భారత్‌లో భారీ పెట్టుబడికి PWC ఇండియా సుముఖత

by Harish |
భారత్‌లో భారీ పెట్టుబడికి PWC ఇండియా సుముఖత
X

దిశ, వెబ్‌డెస్క్: ప్రముఖ అంతర్జాతీయ కన్సల్టెన్సీ సంస్థ పీడబ్ల్యూసీ ఇండియా భారత్‌లో రూ. 1,600 కోట్ల పెట్టుబడులు పెట్టనున్నట్టు ప్రకటించింది. దీని ద్వారా రాబోయే ఐదేళ్లలో అదనంగా 10,000 ఉద్యోగాలను సృష్టించనున్నట్టు తెలిపింది. పీడబ్ల్యూసీ ఇండియా తన కొత్త వ్యాపారం వ్యూహంలో భాగంగా ‘ది న్యూ ఈక్వేషన్’ను బుధవారం ప్రకటించిన సందర్భంగా తమ క్యాంపస్ నియామకాలను ఐదు రెట్లు పెంచుతున్నట్టు వెల్లడించింది. కొత్తగా సంస్థ ప్రారంభించిన ఈ కార్యక్రమం కొత్త విశ్లేషణలు, క్లయింట్లు, వాటాదారులతో చర్చించిన తర్వాత రూపొందించినట్టు ఓ ప్రకటనలో తెలిపింది.

‘భారత్ బలమైన ఆర్థిక పునాదులను కలిగి ఉంది. దేశీయ జనాభా ద్వారా భారీ ప్రయోజనాలు, ఆవిష్కరణలను పెంచేందుకు వీలవుతుంది. తమ కొత్త వ్యూహం తమతో పాటు తమ క్లయింట్లు దేశ ఆర్థిక అభివృద్ధిని ముందుకు తీసుకెళ్లేందుకు అవకాశం కల్పిస్తుందని, దేశీయ మార్కెట్ సామర్థ్యాన్ని ఉపయోగించి మరిన్ని అవకాశాలను అందుకోగలమని’ పీడబ్ల్యూసీ ఇండియా ఛైర్మన్ సంజీవ్ క్రిషన్ అన్నారు. భారత్‌లో రాబోయే ఐదేళ్లలో సంస్థ పెట్టే పెట్టుబడులు, సృష్టించే ఉద్యోగాలను ఎక్కువగా డిజిటల్, క్లౌడ్, సైబర్, అనలిటిక్ విభాగాల్లో ఉంటాయని కంపెనీ పేర్కొంది. ప్రస్తుతం సంస్థ భారత్‌లో 15 వేల మంది ఉద్యోగులను కలిగి ఉంది.

Advertisement

Next Story

Most Viewed