ప్రకాశంలో 29 మంది ఎస్సైలు బదిలీ 

దిశ, వెబ్ డెస్క్: ప్రకాశం జిల్లా ఎస్పీ సిద్దార్థ్ కౌశల్మరో సంచలన నిర్ణయం తీసుకున్నారు. 29 మంది ఎస్సైలను బదిలీ చేస్తూ శుక్రవారం ఉదయం ఉత్తర్వులు జారీ చేశారు. గత కొద్దికాలంగా పోలీసు శాఖలో ఎస్పీ ప్రక్షాళన చేపట్టిన క్రమంలోనే ఈ బదిలీలు కూడా జరిగాయని భావిస్తున్నారు. ఒకేసారి 29 మంది ఎస్సైలను బదిలీ చేయటం అనేది సంచలనంగా మారింది.

కాగా ఇటీవలె వివిధ స్టేషన్లకు చెందిన 38మంది కిందిస్థాయి అధికారులు, సిబ్బందిపై బదిలీ వేటు వేస్తూ గత శుక్రవారం ఎస్పీ సిద్దార్థ్ ఉత్తర్వులు ఇచ్చారు. వారిలో నలుగురు ఏఎ్‌సఐలు, 9 మంది హెడ్‌ కానిస్టేబుళ్లు, 16మంది కానిస్టేబుళ్లు, 9 మంది హోంగార్డులు ఉన్నారు. ఒక సీఐ, మరో ఎస్‌ఐపై సస్పెన్షన్‌ వేటుతో పాటు, ఇప్పటివరకు ప్రకాశం జిల్లాలో 67మందిపై బదిలీ వేటు పడటం రాష్ట్రవ్యాప్తంగా సంచలనంగా మారింది.

జిల్లాలో వివిధ పోలీస్‌ స్టేషన్లు, అక్కడి అధికారులు, సిబ్బంది పనితీరుపై పెద్దఎత్తున విమర్శలు, ఆరోపణలు వెల్లువెత్తాయి. వాటిపై దృష్టిసారించిన ఎస్పీ సిద్ధార్థకౌశల్‌ వివిధ మార్గాల్లో విచారణ జరపగా అధిక ప్రాంతాల్లో ఇదే పరిస్థితి ఉన్నట్టు ఎస్పీ గుర్తించినట్టు తెలుస్తోంది.

ఆయా స్టేషన్ల పరిధిలో అవినీతి, అక్రమాలు, ప్రైవేటు పంచాయితీలు, ప్రజల పట్ల మర్యాదగా ప్రవర్తించకపోవడం, ఉన్నతాధికారుల ఆదేశాలు పాటించకుండా,  క్రమశిక్షణ కూడా లేకుండా వ్యవహరిస్తున్న పోలీసుల తీరును గాడిన పెట్టేందుకే ఎస్పీ ఈ బదిలీల నిర్ణయం తీసుకున్నట్టు భావిస్తున్నారు.

Advertisement