- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
హోదా కోసం రాజీనామాలకు సిద్ధం మీరు సిద్ధమా..? వైసీపీకి చంద్రబాబు సవాల్
దిశ, ఏపీ బ్యూరో : ఆంధ్రప్రదేశ్ విభజన చట్టంలోని హామీలపై పోరాటానికి తెలుగుదేశం పార్టీ రె‘ఢీ’ అవుతుంది. అందుకు వ్యూహాత్మకంగా అడుగులు వేస్తోంది. వైసీపీ ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టేలా ప్లాన్ వేస్తోంది. ఇప్పటికే ప్రత్యేక హోదా అంశం దాదాపుగా అటకెక్కినట్లైంది. కేంద్రం ప్రత్యేక హోదా ఇచ్చేది లేదని తెగేసి చెప్తున్నా వైసీపీ ఎంపీలు మాత్రం ఎలాగైనా హోదా సాధిద్ధామంటూ ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఇలాంటి తరుణంలో ప్రత్యేక హోదా అంశాన్ని టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు తెరపైకి తెచ్చారు. ప్రత్యేక హోదా సాధన కోసం అవసరమైతే తెలుగుదేశం పార్టీకి చెందిన ఎంపీలు రాజీనామా చేసేందుకు సిద్ధమని ప్రకటించారు.
మంగళగిరిలోని ఎన్టీఆర్ భవన్‌లో చంద్రబాబు శనివారం మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా వైసీపీపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అవకాశ వాద రాజకీయాలు చేస్తోందని దుయ్యబట్టారు. రోజురోజుకు వైసీపీ ప్రభుత్వం ప్రజల విశ్వాసం కోల్పోతుందని విమర్శించారు. వైసీపీ అనుసరిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలపై ప్రజలు ఆగ్రహంతో ఉన్నారని… త్వరలోనే ప్రజల నుంచి తిరుగుబాటు ఎదురయ్యే అవకాశం లేకపోలేదని చెప్పుకొచ్చారు. విభజన హామీలను సాధించడంలో వైసీపీ ప్రభుత్వం ఘోరంగా వైఫల్యం చెందిందని చంద్రబాబు విమర్శించారు.
ప్రజలను సీఎం జగన్ వంచించారు
2019 ఎన్నికల ప్రచారంలో కేంద్రం మెడలు వంచి ప్రత్యేక హోదా సాధిస్తామని.. హోదా సాధించకపోతే రాజీనామా చేస్తామన్న జగన్ ఇప్పుడు ఎందుకు రాజీనామా చేయడం లేదని చంద్రబాబు ప్రశ్నించారు. వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి రెండున్నరేళ్లు కావస్తున్నా ఇప్పటికీ ప్రత్యేక హోదా విషయంలో ఎలాంటి పురోగతి సాధించలేకపోయిందన్నారు. ప్రత్యేకహోదా ముగిసిన అధ్యాయమని కేంద్ర ప్రభుత్వం ఇటీవల పార్లమెంట్‌లో ప్రకటించినా కనీసం వైసీపీ ప్రభుత్వంలో స్పందన లేదన్నారు.
25 మంది ఎంపీలను ఇస్తే కేంద్రం మెడలు వంచుతానన్న సీఎం జగన్ ఇప్పుడు కేంద్రం వద్ద మోకరిల్లుతున్నాడంటూ ధ్వజమెత్తారు. ఎన్నికల ప్రచారంలో మెడలు వంచుతానని చెప్పి… ఇప్పుడు చేసేదేమీ లేదు కేవలం ఒత్తిడి పెంచడమేనంటూ సీఎం జగన్ ప్రజల్ని మభ్యపెడతున్నారంటూ చంద్రబాబు ధ్వజమెత్తారు. ఎన్నికల ప్రచారంలో ప్రత్యేక హోదానే ప్రచారాస్త్రంగా చేసుకుని ప్రజలను, యువతను నమ్మించిందన్నారు. అధికారంలోకి వచ్చిన తర్వాత ఇప్పటి వరకు హోదా సాధించకపోవడం మోసం, దగా కాదా అని నిలదీశారు.
ప్రత్యేక హోదా విషయంలో వైసీపీ ప్రభుత్వానికి ఎలాంటి చిత్తశుద్ధి లేదని విమర్శించారు. ఇప్పటికైనా మించిపోయింది లేదని సీఎం వైఎస్ జగన్‌కు హోదాపై చిత్తశుద్ధి ఉంటే తమ పార్టీ ఎంపీలతో రాజీనామా చేయించి పోరాటం చేయించాలని డిమాండ్ చేశారు. వైసీపీ ఎంపీలు రాజీనామా చేసిన తక్షణమే తెలుగుదేశం పార్టీ ఎంపీలు రాజీనామా చేస్తారని స్పష్టం చేశారు. రాజీనామా చేసి అన్ని పార్టీలను కలుపుకుని ప్రత్యేక హోదా కోసం పోరాడదామని చంద్రబాబు పిలుపునిచ్చారు. హోదా విషయంలో మాయ మాటలు, సన్నాయి నొక్కులు, డైవర్షన్‌లు వద్దన్న చంద్రబాబు వైసీపీకి దమ్ముంటే తన సవాల్‌ను స్వీకరించాలని చంద్రబాబు హెచ్చరించారు.