ఫీల్డ్ అసిస్టెంట్ల తొల‌గింపు దారుణం: ఆర్.కృష్ణయ్య

by Shyam |
ఫీల్డ్ అసిస్టెంట్ల తొల‌గింపు దారుణం: ఆర్.కృష్ణయ్య
X

దిశ ప్ర‌తినిధి ,హైద‌రాబాద్: గ్రామీణ అభివృద్ధి ప‌థ‌కం కింద ప‌ని చేస్తున్న ఫీల్డ్ అసిస్టెంట్ల‌ను ఉద్యోగాల‌ నుండి తొల‌గించ‌డం అత్యంత దారుణ‌మ‌ని జాతీయ బీసీ సంక్షేమ ‌సంఘం అధ్య‌క్షుడు ,మాజీ ఎమ్మెల్యే ఆర్ కృష్ణ‌య్య అన్నారు. ఈ మేర‌కు తొల‌గించిన ఫీల్డ్ అసిస్టెంట్ల‌ను వెంట‌నే విధుల‌లోకి తీసుకోవాల‌ని డిమాండ్ చేస్తూ.. సోమ‌వారం హిమాయ‌త్‌న‌గ‌ర్‌లోని పంచాయత్ రాజ్ క‌మిష‌న‌ర్ కార్యాల‌యాల‌ను వంద‌ల సంఖ్య‌లో హాజ‌రైన ఫీల్డ్ అసిస్టెంట్లు ముట్ట‌డించారు. స‌మాచారం అందుకున్న నారాయ‌ణ‌గూడ పోలీసులు అక్క‌డికి చేరుకుని ఫీల్డ్ అసిస్టెంట్ల‌ను అదుపులోకి తీసుకుని ప‌లు పోలీస్ స్టేష‌న్ల‌కు త‌ర‌లించారు.

ఈ కార్య‌క్ర‌మానికి హాజ‌రైన ఆర్ కృష్ణ‌య్య ఫీల్డ్ అసిస్టెంట్ల అరెస్టును ఖండించారు . అనంత‌రం ఆయ‌న మాట్లాడుతూ.. రాష్ట్రంలో 7,610 మంది ఫీల్డ్ అసిస్టెంట్లు ప‌నిచేస్తుండ‌గా వారిని తొల‌గించడం హేయ‌మైన చ‌ర్య అన్నారు. ఉద్య‌మాలు చేస్తే విధుల నుంచి తొల‌గిస్తే ప్ర‌పంచంలో ఒక్క ఉద్యోగి కూడా మిగ‌ల‌ర‌ని అన్నారు. సుమారు 15 యేండ్లుగా విధులు నిర్వ‌హిస్తున్న వారిని తొల‌గించ‌డం ద్వారా వారి కుటుంబాలు వీధిన ప‌డ్డాయ‌ని, కొంత మంది ఇత‌ర ఉద్యోగాల‌కు అర్హ‌త కూడా కోల్పోయార‌ని అన్నారు. వీరిని తొల‌గించ‌డం రాజ్యాంగ విరుద్ధ‌మ‌ని,వెంట‌నే వారిని విధుల‌లోకి తీసుకోవాల‌ని,లేని ప‌క్షంలో సుమారు ల‌క్ష‌మందితో హైద‌రాబాద్ న‌గ‌రాన్ని ముట్ట‌డిస్తామ‌ని ఆర్ కృష్ణ‌య్య హెచ్చ‌రించారు . ఈ కార్య‌క్ర‌మంలో నిరుద్యోగ జేఏసీ నీల వెంక‌టేష్ , బీసీ సంక్షేమ సంఘం ఉపాధ్య‌క్షుడు గుజ్జ కృష్ణ త‌దిత‌రులు పాల్గొన్నారు.

Advertisement

Next Story