రంలో పాలన, ప్రభుత్వ విధానాలపై ఇచ్చారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. రాష్ట్రపతి తనకిచ్చిన సమయంలో ఎక్కువ సమయాన్ని రాజధాని అమరావతి గురించి మాట్లాడానన్నారు. అమరావతినే రాజధానిగా కొనసాగించాలని కోరానన్నారు. ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్‌గా అమరావతి ఉండాలని ఆయన ఆకాంక్షించారు. అంతేకాకుండా శాసనసభ, శాసనమండలిలో చోటుచేసుకున్న పరిణామాలను ప్రెసిడెంట్‌కు వివరించానని చెప్పారు. రాష్ట్ర ప్రజలు కూడా అమరావతినే రాజధానిగా ఉంచాలని కోరుతున్నారని చెప్పుకొచ్చారు.

మూడు రాజధానుల బిల్లు శాసనమండలిలో పాస్ కాకపోవడంతో మండలి ఛైర్మన్ దానిని సెలెక్ట్ కమిటీకి పంపించారని, అయితే చరిత్రలో ఎన్నడూ లేని విధంగా మండలి సెక్రెటరీ దానిని పక్కన పెట్టారని ఆక్షేపించారు. మండలి ఛైర్మన్ నిర్ణయాన్ని సెక్రెటరీయే ఒప్పుకోకపోవడం వ్యవస్థకే మంచికాదని ఆయన పేర్కొన్నారు. మండలిలో జరిగింది, శాసనసభలో జరగదన్న గ్యారెంటీ లేదని కూడా అభిప్రాయపడ్డారు. బిల్లు పాస్ కాలేదంటూ శాసనమండలినే రద్దు చేశారని ఆయన చెప్పారు. నెల రోజుల తర్వాత రాజధాని వికేంద్రీకరణ బిల్లు, సీఆర్‌డీఏ రద్దు బిల్లులను గవర్నర్‌కు పంపించారని ఆయన అన్నారు.

గవర్నర్ కూడా అటార్నీ జనరల్‌తో చర్చించాకే ఏ నిర్ణయమైనా తీసుకోవాలని ఆయన సూచించారు. తాడేపల్లిలో జగన్ గృహప్రవేశం చేసినప్పుడు ఎమ్మెల్యే రోజా మాట్లాడుతూ.. అమరావతే రాజధానిగా ఉంటుందని అన్నారని గుర్తుచేశారు. మరి ఇప్పుడెందుకు మాట మారుస్తున్నారో అర్థం కావట్లేదని పేర్కొన్నారు. మడమ తిప్పను, మాట తప్పను అని చెప్పి ఇప్పుడెందుకు మాట తప్పారని నిలదీశారు. ఎవరైనా దొంగ కేసులు పెడితే ప్రజలు ప్రభుత్వంపై తిరగబడాలని ఆయన చెప్పారు. రాజ్యాంగం కల్పించిన ఆర్టికల్ 19ని ఉపయోగించుకోవాలని సూచించారు.

ప్రభుత్వం ఏ కులాన్నైతే ద్వేషిస్తుందో.. ఆ కులం వారికంటే ఎక్కువగా ఎస్సీ, ఎస్టీలు రాజధానికి భూములిచ్చారని కృష్ణంరాజు అన్నారు. రాత్రికి రాత్రే రాజధాని విశాఖ తరలిపోయినా ఫర్వాలేదు కానీ, అమరావతి కోసం పోరాడదామని ఎంపీ పిలుపునిచ్చారు. రాయలసీమ వాసులు వైజాగ్ వెళ్లాలంటే బతుకులు తెల్లారిపోతాయని వివరించారు. గత ప్రభుత్వం అమరావతి కోసం చాలా డబ్బులు ఖర్చు చేసిందని వెల్లడించారు. వైజాగ్‌లో రాజధాని కట్టేందుకు డబ్బులేవని ప్రజలు ప్రభుత్వాన్ని నిలదీయాలని ఆయన సూచించారు.

అలాగే, రాజధానితో పాటు తన వ్యక్తిగత భద్రత కోసం కూడా రాష్ట్రపతికి విన్నవించానన్నారు. తనపై ప్రభుత్వానికి కోపం వచ్చిందని, ఫలితంగా తనపై మంత్రులు, ఎమ్మెల్యేలు పోలీసులకు ఫిర్యాదు చేయించారని, తన దిష్టిబొమ్మలు దగ్థం చేయించారని తెలిపారు. రాజ్యాంగాన్ని గౌరవించే తనలాంటి వ్యక్తికే పార్టీ నోటీసు ఇస్తే.. ఆపార్టీ రద్దయ్యే పరిస్థితి దాపురించిందని ఆయన ఎద్దేవా చేశారు. భవిష్యత్ ప్రమాదాన్ని గుర్తించకుండా తనకు నోటీసులు జారీ చేశారని చెప్పారు. టీటీడీ భూములు అమ్మాలనుకోవడం క్షమించరాని నేరమని రషురామకృష్ణంరాజు పేర్కొన్నారు.

రాష్ట్రంలో ఏం జరుగుతుందో రాష్ట్రపతికి ముందే తెలిసినట్టుగా ఉందని ఆయన అంచనా వేశారు. తాను చెప్పిన సమాచారం అంతా ఆయన దగ్గర ముందే ఉందని, కోర్టు ఆర్డర్ గురించి కూడా రాష్ట్రపతి వాకబు చేశారని తెలిపారు. తాను దాని గురించి రాష్ట్రపతికి ఏమీ చెప్పలేదని, లేఖలో కూడా ప్రస్తావించలేదని, అయితే నేరుగా ప్రెసిడెంట్ ఆ విషయం ప్రస్తావించడంతో ఆయన దగ్గర రాష్ట్రానికి సంబంధించిన పూర్తి సమాచారం ఉందని పేర్కొన్నారు.

Advertisement

Next Story