- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
దుబ్బాకలో పోటాపోటీ ప్రచారం..
దిశ ప్రతినిధి, మెదక్ :
ఎలక్షన్ దగ్గర పడుతున్న కొద్దీ దుబ్బాక ఉప పోరు రసవత్తరంగా మారుతున్నది. ‘నువ్వా.. నేనా’ అనే తీరుగా ప్రధాన పార్టీల్లోని నాయకులు ఇంటింటికీ పరుగులు పెడుతుండడంతో ప్రచారం జోరందుకున్నది. రోజుకో ప్రాంతం.. రోజుకో నాయకుడు వెళ్లి ఆకర్షించే హామీలు గుప్పిస్తూ, ఆకట్టుకునే ప్రసంగాలతో ఓటర్లను తమవైపు తిప్పుకుంటున్నారు. వర్షాలనూ లెక్కజేయకుండా గడపగడపకూ తిరుగుతూ ఓట్లు అభ్యర్థిస్తున్నారు. ఒకవైపు ప్రత్యర్థులపై విమర్శల వర్షం కురిపిస్తూనే మరోవైపు తమ అనుకూలతలను ప్రజల దృష్టికి తీసుకెళ్తున్నారు. పార్టీల నాయకులు, కార్యకర్తల జంపింగ్‌లు.. చేరికలు కొనసాగుతూనే ఉన్నాయి. టీఆర్ఎస్, బీజేపీ అభ్యర్థులు నామినేషన్లు వేయడంతో నియోజకవర్గ రాజకీయం మరింత వేడెక్కింది.
దుబ్బాక ఉప ఎన్నికల ప్రచారం కాక పుట్టిస్తుంది. ప్రధాన పార్టీలైన టీఆర్ఎస్, బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు ఒకరిపై మరొకరు తీవ్ర స్థాయిలో విమర్శలు చేస్తూ ప్రచారంలో దూసుకుపోతున్నారు. అన్ని పార్టీలకు ఈ ఉప ఎన్నిక ప్రతిష్టాత్మకంగా మారడంతో రాష్ట్ర స్థాయి నేతలంతా దుబ్బాకలోనే మకాం వేసి ప్రచారం నిర్వహిస్తున్నారు. టీఆర్ఎస్‌లో అన్నీ తానై ఆర్థిక మంత్రి హరీశ్ రావు వ్యవహరిస్తుండగా, ఇతర మంత్రులు, ఎంపీ, ఎమ్మెల్యేలు, జిల్లా నాయకులు వారి వీలును బట్టి ప్రచారం చేస్తూ సోలిపేట సుజాతకు లక్ష మెజార్టీ రావడం ఖాయమని ధీమా వ్యక్తం చేస్తున్నారు.
ఇక కాంగ్రెస్ నుంచి టీపీసీసీ రాష్ట్ర అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి, ఎమ్మెల్యేలు, ఎంపీలు సీతక్క, కోమటిరెడ్డి వెంకటరెడ్డి, రేవంత్ రెడ్డి, మాజీ ప్రజాప్రతినిధులు దాయోదర రాజనర్సింహ, వీ.హనుమంతారావు, ఇతర నాయకులు దుబ్బాకలో ఉంటూ ప్రచారంలో జోరు పెంచుతున్నారు. నియోజకవర్గంలో చెరుకు ముత్యంరెడ్డి చేసిన అభివృద్ధే అతని తనయుడు చెరుకు శ్రీనివాస్ రెడ్డిని గెలిపిస్తుందని కాంగ్రెస్ నేతలు భావిస్తున్నారు. బీజేపీలో ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్, మాజీ ఎంపీ జితేందర్ రెడ్డి ప్రచారం చేస్తూ రఘునందన్ రావు గెలుపు ఖాయమని స్పష్టం చేస్తున్నారు.
తమదైన శైలిలో ప్రచారం..
ప్రధాన పార్టీల నాయకులు తమదైన శైలిలో ప్రచారం చేస్తూ ఓటర్లను తమ వైపు తిప్పుకునే ప్రయత్నాలు చేస్తున్నారు. గత ప్రభుత్వాల హయాంలో నియోజకవర్గంలో అభివృద్ధి అనేదే లేదని, ప్రత్యేక రాష్ట్రం ఏర్పడి దుబ్బాకకు సోలిపేట రామలింగారెడ్డి ఎమ్మెల్యే అయిన తర్వాతే నియోజకవర్గ పరిస్థితులు చక్కబడ్డాయని టీఆర్ఎస్ నాయకులు ప్రచారం చేస్తున్నారు. మున్ముందు నియోజకవర్గాన్ని మరింత అభివృద్ధి చేస్తామనే భరోసాను ప్రజలకు కల్పిస్తున్నారు. కాంగ్రెస్ మాత్రం నియోజకవర్గ అభివృద్ధి తమ హయాంలోనే జరిగిందని ముత్యం రెడ్డి చేసిన పనులను వివరించే ప్రయత్నం చేస్తోంది. ప్రస్తుతం రాష్ట్ర ప్రభుత్వ పాలనతో ప్రజలు విసిగిపోయి ఉన్నారని, ఇక దుబ్బాక నుండే టీఆర్ఎస్ పతనం ప్రారంభం కానుందని కాంగ్రెస్ నేతలు చెబుతున్నారు.
బీజేపీ బూత్ స్థాయి సమావేశాలు, ర్యాలీలు, ఇంటింటికీ తిరుగతూ ప్రచారం వేగం పెంచింది. ప్రధానంగా కేంద్ర ప్రభుత్వం రాష్ట్రానికి ఇస్తున్న నిధులు, యూత్‌లో ఉన్న ఫాలోయింగ్ పై ఆశలు పెట్టుకొని ఎప్పటికప్పడు టీఆర్ఎస్ ప్రతికూలతలను ప్రజలకు వివరించే ప్రయత్నం చేస్తున్నది. మొత్తానికి ఎలక్షన్ సమయం దగ్గర పడుతున్నకొద్దీ నాకులు ప్రచారం వేగం పెంచుతూ ఓటర్లను ఆకట్టుకునే ప్రసంగాలు చేస్తూ ముందుకెళ్తున్నారు. వరుసగా వర్షాలు కురుస్తున్నా వాటిని లెక్కజేకుండా ప్రచారంలో నిమగ్నమైపోతున్నారు. ఇదిలావుండగా రోజూ ప్రధాన పార్టీల్లో నాయకులు, కార్యకర్తల జంపింగ్‌లు, చేరికలు కొనసాగుతూనే ఉన్నాయి.
ప్రధాన పార్టీల నామినేషన్లతో..
దుబ్బాక ఉప ఎన్నికల రణరంగంలో ప్రధాన ఘట్టమైన నామినేషన్ ప్రక్రియ ఈ నెల 9న ప్రారంభం కాగా బుధవారం ప్రధాన పార్టీలైన టీఆర్ఎస్, బీజేపీ అభ్యర్థులు నామినేషన్ దాఖలు చేశారు. టీఆర్ఎస్ పార్టీ తరపున దివంగత మాజీ ఎమ్మెల్యే సోలిపేట రామలింగారెడ్డి భార్య సుజాత, రాష్ట్ర ఆర్ధిక మంత్రి తన్నీరు హరీశరావు, మెదక్ ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డితో కలిసి నామినేషన్ దాఖలు చేయగా, బీజేపీ తరఫున ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌తో కలిసి అభ్యర్థి రఘునందన్ రావు భారీ ర్యాలీతో వెళ్లి నామినేషన్ దాఖలు చేశారు. మరో ప్రధాన పార్టీయైన కాంగ్రెస్ గురువారం నామినేషన్ దాఖలు చేసే అవకాశం ఉంది. అయితే ప్రధాన పార్టీల్లో రెండు పార్టీలకు సంబంధించిన అభ్యర్థులు నామినేషన్లు వేయడంతో ఒక్కసారిగా నియోజకవర్గ రాజకీయం వేడెక్కింది. ఈ క్రమంలో గురువారం నుండి ఉప పోరు ప్రచారం మరింత జోరుగా సాగనుందని తెలుస్తోంది.