ఆపరేషన్ స్మైల్: 42 మంది చిన్నారులకు విముక్తి

by Sumithra |   ( Updated:2021-01-09 10:05:43.0  )
ఆపరేషన్ స్మైల్: 42 మంది చిన్నారులకు విముక్తి
X

దిశ, క్రైమ్ బ్యూరో: ఆపరేషన్ స్మైల్ కార్యక్రమంలో భాగంగా ఇప్పటి వరకూ 42 మంది చిన్నారులను రెస్క్యూ చేసినట్టు రాచకొండ పోలీస్ కమిషనర్ మహేష్ భగవత్ తెలిపారు. ఈ క్రమంలో హయత్ నగర్ లోని రెండు వేర్వేరు పరిశ్రమలపై దాడి చేసి 15 మంది చిన్నారులను కాపాడామని ఆయన అన్నారు. శనివారం ఎల్బీనగర్ క్యాంప్ కార్యాలయంలో నిర్వహించిన మీడయా సమావేశంలో సీపీ మాట్లాడుతూ.. రాచకొండ యాంటీ హ్యుమన్ ట్రాఫికింగ్ యూనిట్, హయత్ నగర్ పోలీసులు, రంగారెడ్డి జిల్లా బాలల పరిరక్షణ సమితి, బచపన్ బచావో ఆందోళన్, స్పందన చిల్డ్రన్స్ సొసైటీ, ఆపరేషన్ స్మైల్ వనస్థలిపురం డివిజన్ టీమ్, హయత్‌నగర్ పోలీసుల సంయుక్త ఆధ్వర్యంలో ఆపరేషన్ స్మైల్ రెస్క్యూ చేస్తున్నామని అన్నారు. హయత్‌నగర్ పీఎస్ పరిధిలోని పసుమాముల గ్రామంలో శివ ట్రేడర్స్ కంపెనీలో 8 నుంచి 15 ఏళ్ల లోపు 5 గురు మైనర్ బాలికలు, కళా‌నగర్‌లోని పావనపుత్ర ప్లాస్టర్ కంపెనీ, లక్ష్మణ్ ప్లాస్టర్ కంపెనీలలో 10 మంది చిన్నారులను గుర్తించినట్టు తెలిపారు. వీరంతా మహారాష్ట్ర, ఉత్తర ప్రదేశ్, బీహార్ ప్రాంతాలకు చెందిన వారన్నారు. అయితే, రెస్క్యూ చేసిన పిల్లలను అక్కడి జిల్లా కలెక్టర్ తో మాట్లాడి తల్లిదండ్రుల వద్దకు పంపిస్తామన్నారు. తల్లిదండ్రుల వద్దకు పంపేందుకు అవకాశం లేని వారిని ప్రభుత్వ హోమ్ లకు తరలిస్తామని అన్నారు.

Advertisement

Next Story