మేడ్చల్‌లో కలెక్టర్ ఉత్తర్వులు బేఖాతరు

by Anukaran |
మేడ్చల్‌లో కలెక్టర్ ఉత్తర్వులు బేఖాతరు
X

దిశ ప్రతినిధి, మేడ్చల్: చెరువులు.. కుంటలు..ఎఫ్ టీఎల్ స్థలాలు యథేచ్ఛగా కబ్జాకు గురవుతున్నాయి. అడ్డుకోవాల్సిన రెవెన్యూ, నీటి పారుదల శాఖ అధికారులు కరోనా, లాక్ డౌన్ పేరు చెప్పి తప్పించుకుంటుండగా, ఇదే అదనుగా ప్రజాప్రతినిధులు ముందుండి కబ్జా బాగోతాన్ని రక్తి కట్టిస్తున్నరన్నా ఆరోపణలు ఉన్నాయి. ఓ వైపు సీఎం కేసీఆర్ ‘చెరువులను పునరుద్ధరిస్తాం.. గొలుసు కట్టు చెరువులకు పూర్వ వైభవాన్ని తీసుకువస్తాం’ అని చెబుతుండగా.. మరోవైపు ఆ పార్టీకి చెందిన ఎమ్మెల్యేలు, కార్పొరేటర్లే సూత్రధారులుగా చెరువులు, కుంటల స్థలాలను కబ్జా చేస్తున్నరన్నా విమర్శలు సైతం ఉన్నాయి. దీంతో చరిత్ర పుటల్లోకెక్కిన మేడ్చల్ జిల్లాలో చెరువులు విస్తీర్ణాన్ని కోల్పోతున్నాయని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

అభివృద్ధి పేరిట కబ్జా..

సమగ్ర సర్వే నిర్వహించిన రెవెన్యూ యంత్రాంగం జిల్లా పరిధిలో 530 చెరువులు/ కుంటలు ఉన్నట్లు గుర్తించాయి. వీటి పరిరక్షణకు గూగుల్ మ్యాప్ ను రూపొందించింది. చెరువుల సుందరీకరణ కోసం విడతల వారీగా నిధులను మంజూరు చేసింది. అయినా కొందరు అధికార పార్టీ ప్రజాప్రతినిధులు అభివృద్ధి పేరిట చెరువులు, కుంటల స్థలాలను మాయం చేస్తున్నారనే ఆరోపణలున్నాయి. ఇటీవల కూకట్ పల్లి మండలం హైదర్ నగర్ సర్వే నంబర్ 119లోని కింది కుంట చెరువు స్థలంలో స్థానిక ఎమ్మెల్యే అరికెపూడి గాంధీ మట్టి, మొరం పోసి చదను చేయడం పెద్ద దూమారాన్నే లేపింది. ఎమ్మెల్యే చెరువును కబ్జా చేస్తున్నారని స్థానికంగా కొందరు వ్యక్తులు రెవెన్యూ, ఇరిగేషన్ శాఖ అధికారులకు ఫిర్యాదు చేయగా, సొంత నిధులతో చెరువును సుందరీకరిస్తున్నట్లు ఎమ్మెల్యే పనులను కొనసాగించడం పలు అనుమానాలకు తావిస్తున్నది.

అడ్డుకుంటున్నా ఆగకుండా..

తహసీల్దార్ పనులను అడ్డుకున్నా.. కలెక్టర్ చెరువు వద్ద ఎలాంటి పనులు చేపట్టవద్దని ఉత్తర్వులు జారీ చేసినా.. జీహెచ్ ఎంసీ ఉన్నతాధికారులతో కలిసి ఎమ్మెల్యే అక్కడ పనులు చేపట్టడం వెనుక మర్మం ఏమిటని పలువురు ప్రశ్నిస్తున్నారు. ఇదే తరహాలో కూకట్ పల్లి నియోజకవర్గంలో మైసమ్మకుంట, ముండ్లకత్వ, రంగనాయక చెరువు, కాజాకుంట, పరిక్ చెరువు, సున్నం చెరువు, హస్మత్ పేట్ చెరువు, నల్ల చెరువులు దాదాపు 50 శాతానికిపైగా కబ్జాకు గురైనట్లు రెవెన్యూ అధికారులు పేర్కొంటున్నారు.

ఓపెన్ జిమ్, యూత్ క్లబ్ పేరిట..

మేడ్చల్ జిల్లాలోని ఉప్పల్ మండల పరిధి రామాంతపూర్ ‘చిన్న చెరువు’కు సంబంధించిన ఎఫ్ టీ ఎల్ స్థలంలో నిబంధనలకు విరుద్ధంగా సంబంధిత శాఖల నుంచి ఎలాంటి అనుమతులు తీసుకోకుండా జీహెచ్ఎంసీ ఓపెన్ జిమ్ ను ఏర్పాటు చేసినట్లు స్థానికులు, చేపల పెంపకం దార్లు ఆరోపిస్తున్నారు. స్థానిక ఎమ్మెల్యే బేతి సుభాష్ రెడ్డి, కార్పొరేటర్ జ్యోత్స్న భర్త నాగేశ్వర్ రావు జూలై 5వ తేదీన చిన్న చెరువు ఎఫ్ టీఎల్ స్థలంలో ఓపెన్ జిమ్ ఏర్పాటు చేయడంపై స్థానికులు మండిపడుతున్నారు. ఇందుకోసం చెరువును మట్టితో పూడ్చి వేస్తున్నారని, అదేవిధంగా ఇక్కడ ఇప్పటికే ఓ దేవాలయాన్ని నిర్మించగా, మరో యూత్ క్లబ్ పేరిట భవనాన్ని నిర్మించేందుకు సన్నాహాలు చేస్తున్నట్లు సోషలిస్ట్ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి డాక్టర్ లూబ్నా షరావత్ పేర్కొంటున్నారు. ఈ నిర్మాణాల వల్ల చెరువు కనుమరుగయ్యే ప్రమాదం ఉందని, పర్యావరణానికి ముప్పు వాటిల్లే ప్రమాదం ఏర్పడుతుందని అవేదన వ్యక్తంచేస్తున్నారు.

కాగా గతంలో ఈ చెరువు విస్తీర్ణం 27.25 ఎకరాలుండేది. తదనంతర సమయంలో కబ్జాకు గురవ్వగా ప్రస్తుతం 11.45 ఎకరాలు మాత్రమే మిగిలి ఉంది. చెరువును పరిరక్షించాలని స్థానికులు రెవెన్యూ, ఇరిగేషన్ శాఖ అధికారులకు పలుమార్లు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదని వాపోతున్నారు. ఇప్పటికైనా చిన్న చెరువుకు సంబంధించిన ఎఫ్ టీఎల్ స్థలంలో అక్రమ నిర్మాణాలను అడ్డుకోవాలని స్థానికులు కోరుతున్నారు. ఈవిషయమై ఉప్పల్ మండల ఇన్ చార్జి తహసీల్దార్ గౌతమ్ కుమార్ ను వివరణ కోరేందుకు ‘దిశ’ ప్రతినిధి ప్రయత్నించగా, ఆయన అందుబాటులో లేరు. ఫోన్ లో సంప్రదించగా ఆయన లిఫ్ట్ చేయలేదు.

Advertisement

Next Story