కలవరం.. మెంటల్ రోగులకు కరోనా

by Shyam |   ( Updated:2020-08-18 01:15:50.0  )
కలవరం.. మెంటల్ రోగులకు కరోనా
X

దిశ, న్యూస్ బ్యూరో: నిత్యం నాలుగు గోడల మధ్య క్లోజ్డ్ వార్డులో ఉండే రోగులకు కూడా కరోనా సోకింది. ఎర్రగడ్డ మెంటల్ ఆసుపత్రిలోని ఈ వార్డులో ఉండే 70 మంది పేషెంట్లకు కరోనా పరీక్షలు చేస్తే 25 మందికి పాజిటివ్ అని తేలింది. నిత్యం వార్డు లోపల ఉండేవారే అయినా వైరస్ ఎక్కడి నుంచి అంటుకుందనేది డాక్టర్లకు కూడా అంతు చిక్కడం లేదు. వారికి చికిత్స అందించిన సిబ్బందికి, డాక్టర్లకు, ఇతర వార్డుల్లోని పేషెంట్లకు కూడా అంటుకుందా అని వారు ఆందోళన పడుతున్నారు. ప్రస్తుతం ఈ 25 మంది మానసిక రోగుల కోసం ప్రత్యేకంగా ఐసొలేషన్ వార్డు ఏర్పాటైంది. ఈ వార్డులో ఉండే ఒకరిద్దరు పేషెంట్లు ఇటీవల వివిధ వైద్య అవసరాల నిమిత్తం బయటి ఆసుపత్రులకు వెళ్లివచ్చారని, ఆ తర్వాత వారిలో కరోనా లక్షణాలు కనిపించాయని సూపరింటెండెంట్ డాక్టర్ ఉమాశంకర్ చెబుతున్నారు.

టెస్టు చేసిన తర్వాత పాజిటివ్‌గా నిర్ధారణ కావడంతో ఆందోళనకు గురయ్యామని అన్నారు. వెంటనే అనుమానంతో మరో ఎనిమిది మందికి కూడా కరోనా పరీక్షలు చేశామని, ఒక్కరికి కూడా పాజిటివ్ రాకపోవడంతో ఊపిరి పీల్చుకున్నామన్నారు. వారం రోజుల క్వారంటైన్ తర్వాత ఈ నెల 13వ తేదీ నుంచి వరుసగా ఎంపిక చేసిన పేషెంట్లకు కరోనా పరీక్షలు చేయడం మొదలుపెట్టామని, ఆదివారం సాయంత్రానికి పాతిక మందికి పాజిటివ్ ఉన్నట్లు తేలిందని వివరించారు. వీరిలో ఏ ఒక్కరికీ కరోనా లక్షణాలు కనిపించలేదని పేర్కొన్నారు.

తగిన జాగ్రత్తలతో

మానసిక రోగులకు కరోనా సోకిన విషయమై వైద్య విద్య డైరెక్టర్ డాక్టర్ రమేశ్‌రెడ్డితో మాట్లాడామని డాక్టర్ ఉమాశంకర్ చెప్పారు. ఆసుపత్రిలోనే ఐసొలేషన్ వార్డును ఏర్పాటు చేశామని, 25 మంది పేషెంట్లనూ అందులోకి షిప్టు చేశామని తెలిపారు. వీరికి చికిత్స అందించే డాక్టర్లు, నర్సులు, సిబ్బందికి పీపీఈ కిట్లు, ఎన్-95 మాస్కులను అంద జేస్తున్నామన్నారు. మునుపటికంటే మరింత అప్రమత్తంగా ఉంటున్నామని వివరించారు. పల్మనాలజిస్టును కూడా రప్పిస్తున్నామని తెలిపారు. నిత్యం ఆక్సిజన్ స్థాయిలను పరిశీలిస్తున్నామని, శ్వాసకోశ సంబంధ సమస్యలు ఉత్పన్నమయితే వెంటనే పక్కనే ఉన్న ఛెస్ట్ ఆసుపత్రికి తరలించేలా ఏర్పాట్లు చేశామని తెలిపారు. ఐసొలేషన్ వార్డులో ఆక్సిజన్ సౌకర్యాన్ని కూడా ఏర్పాటు చేసినట్లు తెలిపారు. మిగిలిన పేషెంట్లకు చికిత్స అందిస్తున్న స్టాఫ్‌కు కూడా ఎన్-95 మాస్కులను అందిస్తున్నామని, పేషెంట్లకు వైరస్ అంటుకోకుండా రోజూ శానిటైజేషన్ చేస్తున్నామని వివరించారు.

వారి ద్వారా అంటుకుంటుందేమో

లాక్‌డౌన్ తర్వాత ఆసుపత్రికి వచ్చే పేషెంట్ల సంఖ్య గణనీయంగా తగ్గిపోయిందని డాక్టర్ ఉమాశంకర్ తెలిపారు. ఔట్‌ పేషెంట్ల ద్వారా వైరస్ వచ్చి ఉండొచ్చన్న అనుమానాన్ని వ్యక్తం చేశారు. మెరుగైన చికిత్స కోసం ఇక్కడి పేషెంట్లను ఉస్మానియా జనరల్ ఆసుపత్రి లేదా స్పెషాలిటీ ఆసుపత్రులకు తరలిస్తుంటామని, అలా వెళ్లిన సమయంలోనూ సోకి ఉండొచ్చని పేర్కొన్నారు. పేషెం ట్లను కలవడానికి బంధువులు వచ్చినపుడు స్క్రీనింగ్ టెస్టు కూడా నిర్వహిస్తున్నామన్నారు. గత నెలలో తమ ఆసుపత్రులో పనిచేస్తున్న నలుగురు నర్సులు, ముగ్గురు వార్డు బాయ్‌లు, ఒక ఆసిస్టెంట్ ప్రొఫెసర్, ఒక సీనియర్ రికార్డు అసిస్టెంట్, ఒక పీజీ డాక్టర్‌కు కరోనా పాజిటివ్ వచ్చిందన్నారు. వారంతా కోలుకున్నారని, ఒక్క అసిస్టెంట్ ప్రొఫెసర్ మినహా మిగిలినవారంతా డ్యూటీలో చేరారని తెలిపారు. జైళ్ల నుంచి కోర్టు ఉత్తర్వుల ద్వారా చాలా మంది వస్తూ పోతూ ఉంటారని తెలిపారు. వార్డు బాయ్‌లు, సిబ్బంది ఇళ్ల నుంచి వస్తూ ఉంటారు కాబట్టి తెలియకుండా అంటుకుని ఉండొచ్చనే అనుమానంతో వారికి కూడా టెస్టులు నిర్వహించాలని భావిస్తున్నామన్నారు.

Advertisement

Next Story