దళితులని బయటకి నెట్టిన పూజారి

by Anukaran |
దళితులని బయటకి నెట్టిన పూజారి
X

దిశ, జనగామ: కేరళ ట్రావెన్ కోర్ దేవస్థానం బోర్డు ఓ ఎస్టీకి పురోహితుడిగా నియమించడానికి నిర్ణయం తీసుకుని మతసామరస్యాన్ని చాటుతుంటే… తెలంగాణాలో మాత్రం ఓ ఆలయ పూజారి దళితులకు గుడిలోకి ఆహ్వానం లేదంటూ వారిని బయటకి పంపేయడం కులాహంకారానికి నిదర్శనంగా మారింది.

జనగామ పట్టణంలో స్థానిక సుభాష్ చంద్రబోస్ బొమ్మ వద్ద ఉన్న హనుమాన్ దేవాలయానికి వెళ్ళింది ఓ దళిత కుటుంబం. పూజ చేయమని కోరిన ఆ కుటుంబాన్ని… మీ గోత్రం ఏమిటి అని అడిగి దళితులకు మేము పూజలు చేయమని, వారిని బయటకి నెట్టి అవమానించాడు ఆలయ పూజారి గంగు ఆంజనేయ శర్మ.

వివరాల్లోకి వెళితే… ధర్మకాంచ లేబర్ కార్యాలయం దగ్గరలో నివాసం ఉంటున్న లక్కపల్లి భాస్కర్ కుమారుడు గగన్ వర్షకు పై పన్ను వచ్చింది. ఇరుగుపొరుగు వారిని సంప్రదించగా మేనమామతో హనుమాన్ ఆలయంలో శాంతి పూజ చేయించాలని తెలిపారు. ఈ మేరకు వారు శుక్రవారం తెల్లవారుజామున హనుమాన్ ఆలయం వద్దకు వెళ్లి ఆంజనేయశర్మను శాంతి పూజ చేయాలని కోరారు.

వారి గోత్ర వివరాలు తెలుసుకున్న పూజారులు… దళితులు గుడిలోకి రావద్దని, దళితులకు పూజలు చేయమని గుడి బయటికి వెళ్ళగొట్టారంటూ బాధితులు వాపోయారు. తమకు జరిగిన అన్యాయాన్ని దళిత సంఘాలకు తెలియజేసి వారి ఆధ్వర్యంలో ఆలయం వద్ద ఆందోళనకు దిగారు. సమాచారం తెలుసుకున్న జనగామ ఏసిపి వినోద్ కుమార్, సీఐ మల్లేష్ యాదవ్ పూజారిని అదుపులోకి తీసుకొని విచారణ చేపడుతున్నారు.

Advertisement

Next Story

Most Viewed