టీకా పంపిణీకి పీపీపీ అవసరం : ఎయిమ్స్ చీఫ్ రణదీప్

by Shamantha N |
AIIMS chief Randeep Guleria
X

న్యూఢిల్లీ: కరోనాను ఎదుర్కోవడానికి ప్రస్తుతం అందుబాటులో ఉన్న ఏకైక అస్త్రం టీకానే అని, వీలైనంత తొందరగా ఎక్కువ మందికి వేయడానికి చర్యలు తీసుకోవాలని ఎయిమ్స్ డైరెక్టర్ రణదీప్ గులేరియా చెప్పారు. ఎక్కువ మందికి టీకా వేయడానికి వ్యాక్సినేషన్ ప్రక్రియలో ప్రైవేటుకు మరింత భాగస్వామ్యం కల్పించాలని అభిప్రాయపడ్డారు. ‘హెల్త్‌కేర్ వర్కర్లు, ఫ్రంట్‌లైన్ వర్కర్లకు టీకా వేయడం కొంచెం సులభం. ఎందుకంటే టీకా ఎవరికి వేయాలో ఒక స్పష్టత ఉంది. అలాగే, వారి సంఖ్య కూడా భారీగా ఏమీ లేదు. కానీ, 27 కోట్ల మందికి టీకా వేసే దశ గురించి ఆలోచిస్తే.. టీకా లబ్దిదారుల సంఖ్య చాలా ఎక్కువ. వీరందరి జాబితాను రూపొందించే వ్యవస్థ అవసరమవుతుంది.

ఈ వ్యవస్థ ఏర్పాటు చేయడం సులభం కాదు. దీనికోసం ప్రభుత్వ-ప్రైవేటు రంగాలు కలిసి పనిచేస్తే బాగుంటుందని భావిస్తున్నాను. అందుకే ఎక్కువ మందికి టీకా పంపిణీ చేయాలంటే పబ్లిక్-ప్రైవేట్ పార్ట్‌నర్షిప్‌ మంచిది’ అని డాక్టర్ గులేరియా అభిప్రాయపడ్డారు. కరోనా కేసులు తగ్గుముఖం పట్టడం మనకు దక్కిన మంచి అవకాశంగా పేర్కొన్నారు. మళ్లీ ఎప్పుడైనా కేసులు పెరిగే ముప్పు ఉందని అన్నారు. కాబట్టి కరోనాను ఎదుర్కొనే శక్తిని పెంచుకోవడానికి ఎక్కువమందికి టీకాను పంపిణీ చేయడం ఉత్తమమని తెలిపారు.

Advertisement

Next Story

Most Viewed