అడిగింది రూ.16 వేలు.. ఇస్తామన్నది రూ. 1000

by  |
అడిగింది రూ.16 వేలు.. ఇస్తామన్నది రూ. 1000
X

దిశ, న్యూస్ బ్యూరో: రాష్ట్రంలో మొత్తం 21 ప్రైవేటు బోధనాసుపత్రులు ఉన్నప్పటికీ ప్రస్తుతానికి మూడు మాత్రమే కరోనా పేషెంట్లకు ఉచితంగా చికిత్స అందించడానికి ముందుకొచ్చాయి. మిగిలిన 18ఆసుపత్రుల విషయంలో ప్రభుత్వం చర్చలు జరుపుతున్నా అవి కొలిక్కి రావడంలేదు. ఒక్కో బెడ్‌కు రోజుకు రూ. 16వేలను ప్రభుత్వం చెల్లిస్తే పేషెంట్ల నుంచి వసూలు చేయకుండా ఉచితంగా వైద్య చికిత్స అందిస్తామని ఆ 18 ఆసుపత్రుల యాజమాన్యం వాదిస్తోంది. కానీ ప్రభుత్వం మాత్రం రోజుకు ఒక్కో బెడ్‌కు వెయ్యి రూపాయలు మాత్రమే ఇస్తానంటోంది. ఇరువైపులా ఏకాభిప్రాయం కుదరకపోవడంతో ఆ ఆసుపత్రుల్లో కరోనా ఉచిత సేవలు ప్రారంభం కాలేదు. అధికార పార్టీకి అనుకూలంగా ఉన్న రాష్ట్ర మంత్రి మల్లారెడ్డికి చెందిన మెడికల్ కళాశాలకు అనుబంధంగా ఉన్న ఆసుపత్రి, మరో మంత్రి పువ్వాడ అజయ్‌కు చెందిన బోధనాసుపత్రి, కామినేని ఆసుపత్రి మాత్రమే ఉచితంగా చికిత్స చేయడానికి ముందుకొచ్చాయి.

ప్రభుత్వాసుపత్రుల్లో చికిత్సపై ప్రజలకు భయాందోళనలు పెరిగిపోతుండడం, ప్రైవేటు ఆసుపత్రుల్లో చేరేందుకు ఆర్థిక స్థోమత లేకపోవడంతో కరోనా పేషెంట్ల బాధలు వర్ణించడానికి వీలు లేకుండా మారాయి. పొరుగున ఉన్న ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆరోగ్యశ్రీ పథకంలో చేర్చినా తెలంగాణ ప్రభుత్వం మాత్రం అందుకు సిద్ధంగా లేదు. ఉచితంగా చికిత్స చేయించుకోవాలనుకునేవారు ప్రభుత్వాసుపత్రుల్లో చేరాలంటూ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ ఇప్పటికే స్పష్టం చేశారు. కానీ కింగ్ కోఠి, ఛెస్ట్, గాంధీ తదితర ఆసుపత్రుల్లో పేషెంట్లు ఆక్సిజన్ అందక, సరైన చికిత్సకు నోచుకోక చనిపోతుండడంపై ప్రజల్లో ఆందోళనలు పెరిగింది. ప్రైవేటు ఆసుపత్రుల బిల్లులు పేషెంట్లను భయపెడుతున్నాయి.

రాష్ట్రంలోని 21 ప్రైవేటు బోధనాసుపత్రుల్లో మొత్తం 15,040 బెడ్‌లు ఉంటే అందులో కరోనా పేషెంట్ల కోసం ప్రభుత్వ విజ్ఞప్తి మేరకు 839 సాధారణ ఐసొలేషన్ వార్డుల్లో ఉంటే మరో 347 ఆక్సిజన్ సౌకర్యం కలిగిన ఐసీయూ వార్డుల్లో ఉన్నాయి. 194 వెంటిలేటర్ సౌకర్యంతో కూడినవి కేటాయించాయి. కానీ ఇందులో కరోనా పేషెంట్లకు ఉచిత చికిత్స చేయడానికి ముందుకొచ్చిన మూడు బోధనాసుపత్రుల్లో ఐసీయూ, వెంటిలేటర్ల బెడ్‌లతో కలుపుకుని మొత్తం 261 బెడ్‌లు మాత్రమే అందుబాటులోకి వచ్చాయి. మిగిలిన 18 ప్రైవేటు బోధనాసుపత్రులు ఎప్పుడు ముందుకొస్తాయా అనేది వైద్య విద్య డైరెక్టర్‌కు కూడా స్పష్టత లేదు.

రాష్ట్రంలోని కరోనా ప్రత్యేక పరిస్థితులను దృష్టిలో పెట్టుకుని స్వచ్ఛందంగా ముందుకు రావాల్సిన ఈ ప్రైవేటు బోధనాసుపత్రులు ఒకవైపు ల్యాబ్‌లలో పరీక్షలు చేయడానికి ముందుకు రావడంలేదు, చికిత్స కోసం వెళ్ళినవారి ఆర్థిక స్థితిని ముందుగానే పసిగట్టి బెడ్‌లు ఖాళీగా లేవంటూ తిరస్కరిస్తున్నాయి. కానీ ప్రభుత్వం మాత్రం క్లినికల్ ఎస్టాబ్లిష్‌మెంట్ చట్టం ప్రకారం తాము ఏమీ చేయలేమంటూ నిస్సహాయంగా ఉండిపోయింది.

కరోనా బాధలకు వాట్సాప్ నెంబర్

ప్రైవేటు, కార్పొరేట్ ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్న కరోనా పేషెంట్లు ఎదుర్కొంటున్న ఇబ్బందులను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళడానికి వాట్సాప్ నెంబర్ అందుబాటులోకి వచ్చింది. ఈ ఆసుపత్రులు విచ్చలవిడిగా ఛార్జీలు వసూలు చేస్తున్నట్లు ప్రజల నుంచి పిర్యాదులు అందుతూ ఉండడం, ప్రసార మాధ్యమాల్లో వచ్చే వార్తలు ప్రభుత్వానికి చేదు అనుభవాన్ని మిగులుస్తుండడంతో రాష్ట్ర ప్రజారోగ్య శాఖ ఈ ఏర్పాట్లు చేసింది. పేషెంట్లకు ప్రైవేటు, కార్పొరేట్ ఆసుపత్రుల నుంచి ఎలాంటి ఇబ్బందులు ఉన్నా వారి వివరాలను, సమస్య స్వభావాన్ని వాట్సాప్ నెంబర్ (9154170960) ద్వారా ప్రభుత్వం దృష్టికి తీసుకురావచ్చునని డైరెక్టర్ డాక్టర్ శ్రీనివాసరావు తెలిపారు. కార్పొరేటు, ప్రైవేటు ఆసుపత్రుల దోపిడీని అరికట్టడానికి ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు.


Next Story

Most Viewed