ఫైనల్‌కు పీవీ సింధు.. ఓడిన శ్రీకాంత్

by Shiva |
ఫైనల్‌కు పీవీ సింధు.. ఓడిన శ్రీకాంత్
X

దిశ, స్పోర్ట్స్ : భారత స్టార్ షట్లర్ పీవీ సింధు స్విస్ ఓపెన్ 2021 మహిళల సింగిల్స్ ఫైనల్‌లో అడుగుపెట్టింది. ఈరోజు జరిగిన సెమీ ఫైనల్ మ్యాచ్‌లో డెన్మార్క్‌కు చెందిన మియా బ్లిక్‌ఫెల్డ్‌ను 22-20, 21-10 తేడాతో ఓడించింది. 43 నిమిషాల పాటు జరిగిన మ్యాచ్‌లో మియా తొలి గేమ్‌లో సింధుకు గట్టి పోటీ ఇచ్చింది. కానీ క్రమం తప్పకుండా పాయింట్లు సాధిస్తూ తొలి గేమ్ గెల్చుకున్నది. ఇక రెండో గేమ్‌లో మియా చేతులెత్తేసింది. సింధు వరుస పాయింట్లు సాధిస్తూ ఆధిపత్యం చెలాయించి మ్యాచ్ గెలుచుకున్నది. ఫైనల్‌లో ఆమె కరోలీనా మారిన్‌తో తలపడనున్నది.

ఇక పురుషుల సింగిల్స్‌లో కిదాంబి శ్రీకాంత్ సెమీస్‌లోనే వెనుదిరిగాడు. టాప్ సీడ్ విక్టర్ అలెక్సెన్‌తో తలపడిన శ్రీకాంత్ 13-21, 19-21 తేడాతో ఓడిపోయాడు. తొలి గేమ్‌లో అలెక్సన్ వరుసగా 6-0 ఆధిక్యంలోకి దూసుకొని పోయాడు. ఆ తర్వాత శ్రీకాంత్ పాయింట్లు సాధించినా.. అలెక్సన్ తొలి గేమ్ గెలుచుకున్నాడు. రెండో గేమ్‌లో శ్రీకాంత్ పోరాడినా టాప్ సీడ్ దూకుడు ముందు నిలువలేక ఓడిపోయాడు.

పురుషుల డబుల్స్‌లో భారత జోడి సాత్విక్ సాయిరాజ్-చిరాజ్ షెట్టి సెమీస్‌లో డెన్మార్క్‌కు చెందిన కిమ్ అస్ట్రప్- అండ్రెస్ రస్మూసెన్‌ చేతిలో 10-21, 17-21 తేడాతో ఓడిపోయారు.

Advertisement

Next Story