కార్పొరేషన్‌లో ప్రైవేట్ ఉద్యోగుల హవా!

by  |
కార్పొరేషన్‌లో ప్రైవేట్ ఉద్యోగుల హవా!
X

దిశ ప్రతినిధి, వరంగల్: వరంగల్ మహానగర పాలక సంస్థలో ప్రైవేటు ఉద్యోగుల హవా నడుస్తున్నట్లు స్పష్టం అవుతోంది. అధికారులకు కంప్యూటర్ పట్ల అవగాహన లేకపోవడంతో రికార్డులను కాంట్రాక్ట్ ఉద్యోగులకు అప్పగించారు. ఇదే మంచి అవకాశంగా భావించిన కాంట్రాక్ట్ ఉద్యోగులు, అధికారులతో కుమ్ముక్కై అందిన కాడికి దండుకుంటున్నారనే ఆరోపణలు ఉన్నాయి. ఇటీవల ఇంటి నెంబర్ల అక్రమాలపై అధికారితో పాటు ఇద్దరు కాంట్రాక్ట్ ఉద్యోగులపై సస్పెన్షన్ వేటు పడింది. దీంతో మిగిలిన అధికారుల గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయి.

రాష్ట్రంలో మొట్ట మొదటిసారిగా గ్రేటర్ వరంగల్ లో 2016 అక్టోబర్ నుంచి ఈ – ఆఫీస్ విధానాన్ని అమల్లోకి తెచ్చారు. ఈ మేరకు అప్పటి కమిషనర్ సర్పరాజ్ అహ్మద్ కాగిత రహిత సేవలకు శ్రీకారం చుట్టారు. ఢిల్లీలో ఎన్ఐసీ సహకారంతో ఈ విధానాన్ని రూపొందించారు. తొలుత పన్నులు, పట్టణ ప్రణాళిక విభాగాల్లో అమలు చేశారు. నాలుగు నెలల్లోనే అన్ని విభాగాల్లో అమలు చేసారు. కమిషనర్, డిప్యూటీ కమిషనర్, అడిషనల్ కమిషనర్, వింగ్ అధికారులు, మినిస్ట్రియల్ ఉద్యోగులందరికీ వ్యక్తిగత లాగిన్లు, డిజిటల్ కీతో పాటు పాస్ వర్డ్ లు కేటాయించారు. వింగ్ అధికారులు, ఇంజినీర్లు, టౌన్ ప్లానింగ్ పన్నుల విభాగం ఉద్యోగులకు ల్యాప్‌టాప్‌లు ఇచ్చారు. నాలుగేళ్లుగా మున్సిపాలిటీ పాలన అంతా కంప్యూటర్ ద్వారానే కొనసాగిస్తున్నారు. ఉద్యోగులు కంప్యూటర్‌పై అవగాహన పెంచుకోవాలని ఉన్నతాధికారులు సూచనలు చేశారు.‌ కానీ ఇప్పటి వరకు కంప్యూటర్ విధానంపై వింగ్ అధికారులకు అవగాహన లేక ప్రైవేటు ఉద్యోగులతో పనులు చక్కబెడుతున్నారు.

గ్రేటర్ వరంగల్ కార్పొరేషన్ పరిధిలోని ప్రజలకు సేవలు అందించేందుకు కాశిబుగ్గ, ఖాజీపేట, వరంగల్, హన్మకొండ ప్రాంతాలను సర్కిళ్లుగా విభజించారు. పని భారం పెరగడంతో అన్ని విభాగాల్లో కాంట్రాక్టు ఉద్యోగులను తీసుకున్నారు. పని ఒత్తిడి కారణంగా కొందరు ఉద్యోగులు కంప్యూటర్లతో పాటు డిజిటల్ కీ, పాస్‌వర్డ్‌లు సైతం ప్రైవేటు ఉద్యోగులకు అప్పగించారు. ఇదే అదునుగా భావించిన కాంట్రాక్ట్ ఉద్యోగులు కొందరు నిబంధనలకు విరుద్ధంగా ఇంటి నెంబర్లను కేటాయిస్తున్నారు. నగరంలోని బ్రహ్మణవాడ, న్యూశాయంపేట, మచిలీ బజార్, మడికొండ, హన్మకొండ చౌరస్తాలోని 14 ఇళ్లకు నిబంధనలకు విరుద్దంగా నెంబర్లు కేటాయించినట్లు కార్పొరేషన్ అధికారులు గుర్తించారు. అందుకు బాధ్యులైన ఆర్‌ఐ సంధ్యతో పాటుగా ఇద్దరు కాంట్రాక్ట్ ఉద్యోగులను సస్పెండ్ చేశారు. ఇక కాశిబుగ్గ సర్కిల్ కార్యాలయంలో అన్ని విభాగాల ఈ ఆఫీస్ ఫైళ్లు కాంట్రాక్టు ఉద్యోగులే చూస్తున్నారు. ఉన్నతాధికారి నుంచి ఎల్‌డీసీ వరకు డిజిటల్ కీతో ఓపెన్ చేసి నెంబర్లు కేటాయిస్తున్నారనే ఆరోపణలున్నాయి.

ఇంటి నెంబర్ల కేటాయింపు వ్యవహారంలో తీగలాగితే డొంక కదిలిన చందంగా వరంగల్ మహానగర పాలక సంస్థలో అధికారులు, ప్రైవేటు ఉద్యోగుల అవీనీతి బాగోతం బట్టబయలైంది. ఆర్ఐ నోట్ ఫైల్ లేకుండా 14 ఇళ్లకు నెంబర్లు కేటాయించడంతో కార్పొరేషన్ ఉన్నతాధికారులు సీరియస్ అయ్యారు. ఆర్‌ఐలు ఫీల్డ్‌కు వెళ్లని కారణంగా కాంట్రాక్ట్ ఉద్యోగులు, డిప్యూటీ కమిషనర్ బంధువులు కలిసి ఇంటి నెంబర్ల కేటాయింపులో ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నట్లుగా అధికారులు నిర్ధారణకు వచ్చారు. కొందరు ఉద్యోగులకు ఈ ఆఫీస్‌పై అవగాహన లేపోవడంతో ప్రైవేటు ఉద్యోగులే కీలకం అయ్యారు. ముగ్గురు ఆర్‌ఐలకు కంప్యూటర్ ఆన్ చేయలేని పరిస్థితి నెలకొంది. టౌన్ ప్లానింగ్ విభాగంలో భద్రంగా ఉంచాల్సిన రికార్డులు, పన్నుల దస్తావేజులు కూడా ప్రైవేటు ఉద్యోగుల చేతుల్లో ఉండడం గమనార్హం.


Next Story

Most Viewed