టీఎంసీలోకి ప్రణబ్ ముఖర్జీ కొడుకు

by Shamantha N |
mamata banerjee
X

కోల్‌కతా: మాజీ రాష్ట్రపతి ప్రణబ్‌ ముఖర్జీ కుమారుడు అభిజిత్‌ ముఖర్జీ కాంగ్రెస్‌‌ను వీడారు. గత కొన్నిరోజులుగా వస్తున్న ఊహాగానాలకు సోమవారం తెరదించుతూ తృణమూల్‌ కాంగ్రెస్(టీఎంసీ) పార్టీలో చేరారు. కోల్‌కతాలోని పార్టీ ప్రధాన కార్యాలయంలో ఆయనకు టీఎంసీ కీలక నేతలు పార్థాఛటర్జీ, సుదీప్ బంధోపాధ్యాయలు కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. టీఎంసీలో చేరిన అనంతరం అభిజిత్ ముఖర్జీ మాట్లాడుతూ.. బీజేపీ మతతత్వ రాజకీయాలను బెంగాల్‌లో సమర్థవంతంగా ఎదుర్కొన్న సీఎం మమతా బెనర్జీకి మరింత మద్దతు తోడైతే, దేశంలోనూ ఇదే ఫలితాన్ని తీసుకురాగలరని నమ్ముతున్నట్టు తెలిపారు.

తాను కాంగ్రెస్‌లో ప్రాథమిక సభ్యత్వం మాత్రమే కలిగి ఉన్నానని, ఏ విధమైన రాజకీయ పదవులలో లేనని వెల్లడించారు. టీఎంసీలో చేరిన తాను పార్టీ అభివృద్ధికి ఓ సైనికుడిలా పనిచేస్తానని చెప్పారు. కాగా, గతంలో కాంగ్రెస్ తరఫున జంగిపూర్ నుంచి ఎంపీగా, నల్హటీ నుంచి ఎమ్మెల్యేగా గెలుపొందిన అభిజిత్‌కు వచ్చే ఉపఎన్నికల్లో టీఎంసీ జంగిపూర్ అసెంబ్లీ సీటు ఇవ్వనున్నట్టు తెలుస్తోంది. మరోవైపు కాంగ్రెస్ హయాంలో రాష్ట్రపతి పదవి అధిరోహించిన ప్రణబ్ ముఖర్జీ తనయుడే పార్టీ మారడం బెంగాల్ రాజకీయాల్లో చర్చనీయాంశమైంది.

Advertisement

Next Story

Most Viewed