ఇక ‘పవర్’ ఫుల్లే

by  |
ఇక ‘పవర్’ ఫుల్లే
X

– విద్యుత్ రంగంలో భారీ సంస్కరణలు
– ముసాయిదా చట్టం రిలీజ్
– సంప్రదింపులకు 21 రోజులు టైమ్

దిశ, న్యూస్‌బ్యూరో: విద్యుత్ ధరలు ఇక ఎప్పటికప్పుడు ఉత్పత్తి, సరఫరా ఖర్చుకు తగ్గట్టు పెరగనున్నాయా.. కస్టమర్ల దగ్గర విద్యుత్ పంపిణీ సంస్థలు(డిస్కంలు) ఇక ఎప్పటికప్పుడు పెరిగిన విద్యుత్ ధరలను ముక్కు పిండి వసూలు చేయనున్నాయా.. రాష్ట్రాల విద్యుత్ రెగ్యులేటరీ కమిషన్( ఈఆర్సీలు) పవర్ చార్జీలు నిర్ణయించేటపుడు రాష్ట్ర ప్రభుత్వాలిచ్చే సబ్సిడీలను పరిగణనలోకి తీసుకోవాల్సిన అవసరం లేదా.. సబ్సిడీలు రాష్ట్ర ప్రభుత్వాలే నేరుగా వినియోగదారునికిచ్చుకోవాల్సిందేనా.. క్రాస్ సబ్సిడీ పేరిట కొన్ని క్యాటగిరీల కస్టమర్లే మిగతా కస్టమర్ల విద్యుత్ సబ్సిడీల భారం మోయాల్సిన అవసరం ఇక లేదా.. విద్యుత్ కొనడానికి జెన్‌కోలతో పీపీఏలు చేసుకునే ముందే పేమెంట్ గ్యారంటీ సమర్పించాలా.. అలా అయితేనే నేషనల్ లోడ్ డిస్పాచ్ సెంటర్ నుంచి కరెంటు సరఫరా చేస్తారా.. అంటే అవుననే తెలుస్తోంది. దేశ వ్యాప్తంగా విద్యుత్ పంపిణీ రంగంలో పెట్టుబడులు తీసుకొచ్చే దిశగా భారీ సంస్కరణలు తీసుకురావడానికి కేంద్ర ప్రభుత్వం సిద్ధమవుతోంది. దీనిలో భాగంగా పాత విద్యుత్ చట్టంలో పలు సవరణలతో విద్యుత్ సవరణ చట్టం 2020ను పార్లమెంటులో త్వరలో ప్రవేశపెట్టనుంది. దీనిలో భాగంగా ఈ చట్టానికి సంబంధించిన ముసాయిదాను విడుదల చేసి స్టేక్ హోల్డర్ల ముందుంచింది. దీనిపైన 21 రోజుల్లోగా సలహాలు, సూచనలు, అభ్యంతరాలు తెలియజేయాలని వారిని కోరింది. రాష్ట్రాల్లోని విద్యుత్ పంపిణీ సంస్థలు రాష్ట్ర ప్రభుత్వాలతో సంబంధం లేకుండా తమ పరిధిలో ఉన్న ప్రాంతాల్లో విద్యుత్ పంపిణీకి ఇతర పంపిణీ సంస్థలకు ఫ్రాంచైజీలు ఇవ్వొచ్చని చట్టంలో పేర్కొంది. హైడ్రో పవర్‌ను సైతం రెన్యువబుల్ పవర్‌ కేటగిరీలో చేర్చే సవరణను సైతం ఈ చట్టంలో చేర్చారు. విద్యుత్ రంగంలో వాణిజ్య విలువలు పెంపొందించి తద్వారా సెక్టార్‌లోకి పెట్టుబడులు తీసుకురావడం ఈ చట్టం ఉద్దేశమని పవర్ మంత్రిత్వ శాఖ పేర్కొంది.

tags : power ministry, new act, reforms, discoms, payments, investments, consultations
slug :


Next Story

Most Viewed