వ్యభిచారం నేరమని ఎక్కడుంది : హైకోర్టు

by  |
వ్యభిచారం నేరమని ఎక్కడుంది : హైకోర్టు
X

దిశ, వెబ్‌డెస్క్ :

మహిళలు తమకు నచ్చిన వృత్తిని ఎంచుకుని జీవించే హక్కు వారికి ఉందని, వ్యభిచారం నేరమని ఏ చట్టంలోనూ లేదని బాంబే హైకోర్టు వ్యాఖ్యానించింది. మహిళల అభీష్టానికి వ్యతిరేకంగా వారిని నిర్బంధించడం సరికాదని చెబుతూనే ముగ్గురికి విముక్తి కల్పించింది. ఈ మేరకు జస్టిస్‌ పృథ్వీరాజ్‌ చవాన్‌ మానవ అక్రమ రవాణా ( నిరోధక) చట్టం గురించి గురువారం కీలక వ్యాఖ్యలు చేశారు. గతేడాది వ్యభిచారంలో పట్టుబడిన ముగ్గురు యువతులను వుమెన్‌ హాస్టల్‌కు తరలించాలని చెప్పిన దిగువ కోర్టు నిర్ణయాన్ని తప్పుబట్టింది ‘ పీఐటీఏ-1956లో వ్యభిచారాన్ని రద్దు చేయాలని ఎక్కడా చెప్పలేదు. దానిని శిక్షార్హమైన నేరంగా పేర్కొంటూ ఎటువంటి ప్రొవిజన్‌ లేదు. ఇలాంటి కేసుల్లో పట్టుబడిన వాళ్లకు శిక్ష విధించాలనే నిబంధన ఏమీ లేదు’ అని జస్టిస్‌ చవాన్‌ తెలిపారు.

అయితే, వ్యభిచారం చేసే క్రమంలో ‘ఒక మనిషిని మోసం చేసి, స్వప్రయోజనాల కోసం దోపిడీకి పాల్పడితే అది ఖచ్చితంగా శిక్షించదగ్గ నేరమే’’ అని స్పష్టం చేశారు. భారత రాజ్యాంగం ప్రకారం దేశంలో ఎక్కడైనా నివసించే, నచ్చిన వృత్తిని చేపట్టే హక్కు మహిళలకు ఉందని పేర్కొంటూ, తక్షణమే నిర్భందంలో ఉన్న వారిని విడుదల చేయాలని ఆదేశించారు.

పోలీసులు సోదాల జరిపిన తీరుపై మాట్లాడుతూ.. విటుడు వ్యభిచార గృహం నడుపుతున్నాడా లేదా మానవ అక్రమ రవాణా చేస్తున్నాడా అన్న అంశంపై స్పష్టంగా నివేదికలో పేర్కొనాల్సిందని అభిప్రాయపడ్డారు. కాగా, యూపీలోని కాన్పూర్‌కు చెందిన ముగ్గురు యువతులు గతేడాది మలాద్‌లోని ఓ గెస్ట్‌హౌజ్‌లో పోలీసులు నిర్వహించిన రైడ్‌లో పట్టుబడ్డారు. వారిని బాధితులుగా పేర్కొంటూ, విటుడిని అరెస్టు చేసి పీఐటీఏ కింద కేసు నమోదు చేశారు.

ఈ నేపథ్యంలో కేసును విచారించిన దిందోషి సెషన్స్‌ కోర్టు, వారిని మహిళల వసతి గృహానికి తరలిస్తూ ఆదేశాలు జారీ చేసింది. అయితే, సదరు యువతులు అశోక్‌ సరోగీ అనే న్యాయవాది ద్వారా హైకోర్టును ఆశ్రయించి, తమకు విముక్తి కల్పించాల్సిందిగా అభ్యర్థించారు. తమ తల్లుల దగ్గరకు వెళ్లేందుకు దిగువ కోర్టు అనుమతినివ్వలేదని, తమ సామాజిక వర్గం ఈ వృత్తితోనే జీవనోపాధి పొందుతోందని పిటిషన్‌లో పేర్కొన్నారు. దీంతో వారి పిటిషన్‌ను స్వీకరించిన ఏకసభ్య ధర్మాసనం వారికి విముక్తి కల్పించాలని తీర్పునిచ్చింది.


Next Story