రేపే కర్ణాటక సీఎం ప్రమాణ స్వీకారోత్సవం.. కేసీఆర్కు అందని ఆహ్వానం..!

by Javid Pasha |   ( Updated:2023-05-19 11:25:37.0  )
రేపే కర్ణాటక సీఎం ప్రమాణ స్వీకారోత్సవం.. కేసీఆర్కు అందని ఆహ్వానం..!
X

దిశ, వెబ్ డెస్క్: ఇటీవల నిర్వహించిన కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఘన విజయం సాధించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలోనే ఆ పార్టీకి చెందిన సీనియర్ నేతసిద్ధరామయ్య రేపు సీఎంగా ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. ఇక సీఎం పోస్టు కోసం తీవ్రంగా ప్రయత్నించిన కర్ణాటక పీసీసీ చీఫ్ డీకే శివకుమార్ డిప్యూటీ సీఎంగా బాధ్యతలు తీసుకోబోతున్నారు. ఈ క్రమంలోనే కాంగ్రెస్ పార్టీ దేశంలోని పలువురు బీజేపీయేతర సీఎంలు, ఇతర ప్రముఖులకు కార్యక్రమానికి రావాలని ఆహ్వానం పంపింది. అందులో బీహార్ సీఎం నితీశ్ కుమార్, అక్కడి డిప్యూటీ సీఎం తేజస్వీ యాదవ్, బెంగాల్ సీఎం మమతాబెనర్జీ, తమిళనాడు సీఎం స్టాలిన్, కేరళ సీఎం పినరయ్ విజయన్, జార్ఖండ్ సీఎం హేమంత్ సోరెన్ తదితరులకు ఇన్విటేషన్ పంపింది. ఇక కర్ణాటకు చెందిన జేడీఎస్, బీజేపీ నేతలను కూడా కాంగ్రెస్ పార్టీ నాయకులు ఆహ్వానించారు. కానీ పక్కనే తెలంగాణ సీఎం కేసీఆర్ కు మాత్రం కాంగ్రెస్ ఆహ్వానం పంపలేదు.

అవన్నీ దృష్టిలో పెట్టుకునే కేసీఆర్ను పిలవలేదా..?

ఇక సీఎం కేసీఆర్ ను కర్ణాటక సీఎం ప్రమాణ స్వీకారం కార్యక్రమానికి పిలవకపోవడానికి ప్రధానం కారణం కేసీఆర్ వ్యవహార శైలే కారణమని తెలుస్తోంది. తెలంగాణ ఉద్యమ సమయంలో ప్రత్యేక రాష్ట్రాన్ని ఇస్తే టీఆర్ఎస్ పార్టీని కాంగ్రెస్ లో విలీనం చేస్తానని స్వయంగా కేసీఆర్ అప్పటి ఏఐసీసీ చీఫ్ సోనియాను కలిసి చెప్పారని అప్పట్లో వార్తలు వచ్చాయి. తెలంగాణ ఇస్తే ఏపీలో పార్టీకి తీవ్ర నష్టం కలుగుతుందని తెలిసినా తెలంగాణలో కాంగ్రెస్ కు ఎదురుండదని కాంగ్రెస్ నాయకులు భావించారు. ఈ క్రమంలోనే కేసీఆర్ మాటలు నమ్మిన కాంగ్రెస్ తెలంగాణ ఇచ్చిందని ప్రచారం జరిగింది. అయితే అనుకున్నదొక్కటి అయిందొక్కటి అన్న చందంగా తెలంగాణ వచ్చాక కేసీఆర్ టీఆర్ఎస్ ను కాంగ్రెస్ లో విలీనం చేయకపోవడంతో కాంగ్రెస్ కు తీరని నష్టం వాటిల్లింది. ఇక అనంతరం రాష్ట్రంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన కేసీఆర్.. మొదట్లో బీజేపీతో అంటకాగారు. ఈ క్రమంలోనే కాంగ్రెస్ ను నామరూపాల్లేకుండా చేయాలనే ఎత్తుగడతో కాంగ్రెస్ ఎమ్మెల్యేలను కేసీఆర్ తమ పార్టీ వైపు తిప్పుకున్నారు. అనంతరం జరిగిన పరిణామాల్లో కాంగ్రెస్ తో సమానంగా రాష్ట్రంలో బీజేపీ ఎదిగుతూ వస్తోంది. అయితే దీనంతటికీ కేసీఆరే కారణమని కాంగ్రెస్ అగ్రనేతలు భావిస్తున్నారని ఆ పార్టీకి చెందిన సీనియర్ నాయకులు చెబుతున్నారు.

కాంగ్రెస్ ను రాష్ట్రంలో లేకుండా చేయాలనే తలంపుతోనే కేసీఆర్ బీజేపీని పైకిలేపారనే ప్రచారం జరిగింది. అలాగే థర్డ్ ఫ్రంట్ పేరుతో దేశంలో కాంగ్రెస్ ను ఖతం చేయాలని కేసీఆర్ కంకణం కట్టుకున్నారని, ఈ సందర్భంగా పరోక్షంగా కేసీఆర్ మోడీకి మేలు చేసేలా వ్యవహరిస్తున్నారని కాంగ్రెస్ భావించింది. అందుకే ఆయనను సిద్ధరామయ్య ప్రమాణ స్వీకార వేడుకకు పిలవలేదని ప్రచారం జరుగుతోంది. ఇక కర్ణాటక ఎన్నికల్లో సాధించిన విజయంతో త్వరలో జరగనున్న ఎన్నికల్లో కేసీఆర్ ను ఓడించడమే లక్ష్యంగా కాంగ్రెస్ పావులు కదుపుతోందని ప్రచారం జరుగుతోంది. ఇక కేసీఆర్ తో పాటు ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి, ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ లను కూడా కాంగ్రెస్ ఈ కార్యక్రామినిక పిలవలేదు. ఇక జగన్ వల్ల ఏపీలో కాంగ్రెస్ పార్టీ తీరని నష్టం జరగ్గా.. కేజ్రీవాల్ పార్టీ వల్ల దేశంలో కాంగ్రెస్ ఓటు బ్యాంకుకు గండీ పడుతోందని కాంగ్రెస్ అగ్రనేతలు భావించినట్లు తెలుస్తోంది.

Read more:

గెలవాల్సింది పార్టీలు కాదు ప్రజలు: సీఎం కేసీఆర్

Advertisement

Next Story

Most Viewed