అలంకార ప్రాయంగా ఆ పదవులు.. ఆవేదనలో ప్రజాప్రతినిధులు

by Aamani |   ( Updated:2021-02-16 07:23:46.0  )
అలంకార ప్రాయంగా ఆ పదవులు.. ఆవేదనలో ప్రజాప్రతినిధులు
X

దిశ ప్రతినిధి, ఆదిలాబాద్ / దిశ, నిర్మల్ : అనుకున్నదొక్కటి.. అయ్యిందొక్కటి. రూ.లక్షలు ఖర్చు పెట్టి ఎన్నికల్లో గెలిస్తే సాధించింది శూన్యం. నిధులు విడుదల కావు.. విధులపై స్పష్టత ఉండదు. గెలిచి ఏడాదిన్నర అవుతున్నా అరకొర నిధులే దిక్కయ్యాయి. నిధులు, విధులపై స్పష్టత లేకపోవడంతో ప్రభుత్వ ఆఫీసులకు వెళ్లలేక.. పల్లెల్లో తిరుగలేక సతమతమవుతున్నారు. సేవ చేయలేని పదవులు ఎందుకనే అభిప్రాయం వారిలో నెలకొనగా.. సర్కారు నిధుల ఇస్తుందని నిరీక్షిస్తున్నారు.. గత ఎనిమిది నెలలుగా 15వ ఆర్థిక సంఘం నిధులు అంతంత మాత్రంగానే వస్తుండగా, గతంలో బీఆర్జీఎఫ్ నిధుల వాటా విధానం అమలు చేయాలని పలువవురు డిమాండ్ చేస్తున్నారు.

ఏడాదిన్నరగా..

ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో మొత్తం 70 మండలాలుడగా, ఇందులో 66 గ్రామీణ మండలాలున్నాయి. వీటి పరిధిలో 567 మండల పరిషత్ ప్రాదేశిక నియోజకవర్గాలు (ఎంపీటీసీ స్థానాలు) ఉండగా.. ప్రతి 2000 నుంచి 3500 ఓట్లకు ఒక ఎంపీటీసీ స్థానం ఉండాలనే నిబంధనలున్నాయి. దీంతో రెండు, మూడు గ్రామ పంచాయతీలు/గ్రామాలకు కలిపి ఎంపీటీసీ సభ్యులను ఎన్నుకున్నారు. 2019మే నెలలో జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల్లో ఎంపీటీసీ సభ్యులుగా ఎన్నికై వారంతా అదే సంవత్సరం జూలైలో ప్రమాణ స్వీకారం చేశారు. ఏడాదిన్నర కాలంగా వీరి పదవులు అలంకార ప్రాయంగా మారాయి. ప్రజల ఓట్లతో గెలిచిన ఎంపీటీసీలకు నిధులు, విధుల విషయంలో స్పష్టత లేదు. గతంలో మాదిరిగా బీఆర్ జీఎఫ్ నిధుల విడుదల లేకపోగా, కొన్ని నెలలుగా 15వ ఆర్థిక సంఘం నిధులు అరకొరగా వస్తున్నాయి.

పేరుకే పదవి..

గత ఎన్నికల్లో వివిధ పార్టీల నుంచి టికెట్ పొంది బరిలోకి దిగిన అభ్యర్థులు రూ.లక్షలు వెచ్చించి, వివిధ రకాల హామీలు ఇచ్చి ఎలాగోలా విజయం సాధించారు. తీరా గెలిచాక ప్రత్యేక అధికారాలు, నిధులు, విధులు లేకపోవడంతో ఎంపీటీసీనని చెప్పుకోవడానికి మాత్రమే తమ పదవి పనికొస్తుందని పలువురు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గ్రామాల్లో అభివృద్ధి పనులు చేపట్టలేక.. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలు తీర్చలేక.. ప్రజల్లో తిరగలేక పోతున్నామని అసహనం వ్యక్తం చేస్తున్నారు. గ్రామంలో, మండల పరిషత్ లో ప్రత్యేక కుర్చీలు లేకపోగా, నిధులు, విధుల విషయంలో తీవ్ర అన్యాయం జరుగుతోందనే వాపోతున్నారు. 2014కు ముందు కేంద్రం నుంచి బీఆర్జీఎఫ్ నిధులు మంజూరవగా.. జిల్లా పరిషత్ కు 20 శాతం, మండల పరిషత్​కు 30 శాతం, గ్రామ పంచాయతీలకు 50 శాతం నిధులు వచ్చేవి. 13వ ఆర్థిక సంఘం నిధులు పూర్తిగా జీపీలకు వచ్చేవి. తాజాగా బీఆర్జీఎఫ్ నిధులు లేకపోవడంతో ఎంపీటీసీ పరిస్థితి మరీ దారుణంగా తయారైంది.

మీటింగ్​కు వెళ్లడం.. రావడం..

మూడు నెలకోసారి నిర్వహించే మండల సర్వసభ్య సమావేశానికి ఎంపీటీసీలు వెళ్లడం.. కూర్చోవడం.. రావటంతోనే సరిపోతోంది. నిధులు రాక, విధులు లేక ఏం చేయాలో పాలుపోని పరిస్థితి ఉంది. తాజాగా 15వ ఆర్థిక సంఘం నిధులిస్తుండగా.. 85 శాతం గ్రామ పంచాయతీలకే వస్తున్నాయి. జిల్లా పరిషత్​కు 5 శాతం నిధులు ఉండగా, మండల పరిషత్ కు 10 శాతం నిధులు మాత్రమే ఇస్తున్నారు. అదీ గత ఎనిమిది నెలల నుంచి ఇస్తుండగా.. మండలానికి రూ.10 లక్షలు మించి రావడంలేదు. స్థానిక సంస్థలను బలోపేతం చేసేందుకు నిధులు ఒకే గొడుగు కిందికి అందించాలని కేంద్రం నిర్ణయించింది. దీనికి మద్దతుగా ఏర్పాటు చేసిన నీతి ఆయోగ్ నిబంధనలు ఎంపీటీసీ సభ్యులను తీవ్ర నిరాశకు గురి చేసింది. గతంలో అందించే బీఆర్జీఎఫ్ నిధుల వాటా మాదిరిగానే 15వ ఆర్థిక సంఘం నిధులు ఇవ్వాలని ఎంపీటీసీలు డిమాండ్ చేస్తున్నారు. ఇటీవల పెద్ద ఎత్తున ఆందోళన బాట కూడా పట్టారు.

ప్రజలకు ఏం చెప్పాలో అర్థం కావడం లేదు

ఎంపీటీసీలకు నిధులు రావడం లేదు. విధులపై స్పష్టత లేదు. ఎలాంటి అభివృద్ధి పనులు చేసే పరిస్థితి లేదు. ప్రజలకు సేవ చేయాలనే ఉద్దేశ్యంతో పోటీ చేసి గెలిసిన తమకు నిరాశే మిగిలింది. నిధులు, విధుల విషయంలో స్పష్టత లేక.. గెలిపించిన ప్రజలకు ఏం సమాధానం చెప్పాలో అర్థం కావడం లేదు. మూడు నెలలకో సారి జరిగే సర్వ సభ్య సమావేశాలకు వెళ్లి రావడమే మా పని అన్నట్లుగా తయారైంది. ఇప్పటికైనా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు నిధులు విడుదల చేసి అభివృద్ధికి సహకారం అందించాలి. తానూర్ ఎంపీటీసీ

Advertisement

Next Story

Most Viewed