మరో 16 ఏండ్లు అధ్యక్షుడిగా ఆయనే

by  |
మరో 16 ఏండ్లు అధ్యక్షుడిగా ఆయనే
X

దిశ, వెబ్ డెస్క్: రష్యా అధ్యక్షుడిగా వ్లాదిమిర్‌ పుతిన్ పదవీ కాలం మరో నాలుగేళ్లు మిగిలి ఉన్నప్పటికీ, తన పదవి కాలాన్ని పొడిగించుకునేందుకు కొన్ని నెలలుగా చేస్తున్న ప్రయత్నాలు సఫలం అయ్యాయి. రష్యాకు 2036 వరకు తాను అధ్యక్షుడిగా కొనసాగేందుకు మార్గం సుగమం చేసుకున్నారు. దీనికి ఆ దేశ ప్రజలు కూడా పెద్ద ఎత్తున మద్దతు తెలిపారు.

ఇందు కోసం రాజ్యంగ సవరణకు వారు అంగీకరించారు. కొన్ని రోజులుగా రాజ్యాంగ సవరణ కోసం రష్యా ప్రజల అభిప్రాయాలను సేకరించే పనిలో ఉన్న ఆ దేశ ఎన్నికల సంఘం ఫలితాలు వెల్లడించింది. సుమారు 63 శాతం మంది ప్రజలు ఓట్లు వేయగా, అందులో 73 శాతం మంది పుతిన్‌కు సానుకూలంగా ఓట్లు వేసినట్టు ప్రకటించింది. అయితే, ఈ ఎన్నికల్లో అవకతవకలు జరిగాయంటూ పలువురు విమర్శలు గుప్పిస్తున్నారు. కొందరు నిరసన ప్రదర్శనలు చేపట్టారు. కాగా, రష్యా అధ్యక్షుడిగా పుతిన్ పదవీ కాలం పొడిగించడానికి జరగాల్సిన రాజ్యాంగ సవరణను రష్యా పార్లమెంట్ గత నెలలోనే ఆమోదించిన విషయం తెలిసిందే.

2024 తరువాత మరో 12 ఏళ్లు కూడా అధ్యక్షుడిగా కొనసాగేలా పుతిన్ సవరణ చేయించుకున్నారు. అంటే, ఇప్పటి నుంచి మరో 16 ఏళ్ల పాటు పుతినే అధ్యక్షుడిగా కొనసాగనున్నారు. ఆయన 2000 నుంచి రష్యా అధ్యక్షుడిగా కొనసాగుతున్నారు. రష్యాలో ఓ వ్యక్తి వరుసగా రెండు సార్లకు మించి అధ్యక్ష పదవి చేపట్టే వీలు లేదు. అయితే, తాజా సంస్కరణల ద్వారా ఆ నిబంధనను వరుసగా రెండు సార్లకు బదులుగా, రెండు సార్లుగా మార్చారు. ఇదివరకు అధ్యక్ష పదవి చేపట్టిన పర్యాయాలు ఇందులో లెక్కకురావని కూడా నిబంధన పెట్టారు. ఇలా మరో రెండు సార్లు ఆరేళ్ల చొప్పున అధ్యక్ష పదవి చేపట్టేందుకు పుతిన్‌కు వీలు కల్పించారు.


Next Story

Most Viewed