‘నాణ్యమైన పరిశోధనలు కొనసాగించాలి’

by Shyam |
‘నాణ్యమైన పరిశోధనలు కొనసాగించాలి’
X

దిశ,నిజామాబాద్ రూరల్: తెలంగాణ విశ్వవిద్యాలయం(టీఎస్‌యు)లో నాణ్యమైన పరిశోధనలు, శాస్త్ర సాంకేతిక అభివృద్ధిలో నూతన ఆవిష్కరణలు కొనసాగించాలని గవర్నర్ తమిళిసై సౌందర రాజన్ టీఎస్‌యు ఉపకులపతి ఆచార్య డి.రవీందర్ కు సూచించారు. జూన్ 2 తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం, గవర్నర్ తమిళిసై పుట్టినరోజు సందర్భంగా కొవిడ్-19 నిబంధనలను అనుసరించి బుధవారం సాయంత్రం రాజభవన్ లో ఆత్మీయ సమ్మేళనం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి హజరైన టీఎస్‌యు నూతన ఉపకులపతి ఆచార్య డి.రవీందర్ గవర్నర్‌ను మర్యాదపూర్వకంగా కలిసి పుష్పగుచ్చం, శాలువా ప్రదానం చేసి శుభాకాంక్షలు తెలియజేశారు.

ఈ సందర్భంగా గవర్నర్ మాట్లాడుతూ… ఉపకులపతిగా నియామకం పొందిన ఆచార్య డి.రవీందర్‌కి శుభాకాంక్షలు తెలియజేశారు. టీఎస్‌యు లో మంచి అకాడమిక్ వాతావరణాన్ని కల్పించి, అభివృద్ధి పథంలో నడపాలన్నారు. ఉన్నత విద్యా ప్రమాణాలను పెంపొందించాలని సూచించారు. వివిధ సబ్జెక్టుల్లో నాణ్యమైన పరిశోధనలు, శాస్త్ర సాంకేతిక అభివృద్ధిలో నూతన ఆవిష్కరణలు కొనసాగించాలని ఆదేశించారు. ఉద్యోగ, ఉపాధి అవకాశాల కల్పన కోసం విద్యార్థుల్లో వృత్తి విద్యా నైపుణ్యాలను విస్తృత పరిచే విధంగా శిక్షణ ఇవ్వాలని అన్నారు. అదే విధంగా పూర్వ విద్యార్థుల వ్యవస్థను బలోపేతం చేయాలని, అవసరమైతే విశ్వవిద్యాలయ అభివృద్ధిలో వారిని భాగస్వామ్యం చేయాలని అన్నారు.

Advertisement

Next Story

Most Viewed