కేసీఆర్… దమ్ముంటే చర్చకు రా.. పొన్నాల సవాల్

by Ramesh Goud |
Ponnala
X

దిశ, తెలంగాణ బ్యూరో : కేసీఆర్‌కు దమ్ముంటే ఇరిగేషన్ ప్రాజెక్టులపై చర్చకు రావాలని మాజీమంత్రి పొన్నాల లక్ష్మయ్య సవాల్ విసిరారు. కాళేశ్వరం అంటే కమీషన్ల ప్రాజెక్టుగా మారిందని ధ్వజమెత్తారు. శుక్రవారం గాంధీభవన్ లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. కేసీఆర్ ప్రచార ఆర్భాటాలతో మీడియా ముందుకు రాకుండా అబద్దాలతో కప్పిపుచ్చుకుంటున్నారని ఆరోపించారు. ఆర్డీఎస్ గురించి చాలా మాట్లాడిన కేసీఆర్ ఈ రోజు ఏం చేస్తున్నారని ప్రశ్నించారు.

తెలంగాణ ప్రయోజనాలు దెబ్బ తింటుంటే ఆంధ్ర, తెలంగాణ సీఎంలు చీకటి దోస్తానా చేస్తారా అని ప్రశ్నించారు. కాంగ్రెస్ పార్టీ పాలనలో నిర్మించిన ప్రాజెక్టుల కిందనే ఎస్సారెస్పీ నుంచి నాగార్జునసాగర్ వరకు వరిసాగవుతుందన్నారు. పాత ప్రాజెక్టుల కిందనే 41 లక్షల ఎకరాలకు నీరు అందుతున్నట్లు నీటిపారుదల శాఖ ప్రకటించిందని తెలిపారు. కాళేశ్వరం కమీషన్లకు తప్ప.. ఒక్క ఎకరాకు సాగునీరు అందడం లేదని ఆరోపించారు.

పాలమూరు ఎత్తిపోతలను రెండేళ్లలో పూర్తి చేస్తామని చెప్పిన కేసీఆర్ ముఖం ఎక్కడ పెట్టుకున్నారన్నారు. కేసీఆర్ మాటలకే తప్ప చేతల్లో లేరని ఎద్దేవా చేశారు. కేసీఆర్ ప్రారంభించింది కాళేశ్వరం, పాలమూరు ఎత్తిపోతల, సీతారామ, తుపాకులగూడెం కేవలం నాలుగు ప్రాజెక్టులేననన్నారు. ఆ ప్రాజెక్టుల కోసం రూ.97,300 కోట్లు ఇరిగేషన్ మీద ఖర్చు చేస్తే.. ఒక్క ఎకరానికి నీరు రాలేదని ధ్వజమెత్తారు. ఇప్పుడు కాళేశ్వరం ఎత్తిపోస్తున్న నీళ్లు.. రెండు రోజుల్లో మళ్లీ కిందకు వదలాల్సిందేనని దుయ్యబట్టారు. ప్రభుత్వ పాలన కూడా ఇలాగే రాష్ట్రంలో కొనసాగుతుందని ఆరోపించారు.

Advertisement

Next Story

Most Viewed