ఇంగ్లాండ్ వెళ్లనున్న పృథ్వీ షా.. ఎందుకంటే..?

by Shyam |   ( Updated:2021-07-03 07:09:31.0  )
sports news
X

దిశ, స్పోర్ట్స్: ఇంగ్లాండ్‌తో టెస్టు సిరీస్ ముందు టీమ్ ఇండియా ఓపెనర్ శుభ్‌మన్ గిల్ గాయంతో జట్టుకు దూరమయ్యాడు. డబ్ల్యూటీసీ ఫైనల్ మ్యాచ్‌లో ఎడమ కాలికి గాయం కావడంతో అతడు ఇంగ్లాండ్ సిరీస్‌కు దూరం అయ్యాడు. త్వరలోనే గిల్ ఇంగ్లాండ్ నుంచి ఇండియా బయలుదేరి వస్తాడని తెలుస్తున్నది. మరోవైపు అతడి స్థానంలో పృథ్విషాను టెస్టు జట్టులోకి తీసుకోవాలని టీమ్ ఇండియా యాజమాన్యం భావిస్తున్నది. పృథ్విషాను ఇంగ్లాండ్ పంపించాలని బీసీసీఐని కోరినట్లు తెలుస్తున్నది. అయితే సెలెక్టర్లు ఎంపిక చేయకుండా అతడిని ఇంగ్లాండ్ పంపే అవకాశం లేదు. కాగా టీమ్ మేనేజ్‌మెంట్ అభ్యర్థనను సెలెక్షన్ కమిటీకి చేరవేశారు. గతంలో టెస్టు జట్టులో ఓపెనర్‌గా కొనసాగిన పృథ్వీషా ఆ తర్వాత జట్టులో స్థానం కోల్పోయాడు.

ఆస్ట్రేలియా పర్యటనకు ఎంపికైనా ఆ తర్వాత అతడు టెస్టు జట్టు నుంచి తొలగించబడ్డాడు. దీంతో ఇండియాకు తిరిగి వచ్చి దేశవాళీ క్రికెట్‌లో తన టెక్నిక్ లోపాలను సరిదిద్దుకున్నాడు. ఈ ఏడాది అర్దాంతరంగా ముగిసిన ఐపీఎల్‌లో షా అద్బుతంగా రాణించాడు. ప్రస్తుతం టీమ్ ఇండియాతో కలసి శ్రీలంక పర్యటనకు పృథ్విషా వెళ్లాడు. మరోవైపు పృథ్విషా స్థానంలోనే జట్టులోకి వచ్చిన శుభ్‌మన్ గిల్ ఓపెనర్‌గా నిరూపించుకున్నాడు. కానీ ఇటీవల కాలంలో అంచనాలకు తగినట్లుగా రాణించడం లేదు. మరోవైపు గాయం కూడా జతకావడంతో టెస్టు జట్టు నుంచి తప్పుకున్నాడు. అయితే ఇప్పటికే గిల్ స్థానాన్ని భర్తీ చేయడానికి కేఎల్ రాహుల్, మయాంక్ అగర్వాల్ ఉన్నారు.

మరోవైపు కొత్తగా జట్టులోకి వచ్చిన అభిమన్యు ఈశ్వరన్ కూడా ఉన్నారు. అయినా సరే టీమ్ మేనేజ్‌మెంట్ పృథ్వీ షా వైపే మొగ్గు చూపడం గమనార్హం. మరి బీసీసీఐ అనుమతిస్తే షా నేరుగా ఇంగ్లాండ్ వెళ్లిపోతాడా లేక.. శ్రీలంక సిరీస్ అనంతరం వెళ్తాడా అనేది తెలియాల్సి ఉన్నది.

Advertisement

Next Story

Most Viewed