చెలరేగిన పృథ్వీ షా.. డబుల్ సెంచరీతో వీరంగం

by Shyam |
Prithvi Shaw
X

జైపూర్: విజయ్ హజారే ట్రోఫీ వన్డే క్రికెట్ టోర్నీలో భాగంగా జైపూర్‌లోని సవాయి మన్‌సింగ్ స్టేడియంలో గురువారం ఎలైట్ గ్రూప్-డీలోని పుదుచ్చెరీ, ముంబయి మధ్య మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్‌లో ముంబయి తరఫున ప్రాతినిథ్యం వహిస్తున్న పృథ్వీ షా డబుల్ సెంచరీతో చెలరేగాడు. ఓపెనర్‌గా వచ్చిన షా, 152 బంతుల్లోనే 227 పరుగులు చేసి, నాటౌట్‌గా నిలిచాడు. ఇందులో 31 ఫోర్లు, 6 సిక్సులు ఉండటం గమనార్హం. పృథ్వీ షాతోపాటు సూర్యకుమార్ యాదవ్(133), ఆదిత్య తారే(56) రాణించడంతో ముంబయి జట్టు నిర్ణీత 50 ఓవర్లలో 457 పరుగుల భారీ లక్ష్యాన్ని పుదుచ్చెరీ ముందుంచింది. 458 పరుగుల విజయ లక్ష్యంతో బరిలోకి దిగిన పుదుచ్చెరీ 38.1 ఓవర్లలో 224 పరుగులకే కుప్పకూలింది. దామోదరన్ రోహిత్(63), సాగర్ త్రివేది(43) మినహా మిగతా బ్యాట్స్‌మెన్ ఎవరూ రాణించలేదు. ఫలితంగా పుదుచ్చెరీపై ముంబయి జట్టు 233 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. కాగా, 227 పరుగులతో కెరీర్ బెస్టు ఇన్నింగ్స్ ఆడిన పృథ్వీ షా, విజయ్ హజారే ట్రోఫీలోనూ అత్యధిక వ్యక్తిగత స్కోరు చేసిన ఆటగాడిగానూ నిలిచాడు. అంతకుముందు ఈ రికార్డు సంజూ శాంసన్(212) పేరిట ఉండేది.

Advertisement

Next Story

Most Viewed