భారీగా నష్టపోతున్న భారతీయ గేమర్లు

by Harish |
భారీగా నష్టపోతున్న భారతీయ గేమర్లు
X

దిశ, వెబ్‌డెస్క్: టిక్ టాక్‌పై భారత ప్రభుత్వం నిషేధం విధించినప్పుడు దాని మీద ఆధారపడి డబ్బులు సంపాదించుకున్న ప్రముఖ టిక్ టాకర్లు అందరూ రోడ్డున పడ్డారు. ఇప్పుడు భారతీయ గేమర్ల పరిస్థితి కూడా ఇంచుమించు ఇలాగే ఉంది. ‘మోర్టల్, డైనమో..’ ఈ పేర్లు చాలా మందికి తెలియకపోవచ్చు. కానీ, గేమింగ్ ప్రపంచంలో వీరు సూపర్ స్టార్లు. తమ ఆటను యూట్యూబ్‌లో గంటలకొద్దీ లైవ్ స్ట్రీమ్ చేసి పెద్ద మొత్తాల్లో డబ్బులు సంపాదించుకునే గేమర్లలో వీళ్లు చాలా పాపులర్. పబ్జీ లాంటి ఆటలను లైవ్ స్ట్రీమ్ చేయడానికి ప్రత్యేకంగా ఐదు నుంచి వారం రోజుల పాటు ఈవెంట్‌లు నిర్వహించేవారు. ఈ ఈవెంట్‌లకు 25వేల మందికి పైగా హాజరయ్యేవారు. అలా గేమ్‌లు ఆడుతూ సంపాదించుకున్నవారంతా ఇప్పుడు రోడ్డున పడ్డట్టయింది.

ఈ గేమర్‌లు అందరూ పబ్జీ పాపులారిటీని ఉపయోగించుకుని దాన్ని లైవ్ స్ట్రీమ్ చేసేవారు. మోర్టల్ అనే గేమర్‌ను పబ్జీ ప్రపంచానికి సచిన్ టెండుల్కర్‌గా పేర్కొంటారు. మోర్టల్‌తో పాటు డైనమో, క్యారీ మినాటి, దల్జీస్క్, స్కౌట్, తన్మయ్ భట్ వంటి స్ట్రీమర్‌లు కూడా యూట్యూబ్‌లో తమ ఆటను స్ట్రీమ్ చేసేవారు. వీళ్లంతా తమ సబ్‌స్క్రైబర్ల మధ్య పోటీలు నిర్వహించే వారు. వాటికి రిజిస్ట్రేషన్ ఫీజులు పెట్టడం, పెద్ద మొత్తం ప్రైజ్ మనీని ప్రకటించడంతో బాగా దండుకునేవారు. ఇక ఇద్దరు ముగ్గురు పాపులర్ ప్లేయర్లు కలిసే ఆడే ఆటకైతే కొన్ని క్షణాల్లోనే మిలియన్ల కొద్దీ వీక్షణలు వచ్చేవి. కొన్ని ఈవెంట్లలో పబ్జీ ఆటకు రూ. 2 కోట్ల నుంచి రూ. 3 కోట్ల వరకు ప్రైజ్ మనీ ఉండేది. కేవలం దేశీయంగా మాత్రమే కాకుండా అంతర్జాతీయంగా కూడా ఈ గేమ్ ఈవెంట్‌లు జరిగేవి. ఆ ఈవెంట్‌లలో టాప్ 10 పేర్లలో భారతీయులు కనీసం ఐదుగురు ఉండేవారు. కానీ ఇప్పుడు ఆ అవకాశం లేకపోవడంతో వారి మెయిన్ స్ట్రీమ్ ఆదాయం కోల్పోయినట్లయింది. అంటే పబ్జీ నిషేధించడం వల్ల అటు కంపెనీతో పాటు ఇటు దాన్నే నమ్ముకున్న గేమర్లు కూడా పెద్దమొత్తంలోనే నష్టపోయారు.

Advertisement

Next Story

Most Viewed