సినిమా ఫెస్ట్ : ‘పుతమ్ పుధు కాలై’

by Anukaran |
సినిమా ఫెస్ట్ : ‘పుతమ్ పుధు కాలై’
X

దిశ, వెబ్‌డె‌స్క్: బంధాలు.. అనుబంధాలు.. ప్రేమ.. ఆప్యాయత.. అద్భుతాలు.. ఐదు కథలు.. ఒక్క సిరీస్.. అదే ‘పుతమ్ పుధు కాలై’. అమెజాన్ ప్రైమ్‌లో రీసెంట్‌గా రిలీజైన ఈ సిరీస్‌‌లోని ఐదు కథలకు ఐదుగురు.. సుధ కొంగర (ఇలమై ఇదో ఇదో), గౌతమ్ మీనన్( అవరుమ్ ననుమ్ అవలుమ్ ననుమ్), సుహాసిని మణిరత్నం(ఎనీ వన్ కాఫీ), రాజీవ్ మీనన్(రీయూనియన్), కార్తీక్ సుబ్బరాజు( మిరాకిల్) దర్శకత్వం వహించారు. కాగా ఈ షార్ట్ ఫిల్మ్ సిరీస్ అభిమానులకు సినిమా ఫెస్టివల్‌ను అందించింది.

సుధ కొంగర (ఇలమై ఇదో ఇదో)..

ఒకప్పటి ప్రేమికులు ఇప్పుడు కలిస్తే ఎలా ఉంటుంది? ఒక్క రోజు కలిసి వెళ్లేందుకు వచ్చిన ప్రేమికురాలు.. లాక్‌డౌన్ కారణంగా 21 రోజులు అదే ఇంట్లో తనకు నచ్చిన ప్రియుడితో ఉంటే ఎలాంటి అనుభూతికి లోనవుతుంది? 50 ఏళ్ల వయసులో ఆ ప్రేమ అంతే పవిత్రంగా ఉందా? అంతే గౌరవం ఇస్తుందా?. మరి అంత గొప్ప ప్రేమజంట పిల్లలతో మాట్లాడి చివరికి ఎలాంటి నిర్ణయం తీసుకుంది? లాంటి విషయాలను హైలెట్ చేస్తూ పాస్ట్ యంగ్ జోడీ, ప్రజెంట్ జోడీని చూపిస్తూ.. వారిద్దరి మధ్య ప్రేమను చూపించడంలో సక్సెస్ అయ్యారు సుధ కొంగర. జయరాం, ఊర్వశి, కాళిదాస్ జయరాం, కళ్యాణి ప్రియదర్శన్ నటించిన ఈ షార్ట్ ఫిల్మ్ ఓ వైపు ఫన్ యాడ్ చేస్తూనే ఎమోషనల్ సీన్స్‌తో హార్ట్ టచింగ్‌గా ఉంది. జీవీ ప్రకాష్ అందించిన మ్యూజిక్ మరింత ప్లస్ కాగా.. కాళిదాస్ జయరాం, కళ్యాణి ప్రియదర్శన్ క్యూట్ కపుల్స్‌గా కనిపించారు.

గౌతమ్ మీనన్( అవరుమ్ ననుమ్ అవలుమ్ ననుమ్)

సీనియర్ నటుడు ఎంఎస్ భాస్కర్ అవార్డు కొట్టేసే అదిరిపోయే పర్ఫార్మెన్స్ ఇచ్చాడు. ప్రతీ సీన్, ప్రతీ డైలాగ్ అద్భుతం కాగా.. ఒక కమెడియన్‌కు మంచి క్యారెక్టర్ పడితే ఎంత గొప్పగా నటనలో జీవించగలడు అనేందుకు ఆయన యాక్టింగ్ నిదర్శనంగా నిలుస్తుంది. తాత క్యారెక్టర్‌లో భాస్కర్ ఒదిగిపోగా మనవరాలుగా కనిపించిన తెలుగమ్మాయి రీతు వర్మ.. అందం, అభినయంతో మెప్పించింది. డైరెక్టర్ గౌతమ్ మీనన్ రీతుని ప్రతీ ఫ్రేమ్‌లో అద్భుతంగా చూపించి ఆడియన్స్ కళ్లకు ఆనందాన్ని ఇచ్చాడు. ఈ షార్ట్ ఫిల్మ్‌తో కోలీవుడ్‌లో మరింత బిజీ అయిపోతుందని చెప్పినా అతిశయోక్తి కాదేమో! వయసు మీద పడిన శాస్త్రవేత్తగా కనిపించిన భాస్కర్.. కెరియర్ కంటే ఎక్కువగా ప్రేమించిన కూతురు తన నుంచి ఎందుకు విడిపోయింది? ఎందుకు అంత బాధను మిగిల్చింది? అనే కథను మనవరాలు రీతుతో చెప్పే ఎమోషనల్ సీన్.. ‘హా.. భాస్కర్ గారు మీ నటనకు ఖుదోస్’ అనేలా ఉంది.

సుహాసిని మణిరత్నం( ఎనీ వన్ కాఫీ?)

సుహాసిని మణిరత్నం డైరెక్షన్‌లో వచ్చిన ఈ షార్ట్ ఫిల్మ్ హాసన్ ఫ్యామిలీని ఒక దగ్గరికి చేర్చింది. సుహాసిని, అను హాసన్, శ్రుతి హాసన్ ప్రధాన పాత్రల్లో కనిపించగా.. కోమాలో ఉన్న తల్లికి హాస్పిటల్‌లో ట్రీట్మెంట్ ఇవ్వకుండా ఇంటికి తీసుకొచ్చిన తండ్రి నిర్ణయాన్ని వ్యతిరేకిస్తారు. కానీ తండ్రి నిర్ణయమే కరెక్ట్ అని చివరకు సంతోషంగా ఉన్నారు? ఇంతకీ దీనికి ఎలాంటి హ్యాపీ ఎండింగ్ ఇచ్చారు? చూడాల్సిందే. ఇందులో మ్యూజిక్ కంపోజర్‌గా కనిపించిన శ్రుతి.. చిన్న పాత్రతోనూ మెప్పించింది.

రాజీవ్ మీనన్ (రీయూనియన్)

ఈ స్టోరీలో ఆండ్రియా వెస్టర్న్ మ్యూజిక్ నేర్చుకున్న సింగర్‌గా చాలా స్టైలిష్‌గా కనిపించింది. లాక్‌డౌన్ కారణంగా ఉపాధి కోల్పోయి తిరిగి ఇంటికి వెళ్తున్న తనకు.. బైక్ ట్రబుల్ ఇవ్వగా పాత స్నేహితుడి ఇంటికి వెళ్తుంది. సిచువేషన్ బయట బాగా లేదని, లాక్‌డౌన్‌లో 21 రోజులు ఇక్కడే ఉంటే బాగుంటుందని చెప్తాడు. కానీ డ్రగ్ అడిక్ట్ అయిన సింగర్.. డ్రగ్ అందుబాటులో లేకపోవడంతో ఎలాంటి హెల్త్ ఇష్యూస్ ఎదుర్కొంటుంది? డాక్టర్ అయిన ఫ్రెండ్ తనను ఆ పరిస్థితి నుంచి ఎలా బయటపడేస్తాడు? అనేది కథ కాగా.. ఆండ్రియా ఎప్పటిలాగే మోడ్రన్ లుక్‌లో అదిరిపోయింది.

కార్తీక్ సుబ్బరాజు( మిరాకిల్)

అన్నింటి కన్నా డిఫరెంట్‌గా ఉన్న మిరాకిల్ స్టోరీలో డైరెక్టర్ టేకింగ్ చాలా చాలా ఫన్నీగా ఉంది. ఇద్దరు దొంగలు కలిసి చేసిన దొంగతనం.. నష్టాల్లో కూరుకుపోయి సూసైడ్ అటెంప్ట్ చేసిన ఓ నిర్మాతను ఎలా కాపాడింది? ఆ దొంగతనం ప్రొడ్యూసర్ లైఫ్‌లో ఎలాంటి మిరాకిల్ చేసింది? అనేది కథ కాగా.. ఫుల్ లెంగ్త్ ఎంటర్‌టైన్మెంట్ ఇచ్చింది. బాబీ సింహ, శరత్ రవి కాంబినేషన్‌లో సీన్స్ అన్నీ సూపర్ కామెడీని అందించాయి.

Advertisement

Next Story

Most Viewed