2న పోలవరంపై పీపీఏ అత్యవసర భేటీ

by srinivas |
2న పోలవరంపై పీపీఏ అత్యవసర భేటీ
X

దిశ, ఏపీ బ్యూరో: పోలవరం అంచనా విలువ రూ.20398.61 కోట్లే ప్రధాన అజెండాగా నవంబరు రెండో తేదీన పోలవరం ప్రాజెక్టు అథారిటీ (పీపీఏ) అత్యవసర సమావేశం జరగనుంది. హైదరాబాద్‌ లోని పీపీఏ కార్యాలయంలో ఉదయం 11 గంటలకు జరిగే ఈ భేటీలో కేంద్ర జలసంఘం సభ్యుడు, జలశక్తి శాఖ కమిషనర్‌, జలసంఘం పీపీవో చీఫ్‌ ఇంజనీరు, రాష్ట్ర జల వనరుల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఆదిత్యనాథ్‌ దాస్‌, పోలవరం ప్రాజెక్టు చీఫ్‌ ఇంజనీర్‌ సుధాకర్‌బాబు పాల్గొంటారు.

2017 మార్చి 15వ తేదీన కేంద్ర కేబినెట్‌ సమావేశంలో 2013-14 అంచనాల ప్రకారం పోలవరం అంచనా వ్యయం రూ.20,398.61 కోట్లుగా తీర్మానించారు. ఆనాటికి ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం ప్రాజెక్టుపై రూ.4,730.71 కోట్లు వ్యయం చేసింది. 2014 ఏప్రిల్‌ 1నాటికి ఉన్న ప్రాజెక్టు పనుల అంచనాను 2017-18 ఎస్ ఎస్ ఆర్ ప్రకారం రూ.55,548.87 కోట్లుగా కేంద్ర జలశక్తి శాఖ పరిధిలోని సాంకేతిక సలహా కమిటీ నిర్ధారించింది.

అనంతరం ఈ అంచనాలపై పూర్తిస్థాయిలో సమీక్షించి రూ.47,725.74 కోట్లుగా జలశక్తి శాఖ తేల్చింది. ఇప్పుడు 2013-14 అంచనా ప్రకారం రూ.20,398.61 కోట్లకే పరిమితమవుతామని కేంద్ర ఆర్థిక శాఖ చెబుతోంది. ఇందుకు 2017 మార్చి 15వ తేదీనాటి కేంద్ర కేబినెట్‌ నిర్ణయాన్ని తెరపైకి తెచ్చింది. వీటన్నిటిపై పీపీఏ సమావేశంలో చర్చించనున్నారు.

Advertisement

Next Story

Most Viewed