కలల పంటకు కడుపు‘కోత’లు!

by Shyam |
కలల పంటకు కడుపు‘కోత’లు!
X

తెలంగాణలో ప్రైవేట్ ఆస్పత్రులు కాసులకు కక్కుర్తి పడుతున్నాయి. వైద్యాన్ని వ్యాపారంగా మార్చుకొని దందా సాగిస్తున్నాయి. నార్మల్ డెలివరీ జరిగే అవకాశం ఉన్నా ధనదాహంతో సిజేరియన్‌లకే మొగ్గు చూపుతున్నారు. పెద్ద ఆపరేషన్ చేస్తే మహిళలకు ఆరోగ్యపరంగా ఇబ్బందులని తెలిసినా ఇష్టారాజ్యంగా ఆపరేషన్లు చేస్తున్నారు. కేసీఆర్ కిట్ అమల్లోకి వచ్చినప్పటి నుంచి గవర్నమెంట్ ఆస్పత్రుల్లో గణనీయంగా ప్రసవాల సంఖ్య పెరిగి, సాధారణ ప్రసవాలు జరుగుతుండటంతో ప్రైవేట్ ఆస్పత్రులకు వచ్చే గర్బిణుల సంఖ్య తగ్గుతోంది. ఈ క్రమంలోనే ప్రైవేట్ ఆస్పత్రులు రెచ్చిపోయి కాన్పుల కోసం వచ్చిన మహిళలకు కడుపుకోతలు పెట్టి దోచుకుంటున్నారు. ఇలా రాష్ట్రవ్యాప్తంగా జరుగుతున్నప్పటికీ నిర్మల్ జిల్లాలో ఇంకా పూర్తి విభిన్నంగా పరిస్థితులున్నాయి.

చెకప్‌లు, ప్రసవాల కోసం ప్రైవేట్ ఆస్పత్రులు, నర్సింగ్ హోంలకు వచ్చే మహిళల వద్ద డబ్బులను ఇష్టారాజ్యంగా దోపిడీ చేస్తున్నారు. జిల్లావ్యాప్తంగా ఉన్న 32కు పైగా ప్రైవేట్ ఆస్పత్రులు, నర్సింగ్‌హోంలలో ధనార్జనకు పెద్దపీట వేస్తున్నారు. గర్భం దాల్చిన నాటి నుంచి ప్రసవం అయ్యేవరకు పేద కుటుంబాల వద్ద ముక్కు పిండినట్లు డబ్బులు గుంజుతున్నారు. ఆర్ఎంపీ వైద్యులతో కుమ్మక్కై గర్భిణులు, వారి ఫ్యామిలీలను భయభ్రాంతులకు గురి చేస్తూ సిజేరియన్‌లు చేస్తున్నారన్న ఆరోపణలు వస్తున్నాయి. గ్రామీణ ప్రాంతాల నుంచి వచ్చేవారిని టార్గెట్ చేసినట్లుగా ఎక్కువశాతం పెద్ద ఆపరేషన్లు చేస్తూ ఇష్టానుసారంగా పైసలు రాబట్టుకుంటున్నారు.

జిల్లాలో ఏరేంజ్‌‌లో సీజేరియన్లు చేస్తూ ప్రైవేట్ ఆస్పత్రులు డబ్బులు దండుకుంటున్నాయనది 2019 ఏప్రిల్ నుంచి 2020 జనవరి వరకు లెక్కలు గమనిస్తే ఆందోళనకర పరిస్థితులు కళ్లకు కట్టినట్లు కనపడుతున్నాయి. 10 నెలల్లోనే జిల్లాలోని 32 ప్రైవేట్ ఆస్పత్రుల్లో మొత్తం 6,523 ప్రసవాలు జరగ్గా ఇందులో కేవలం 443 మాత్రమే సాధారణ ప్రసవాలు జరిగాయి. మిగతా 6,079 మంది మహిళలకు సిజేరియన్లు చేసి ప్రసవాలు నిర్వహించారు. అంటే సుమారు 94 శాతం కడుపుకోతలు పెట్టడం గమనార్హం.

జిల్లాలో మొన్నటివరకు జరిగిన ఈ ప్రసవాల్లో 3,293 మంది ఆడపిల్లలు జన్మిస్తే 3,314 మంది మగపిల్లలు జన్మించారు. అంటే సెక్స్ రెషియోలో ఆడపిల్లల సంఖ్య గణనీయంగా తక్కువ అవుతుందని తెలుస్తోంది. ఈ విషయంపై జిల్లా వైద్యాధికారి డాక్టర్ వసంత్‌రావును వివరణ కోరగా.. ప్రైవేట్ ఆస్పత్రుల్లో సిజేరియన్‌ ఆపరేషన్లు పెద్ద మొత్తంలో జరుగుతున్న ఫిర్యాదులు తమకు అందుతున్నాయని దీనిపై త్వరలో ప్రత్యేక కమిటీ వేసి విచారణ జరిపిస్తామని చెప్పారు.

Advertisement

Next Story

Most Viewed