ఏప్రిల్ జీతాలపై ప్రై‌‘వేటు’!

by Shyam |
ఏప్రిల్ జీతాలపై ప్రై‌‘వేటు’!
X

దిశ, న్యూస్‌బ్యూరో: ప్రైవేటు ఉద్యోగులకు ఏప్రిల్ నెల జీతాల భయం పట్టుకుంది. కొన్ని ప్రైవేటు సంస్థలు మార్చి నెల వేతనాలను పూర్తిగా చెల్లించాయి. చాలా కంపెనీలు సగమే చెల్లించాయి. ఇప్పుడు ఏప్రిల్ నెల మొత్తం లాక్‌డౌన్‌తో స్తంభించిపోయినందున మొత్తానికే జీతాలు పడవనే ఆందోళన మొదలైంది. లాక్‌డౌన్ కారణంగా రాష్ట్రంలో 90 శాతం వ్యాపారాలు పూర్తిగా ఆగిపోయాయి. ప్రభుత్వం మినహాయింపు ఇచ్చిన ఫార్మా, హెల్త్‌కేర్, నిత్యావసరాలు వంటి ఫ్యాక్టరీలే పనిచేస్తున్నాయి. ఇవి కూడా పరిమిత సంఖ్య ఉద్యోగులతోనే నడుస్తున్నాయి. యాక్టివిటీ లేని ఉత్పత్తి, సర్వీసుల రంగాల్లోని కంపెనీలు ఉద్యోగులకు ఏప్రిల్ నెల జీతాలు చెల్లించడం అనుమానమే. ఇప్పటికే కొన్ని కంపెనీలు మేనేజర్ల ద్వారా క్రింది స్థాయి ఉద్యోగులకు నోటిమాటగా, వాట్సాప్‌ ద్వారా ఆడియో సందేశాన్ని పెట్టాయి. ప్రధాని, ముఖ్యమంత్రి పలు సందర్భాల్లో పూర్తి జీతాలను చెల్లించాలని ప్రైవేటు సంస్థలకు విజ్ఞప్తి చేశారు. కానీ, ఆచరణలో అందుకు భిన్నంగా జరుగుతోంది.

కొన్ని సంస్థలు ఉద్యోగులను తాత్కాలికంగా మానేయాల్సిందిగా సూచించాయి. కొన్ని కంపెనీలు 25% మాత్రమే జీతం ఇచ్చి లాక్‌డౌన్ ఎత్తివేసిన తర్వాత దశలవారీగా ఇవ్వనున్నట్లు హామీ ఇచ్చాయి. చాలా పరిమిత సంఖ్యలోని కంపెనీల యాజమాన్యాలు మాత్రం ఉద్యోగుల నమ్మకాన్ని కోల్పోకుండా ఉండడానికి నగదు నిల్వల నుంచో లేదా అప్పు చేసో జీతాలివ్వడానికి సిద్ధపడ్డాయి.

హైదరాబాద్‌లోని ఉద్యోగాల్లో ప్రైవేటు రంగంలోనివే ఎక్కువ. ప్రభుత్వం తన ఉద్యోగులకు మార్చి నెల జీతాల్లో 50 శాతం దాకా కోత (తాత్కాలిక) విధించింది. ఏప్రిల్ నెలకు సైతం అదే తీరులో ఉంటుందని స్పష్టం చేసింది. కేంద్ర ప్రభుత్వం సైతం కోత పెట్టక తప్పలేదు. ఇవన్నీ ప్రైవేటు సంస్థలకు కూడా ఆదర్శంగా నిలిచాయి కాబోలు! ఉద్యోగులకు వేతనాల్లో కోత పెట్టాయి. దీనికి తోడు కొన్ని కంపెనీలు ఉద్యోగుల సంఖ్యను కూడా తగ్గించుకున్నాయి. లాక్‌డౌన్ ఎప్పటిదాకా కొనసాగుతుందో తెలియదు. ఆ తర్వాత వ్యాపారం ఏ మేరకు పుంజుకుంటుందో తెలియదు.

భవిష్యత్ అగమ్యగోచరం…

భవిష్యత్ అగమ్యగోచరంగా ఉండడంతో వేతనాల్లో కోత, ఉద్యోగులకు ఉద్వాసనతప్ప మార్గం లేదని భావిస్తున్నాయి. రిజర్వు నిల్వల్లోంచి డబ్బుల్ని తీయడానికి వెనుకంజ వేస్తున్నాయి.

బ్యాంకు లోన్లపై రిజర్వు బ్యాంకు మారటోరియం వెసులుబాటు, యజమానులెవరూ ఇంటి అద్దెలు అడగొద్దని తెలంగాణ ప్రభుత్వ ఆదేశాలు, ఉద్యోగులకు తప్పకుండా వేతనాలు చెల్లించాల్సిందే అనే కేంద్ర ప్రభుత్వ ఆదేశం… ఇలా ఎన్ని ఉన్నా క్షేత్రస్థాయిలో ఇవేవీ పనిచేయడం లేదు. బ్యాంకులు, బ్యాంకింగేతర రుణ సంస్థలు ఇప్పటికే ఇచ్చిన అప్పులకు వడ్డీలను వసూలు చేస్తూనే ఉన్నాయి. ప్రైవేటు ఉద్యోగులకు మాత్రం వేతనాల్లో కోతలు పెట్టొద్దని ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ పరిశ్రమల సంఘాల ప్రతినిధులకు లేఖ రాశారు. కర్నాటక ప్రభుత్వం ఏకంగా జీవో తీసుకొస్తే కేటీఆర్ మాత్రం లేఖతోనే సరిపెట్టారనే వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి.

జీతం అనుమానం… అప్పు పుట్టడంలేదు

‘‘జనతా కర్ఫ్యూ నుంచి మేం ఇంట్లోనే ఉంటున్నాం. మార్చి నెలలో పనిచేసిన రోజులకు మాత్రమే జీతం వచ్చింది. ఈ నెల జీతం రాకపోవచ్చనే గుసగుసలు వినిపిస్తున్నాయి. నెల ఎలా గడుస్తుందోననే భయం పట్టుకుంది. అప్పు ఇవ్వడానికి కూడా ఎవ్వరికీ ధైర్యం లేదు” అని సికింద్రాబాద్‌లో ఓ షిప్పింగ్ అండ్ లాజిస్టిక్స్ కంపెనీలో పనిచేస్తున్న చిరుద్యోగి రాంనారాయణ వ్యాఖ్యానించారు.

ఆర్థిక వ్యవస్థే కుప్పకూలింది.. ఇక జీతమేమొస్తది?

“మార్చిలో 75 శాతం జీతం వచ్చింది. ఏప్రిల్‌లో అసలు రాదని దాదాపుగా చెప్పేశారు. ఫోన్‌ ద్వారా మార్కెటింగ్ చేస్తే క్లైంట్స్ ఎవ్వరూ పెద్దగా ఆసక్తి చూపడంలేదు. కొత్త పెట్టుబడులు పెట్టడానికి ఎవ్వరికీ ధైర్యం చాలడంలేదు. మొన్న ఫ్రాంక్లిన్ టెంపుల్‌టన్ మ్యూచువల్ ఫండ్ల ఘటనతో క్లైంట్స్ ఇన్వెస్ట్‌మెంట్స్‌పై చాలా అనుమానాలు పెరిగాయి. ఏప్రిల్ జీతం రాకపోతే మా జీవితాలు గందరగోళమవుతాయి” అని బేగంపేట్‌లోని ఓ ఫైనాన్సియల్ అడ్వైజరీ సర్వీసెస్ కంపెనీలో పనిచేసే వీరు అనే ఉద్యోగి అన్నారు.

మార్కెటింగ్ ఉద్యోగుల భవిష్యత్ అంధకారం..

“మాలాంటి మార్కెటింగ్ ఉద్యోగులకు రోడ్డుమీదకు వెళ్ళకపోతే పని కాదు. మార్చి నెలలో పనిచేసిన రోజులకు, చేసిన పాలసీలకు మాత్రం జీతం వచ్చింది. ఏప్రిల్‌లో బయటికెళ్లి పాలసీలు చేయలేదు. ప్రస్తుతం ఆటో షోరూంలు అన్నీ బందే ఉన్నాయి. ఈ నెల జీతమిస్తుందన్న నమ్మకం లేదు. లాక్‌డౌన్ అంటే వారం ఉంటుందేమో అనుకున్నాం. పరిస్థితి ఇక్కడిదాకా వస్తుందని ఊహించలేదు” అని ఓ పేరుమోసిన జనరల్ ఇన్సూరెన్స్ మార్కెటింగ్ ఉద్యోగి కిరణ్ అభిప్రాయపడ్డారు.

సరుకు ఫ్యాక్టరీల్లోనే ఉండిపోయింది..

“మా యూనిట్‌లో బ్యూటీ పార్లర్, సెలూన్‌లలో వాడే కుర్చీలు తయారవుతాయి. లాక్‌డౌన్ వల్ల ఉత్పత్తి ఆగిపోయింది. మార్చి నెలలో సగం జీతమే ఇచ్చారు. ఏప్రిల్ నెలలో జీతమిచ్చేలా లేరు. తయారైన సరుకు ఫ్యాక్టరీలోనే ఉండిపోయింది. కంపెనీ కోసం ఎన్ని రోజులు పనిచేసినా కనికరం ఉండదనేదానికి ఈ నెల రోజుల అనుభవమే సాక్ష్యం. ప్రభుత్వ ఆదేశాలను ప్రైవేటు కంపెనీలు పాటిస్తాయనే నమ్మకం లేదు” అని చర్లపల్లిలో ఓ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీలో పనిచేసేస సునీల్ అనే ఉద్యోగి తన మనసులోని మాటను చెప్పారు.

Tags: telangana, lockdown, hyderabad, private employees, government, order

Advertisement

Next Story