మనది ప్రజాస్వామ్యం రాచరికం కాదు: ఆర్ఆర్ఆర్

by Shyam |
మనది ప్రజాస్వామ్యం రాచరికం కాదు: ఆర్ఆర్ఆర్
X

దిశ ఏపీ బ్యూరో: నిమ్మగడ్డ రమేష్ కుమార్‌ను ఎస్ఈసీగా నియమించాలని సుప్రీంకోర్టు ఆదేశించిన నేపథ్యంలో వైఎస్సార్సీపీ రెబెల్ ఎంపీ రఘురామకృష్ణరాజు ముఖ్యమంత్రి జగన్‌ను ఉద్దేశిస్తూ, సుప్రీంకోర్టు నిర్ణయాన్ని గౌరవించి ఎస్ఈసీగా నిమ్మగడ్డను తిరిగి నియమించాలని సూచించారు. స్థానిక సంస్థల ఎన్నికలను వాయిదా వేస్తూ నిమ్మగడ్డ తీసుకున్న నిర్ణయం సరైనదని చెబుతూ, ఆయనను తిరిగి పదవిలోకి తీసుకుంటే తప్పేముందని ప్రశ్నించారు. అప్పుడు ఆయన తీసుకున్న నిర్ణయం కరోనా మహమ్మారి నుంచి ప్రజలను కాపాడిందని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వానికి కోర్టులకు లేదా రాజ్యాంగానికి వ్యతిరేకంగా వెళ్లే అధికారం లేదని స్పష్టం చేశారు.

మనది రాచరిక వ్యవస్థ కాదని చురకలంటించిన ఆయన, మనది ప్రజాస్వామ్య దేశమని గుర్తు చేశారు. న్యాయ వ్యవస్థలను, కోర్టులను గౌరవిద్దామని సీఎంకి హితవు పలికారు. రాష్ట్ర ప్రభుత్వానికి సూచనలు చేయడమే తన తప్పైపోయిందని ఆయన ఆరోపించారు. 22 మంది ఎంపీలను మీకు అప్పగిస్తాం, రఘురామకృష్ణరాజుపై అనర్హత వేటు వేయాలని ఢిల్లీకి వచ్చి మరీ వేడుకున్నారని రఘురామకృష్ణం రాజు ఎద్దేవా చేశారు. మనది ప్రజాస్వామ్యబద్ధంగా భారీ మెజార్టీతో ఎన్నికైన ప్రభుత్వమని, పక్కనున్న వారి మాటలు విని ప్రజా వ్యతిరేక నిర్ణయాలను తీసుకోవద్దని జగన్‌కి సూచించారు. రాజ్యాంగం మీద అవగాహన లేని కొంతమంది చేసే ఫిర్యాదులతో తనకేమీ కాదని ఆయన ధీమా వ్యక్తం చేశారు. ప్రజాస్వామ్య బద్ధంగా ఎన్నికైన ప్రజాప్రతినిధి గొంతును నొక్కే ప్రయత్నం చేయవద్దని ఆయన వైఎస్సార్సీపీ నేతలకు హితవు పలికారు.

Advertisement

Next Story

Most Viewed