- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
ధర్నా చౌక్‌గా ప్రగతి భవన్..
దిశ, తెలంగాణ బ్యూరో : ప్రజలకు ఏ ఇబ్బంది, సమస్య వచ్చినా వాటిని తీర్చాల్సిన బాధ్యత సర్కారుదే. ప్రభుత్వానికి తమ సమస్యలు తెలిపేందుకు, నిరసన ప్రకటించేందుకు ఒక వేదిక అవసరం. అందులో భాగంగా ఏర్పడిందే ఇందిరాపార్క్ దగ్గర ధర్నాచౌక్. తెలంగాణ ఉద్యమంలోనూ కీలకపాత్ర పోషించింది. ఆ సమయంలో జరిగిన సభలు, సమావేశాలు, ధర్నాలకు ధర్నాచౌక్ వేదికగా మారింది. ఇలాంటి ఉద్యమాల అడ్డా ఇందిరాపార్క్ ధర్నాచౌక్‌ను రద్దు చేసి ప్రజా ఉద్యమాల గొంతు నొక్కారనే ఆరోపణలు వెల్లువెత్తాయి.
దీంతో, నేడు ప్రజాసంఘాలతో పాటు రైతులు, నిరుద్యోగులు, వివిధ వర్గాలకు చెందినవారు ప్రగతిభవన్‌నే టార్గెట్ చేశారు. సమస్యలు ప్రభుత్వం దృష్టికి వెళ్లాలన్నా, పరిష్కారం కావాలన్నా ఇప్పుడు ప్రగతిభవన్ వైపు దౌడు తీస్తున్నారు. అక్కడే ఆందోళనలకు దిగుతున్నారు. ఇది పోలీసులకు తలనొప్పిగా మారుతున్నది. ప్రస్తుతం సొంత సమస్య అయినా.. ప్రభుత్వ నిర్లక్ష్యాన్ని బహిర్గతం చేసే సమస్య అయినా ప్రగతిభవన్ వైపే చూడాల్సి వస్తోంది.
ఎక్కడ చెప్పుకోవాలి..?
ఓ వైపు ప్రగతిభవన్ దగ్గర భద్రతను పెంచుతున్నారు. ఇనుప కంచెలు వేశారు. మూడంచెల భద్రతా వ్యవస్థను రూపొందించారు. అయినా అక్కడకు వెళ్లేందుకు సాహసాలు చేయాల్సిన పరిస్థితులు ఎదురవుతున్నాయి. ఎందుకంటే సమస్యలు చెప్పుకునే వేదిక లేకపోవడం, ఎక్కడ చెప్పుకోవాలో తెలియకపోవడమే ప్రధాన కారణం. గతంలో సీఎం క్యాంపు కార్యాలయాలు, అధికారిక ప్రాంగణం సచివాలయంలో సీఎంలెవ్వరైనా ప్రజల కోసం ఎంతో కొంత సమయం వెచ్చించేవారు. కానీ, ఇప్పుడు సీఎంను కలవాలంటే అదో పెద్ద పద్మవ్యూహం. అందులోకి వెళ్లడం కూడా ఒక యుద్ధమే. మరోవైపు మండల స్థాయి అధికారుల నుంచి మొదలుకుని రాష్ట్రస్థాయి వరకు అధికారుల చేతి నుంచి ఏ పనీ కావడం లేదనే అభిప్రాయాలున్నాయి. ఒకరకంగా ప్రజా సమస్యలను తీర్చడంలో అధికార యంత్రాంగం విఫలమవుతూనే ఉంది. దీంతో, అంతా ప్రగతి భవన్ వైపే పరుగులు పెడుతున్నారు.
అంతా అటువైపే..!
రాష్ట్రంలోని ప్రజాసంఘాలు, రైతులు, నిరుద్యోగులు, యువకులు, ఉద్యోగులు, మేధావులతో పాటు పలు వర్గాలకు చెందినవారంతా ప్రభుత్వంపై నిరసన తెలిపేందుకు ధర్నాచౌక్‌గా ప్రగతిభవన్‌ను ఎంచుకుంటున్నారు. గతంలో సభలు, సమావేశాలతో ధర్నాచౌక్‌లో తమ సమస్యలను గళమెత్తేవారు. కానీ, 2017లో ప్రభుత్వం ధర్నాచౌక్‌ను బలవంతంగా ఎత్తేయడంతో అసలు సమస్య షురూ అయ్యింది. ఏకంగా ఆందోళనకారులు నేరుగా ముఖ్యమంత్రి నివాస ప్రాంతమైన ప్రగతిభవన్‌ను టార్గెట్ చేస్తున్నారు. ఇది సర్కారుకు మింగుడు పడటంలేదు. మరోవైపు పోలీసులకూ తలనొప్పిగా మారింది. ముఖ్యమంత్రి నివాసం కావడంతో నిత్యం వీవీఐపీలు, ఎంపీలు, మంత్రులు, ఇతర ప్రముఖులతో ఈ ప్రాంతం నిత్యం రద్దీగా ఉంటుంది.
ఈ క్రమంలో నిరసనకారులు గుంపులుగా చేరి నినాదాలతో ప్రదర్శనలు చేస్తుండటం, ఎటు వైపు నుంచి ఆందోళనకారులు వస్తారో తెలియని పరిస్థితి. ఇదే శాంతి భద్రతలపరంగా పోలీసు బాసులకు ఇబ్బందిగా మారింది. ఈ నిరసనల్లో అసాంఘిక శక్తులు వచ్చే ప్రమాదముందని పోలీస్ అధికారులు ఇప్పటికే సీఎంకు నివేదించారు. ఎలాంటి సమాచారం లేకుండా నేరుగా ప్రగతిభవన్ వద్ద ఆందోళనలు చేస్తుండటంతో పోలీసులకు ముచ్చెమటలు పడుతున్నాయి. మరోవైపు దీనిపై పరిష్కారం చూపించకపోగా.. భద్రతను పెంచారు. ఇనుప కంచెలతో మూడెంచల భద్రతా వ్యవస్థను రూపొందించుకున్నారు.
వాస్తవానికి గతంలో సచివాలయం, అసెంబ్లీ గేట్ల ముందు ప్రజాసంఘాలు, ఉద్యమకారులు తమ నిరసనలు తెలిపేవారు. అయితే, అసెంబ్లీ సమయంలో తీవ్ర ఇబ్బందులు ఏర్పడటాన్ని గుర్తించి 1990లో తెలుగుతల్లి విగ్రహం దగ్గరికి ధర్నాస్థలిని మార్చారు. ఆ తర్వాత 2000లో రెండు కిలోమీటర్ల దూరంలో ఉండాలని నిర్ణయానికొచ్చి అప్పటి ప్రభుత్వం ధర్నాలు, నిరసన కార్యక్రమాలకు ఇందిరాపార్కు గేటు వద్ద అనుమతించింది. స్వరాష్ట్రంలో మాత్రం ప్రజా ఉద్యమాలను అణచివేసే తీరులో మొత్తంగా ధర్నాచౌక్‌నే ఎత్తివేశారు.
ఇటీవల పెరుగుతున్న నిరసనలు..
గతేడాది నుంచి ప్రగతి భవన్ దగ్గర నిరసనలు పెరుగుతున్నాయి. గతేడాది సెప్టెంబర్‌లో ప్రగతిభవన్ ఎదుట ఓ ఆటో డ్రైవర్ ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. తనకు డబుల్ బెడ్ రూం ఇళ్లు కేటాయించాలని కోరుతూ ఆటో డ్రైవర్ చందర్ పెట్రోల్ పోసుకుని నిప్పంటించుకున్నాడు. ఆ తర్వాత నుంచి పలుమార్లు నిరసనలు పెరుగుతున్నాయి. ఇటీవల కేబినెట్ మీటింగ్‌కు వస్తున్న సమయంలో మంత్రి హరీశ్‌రావు కాన్వాయ్ ఎదుట ఇద్దరు యువకులు ఆత్మహత్యాయత్నం చేశారు. ఓ వ్యక్తి హరీశ్ కాన్వాయ్ కింద పడేందుకు ప్రయత్నించగా.. మరో యువకుడు తనతో పాటు తెచ్చుకున్న పెట్రోల్ పోసుకొని ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు.
భూ వివాదాన్ని పరిష్కరించడం లేదంటూ ఆరోపించారు. అదేవిధంగా ఇటీవల తొలగించిన స్టాఫ్ నర్సులు కూడా ప్రగతిభవన్‌ను ముట్టడించారు. అంతకు ముందు తమకు నియామకపత్రాలు ఇవ్వాలంటూ నర్సులు ఆందోళన చేశారు. తాజాగా బుధవారం కూడా ఓ వ్యక్తి ఆత్మహత్యకు ప్రయత్నించాడు. మెదక్ జిల్లా చిన్నశంకరంపేటకు చెందిన మొయినుద్దీన్ తనకు చెందిన వ్యవసాయ భూమిని బంధువులు కబ్జా చేశారని, అధికారుల చుట్టూ తిరుగుతున్నా సమస్య పరిష్కారం కాకపోవడంతో ఆత్మహత్యకు యత్నించాడు. దీనితో పాటుగా ఇటీవల బీజేపీ, కాంగ్రెస్, భజరంగ్‌దళ్, ఏబీవీపీ, ఎన్ఎస్‌యూఐ కార్యకర్తలు కూడా ప్రగతిభవన్ వైపే దూసుకుపోయారు.