అండర్ డ్రైనేజీ లేదు.. జనగామ అభివృద్ధిపై అధికారుల పట్టింపు ఏది..?

by Shyam |   ( Updated:2021-10-20 08:09:39.0  )
అండర్ డ్రైనేజీ లేదు.. జనగామ అభివృద్ధిపై అధికారుల పట్టింపు ఏది..?
X

దిశ, జనగామ: పేరుకే జనగామ జిల్లాగా అవతరించినట్లుగా ఉందని జిల్లా వాసులు.. ప్రభుత్వ తీరును తీవ్రంగా విమర్శిస్తున్నారు. ఉమ్మడి వరంగల్ జిల్లాలో జనగామ ప్రత్యేక జిల్లాగా ఏర్పాటై 5 సంవత్సరాలు పూర్తయినా అధికారులు, పాలకులకు జిల్లా కేంద్రం అభివృద్ధిపై ఏమాత్రం పట్టింపు లేకపోవడం గమనార్హం. గత మున్సిపాలిటీ పాలక వర్గంలో జనగామకు పూర్తిస్థాయిలో అండర్ డ్రైనేజీ నిర్మాణం ప్రతిపాదనలు తయారుచేసి బ్లూ ప్రింట్‌ను ప్రభుత్వానికి సమర్పించారు. అయినప్పటికీ నిధులు విడుదల కాకపోనూ.. ఒకప్పుడు 28 వార్డులుగా ఉన్న జిల్లా కేంద్రం నేడు 30 వార్డులుగా మారడంతో పాటు యశ్వంతపూర్, చీటకోడూర్, శామీర్‌పేట ప్రాంతాలకు చెందిన సర్వే నెంబర్లు కొత్తగా చేరడంతో అండర్ డ్రైనేజీ అభివృద్ధి పనులకు చెందిన ఫైల్స్ మూలకు పడినట్లు తెలిసింది.

చిన్నపాటి వర్షాలకు జనగామ అతలాకుతలం

గత సంవత్సరంలో కురిసిన భారీ వర్షానికి జనగామలోని లోతట్టు ప్రాంతాలన్నీ జలమయంగా మారిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో అధికారులు హైదరాబాద్ రోడ్డులో ఉన్న డ్రైనేజీని పగులగొట్టి రోడ్డుకు రెండు పెద్ద పైపులను అమర్చారు. అయినప్పటికీ లోతట్టు ప్రాంతాల ప్రజలు వర్షం పడితే బయటకు రాలేని పరిస్థితులు నెలకొన్నాయి. ఇటీవల బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనంతో కురిసిన వర్షాలకు జనగామలోని జయశంకర్‌నగర్, జ్యోతినగర్, కుర్మవాడ, బాలాజీనగర్, గిర్నిగడ్డ, అరబిందో స్కూల్స్ ప్రాంతాల్లోని రోడ్లు చెరువులను తలపించాయి. దీంతో ఆయా ప్రాంతాల్లోని ప్రజలు అరచేతిలో ప్రాణాలు పెట్టుకుని బ్రతకాల్సిన పరిస్థితులు నెలకొన్నాయి.

పట్టించుకోని అధికారులు..

జనగామ మున్సిపల్ అధికారులు పన్నులు వసూల్ చేసినంత శ్రద్ధ.. అభివృద్ధి పనుల్లో చూపించరని చిరు వ్యాపారుల నుంచి ఆరోపణలు వస్తున్నాయి. సమస్యలు పరిష్కరించాలని ప్రజలు విన్నవిస్తున్నా.. అధికారులు మాత్రం స్పందించడం లేదని వాపోతున్నారు.

అభివృద్ధి శూన్యం..

జిల్లా ఏర్పాటైన తరుణంలో ప్రస్తుత విద్యాశాఖ డైరెక్టర్, జిల్లా తొలి కలెక్టర్ దేవసేనా ఆధ్వర్యంలో పట్టణంలో ప్రధాన రోడ్లు, కూడళ్ళ అభివృద్ధికి రూ. 3 కోట్ల నిధులను మంజూరు చేయించారు. అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు సైతం చేశారు. కానీ, ఆనాటి నుంచి నేటి వరకు ప్రధానదారుల డివైడర్స్ పనులు, లైటింగ్ పనులు, ప్రధాన కూడళ్ల పనులు కొనసాగుతూనే ఉన్నాయి తప్పా పూర్తి కాలేదు. జనగామ అభివృద్ధికి ఇదే నిదర్శనమని జిల్లా వాసులు పేర్కొంటూ.. అనేక సార్లు ధర్నాలు చేపట్టినా ఫలితం లేదని చెబుతున్నారు. ఇప్పటికైనా అధికారులు, ప్రజాప్రతినిధులు స్పందించి జిల్లాను సిద్దిపేట, సిరిసిల్ల తరహాలో అభివృద్ధి చేయాలని కోరుతున్నారు.

Advertisement

Next Story