అదిలాబాద్ రిమ్స్‌లో రాజకీయ లొల్లి

by  |
అదిలాబాద్ రిమ్స్‌లో రాజకీయ లొల్లి
X

దిశ ప్రతినిధి, ఆదిలాబాద్:

ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా ప్రజా ఆరోగ్య పరిరక్షణ కోసం సదాశయంతో ఏర్పాటు చేసిన రాజీవ్ గాంధీ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్( రిమ్స్) కు రాజకీయ చీడ పట్టింది. రాజకీయ నేతల రంగ ప్రవేశానికి తోడు దవాఖానలో పనిచేస్తున్న సీనియర్ వైద్యులు కొందరు రిమ్స్ ప్రభను మసకబారేలా చేస్తున్నారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. వైద్య సిబ్బంది నియామకానికి అడ్డు తగలడంతో సరైన వైద్య సేవలు అందక పేషెంట్లు నానా పాట్లు పడుతున్నారు. సేవలు ఎలా అందించాలో తెలియక రిమ్స్ డైరెక్టర్ తలపట్టుకుంటున్నారు. ఇటీవల ఆయన చేసిన వ్యాఖ్యలు ఇందుకు అద్దం పడుతున్నాయి.

అన్ని రాజకీయాలే..!

ఆదిలాబాద్ రిమ్స్ లో వైద్యానికి బదులు రాజకీయాలు రాజ్యమేలుతున్నాయి. గతంలో రిమ్స్ డైరెక్టర్ గా పనిచేసిన డాక్టర్ అశోక్ హయాంలో ఆసుపత్రి పని తీరుపై అనేక ఆరోపణలు వచ్చాయి. ఒక ప్రజా ప్రతినిధి సహకారంతో ఇష్టారాజ్యంగా నడిచిందన్న విమర్శలు వెల్లువెత్తాయి. రిమ్స్ చైర్మన్‌గా ఉండాల్సిన జెడ్పీ చైర్‌పర్సన్ హక్కులను కాలరాస్తూ అక్కడి ఓ సీనియర్ ప్రజా ప్రతినిధి అన్నీ తానై రిమ్స్ ను తన చేతుల్లోకి తీసుకున్నాడన్న ఆరోపణలు ఉన్నాయి. దీంతో రిమ్స్ కు రాజకీయ మకిలి పట్టిందని చర్చనడుస్తున్నది. ఈ నేపథ్యంలో ప్రభుత్వం ఎట్టకేలకు ఇంచార్జి డైరెక్టర్‌గా కొనసాగినా డాక్టర్ అశోక్ ను తొలగించింది.

ఓ పొలిటికల్ లీడర్ ప్రెషర్…

ఆదిలాబాద్ రిమ్స్ లో ఖాళీగా ఉన్న సుమారు వందకు పైగా వైద్యుల పోస్టులతో పాటు పారామెడికల్ సిబ్బంది నియామకంలో రాజకీయ రంగు పులుముకున్నది. కీలకమైన వైద్యుల పోస్టుల భర్తీ విషయంలో ఆదిలాబాద్ జిల్లాకు చెందిన అధికార పార్టీ సీనియర్ నేత ఒకరు అడ్డుపడుతున్నారని సమాచారం. అసలే కరోనా సమయం కావడంతో వైద్యులు లేకుండా సేవలు ఎలా అందించాలో తెలియక సంస్థ డైరెక్టర్ తల పట్టుకునే పరిస్థితి నెలకొంది. రిమ్స్ స్వయం ప్రతిపత్తి కలిగిన సంస్థగా కొనసాగుతున్నప్పటికీ డైరెక్టర్ అధికారాలకు రాజకీయ కత్తెరతో ఇబ్బందులు ఎదురవుతున్నాయి. దీంతో రిమ్స్‌లో కొత్తగా నియమించాల్సిన ప్రొఫెసర్లు, అసోసియేట్ ప్రొఫెసర్లు, అసిస్టెంట్ ప్రొఫెసర్లు, రెసిడెంట్ డాక్టర్లు, డ్యూటీ డాక్టర్లు వంటి పోస్టులను భర్తీ చేయని పరిస్థితి నెలకొంది.

ఉనికిపై సీనియర్ డాక్టర్ల ఆందోళన..

రిమ్స్‌లో పనిచేస్తున్న కొందరు సీనియర్ వైద్యుల కారణంగానే రాజకీయ జోక్యం పెరిగిందని ప్రచారం ఉంది. కొత్త వైద్యులు భారీ మొత్తంలో చేరితే రిమ్స్‌లో తమ ఉనికి దెబ్బతింటుందన్న అక్కసు దీనికి కారణమని తెలుస్తోంది. రాజకీయ నేతలు కొందరు సీనియర్ల కారణంగా రిమ్స్‌లో వైద్యుల పోస్టుల భర్తీ చేయలేకపోతున్నామని డైరెక్టర్ బలరాం నాయక్ పేర్కొనడం తీవ్ర చర్చనీయాంశంగా మారింది. పారామెడికల్ పోస్ట్ ల విషయంలో కొన్ని ఔట్ సోర్సింగ్ ఏజెన్సీలను మేపేందుకు కొత్త నియామకాలు జరపడం లేదన్న విమర్శలు వినిపిస్తున్నాయి. రిమ్స్‌లో సేవలను మరింత విస్తరించాలన్న ఆకాంక్షతో డైరక్టర్ చిత్తశుద్ధి తో పని చేస్తున్నారని కాని మితిమీరిన రాజకీయ జోక్యంతో పాటు కొందరు సీనియర్ల కారణంగా డైరెక్టర్ కాళ్లకు కల్లెం వేస్తున్నారన్న ఆరోపణలు ఉన్నాయి.

కరోనా పేషెంట్లు ఎస్కేప్..

రిమ్స్‌లో కనీస సేవలు కరువయ్యాయంటూ ఆస్పత్రి నుంచి 10 మంది రోగులు పరారైన ఘటన రాష్త్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించింది. అందులోనూ కరోనా వార్డు నుంచి పాజిటివ్ కేసులు పరారీకావడం కలకలం రేపింది. దవాఖానాలో వైద్యులు లేకపోవడమే ఇందుకు ప్రధాన కారణంగా తెలుస్తున్నది. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాకే తలమానికంగా నిలవాల్సిన రిమ్స్ నుంచి పది మంది కరోనా పెషెంట్లు ప్రభుత్వం సీరియస్ పరిగణించకపోవడం విమర్శలకు తావునిస్తున్నది.

వైద్యశాలలో రాజకీయాలేంటి..? : ఎంపీ సోయం బాపూరావ్

కరోనా సమయంలో పేదలకు, బాధితులకు సేవలు అందించాల్సిన వైద్యశాలలో రాజకీయాలు ఏమిటి. వైద్యుల భర్తీకి అడ్డం పడుతున్న రాజకీయ నాయకులు ఎవరో బయటపెట్టాలి. అధికార టీఆర్ఎస్ నేతలు కొందరు తమ పలుకుబడి కోసం, వారి భాగస్వామ్యంతో నడుస్తున్న ఔట్‌సోర్సింగ్ ఏజెన్సీల కోసం రిమ్స్‌ను భష్టు పట్టిస్తున్నారు. దీనిపై సమగ్ర విచారణ జరిపి బాధ్యులపై చర్యలు తీసుకోవాలి. లేనిపక్షంలో ఈ వ్యవహారంపై జాతీయ స్థాయిలో మెడికల్ కౌన్సిల్ కు ఫిర్యాదు చేస్తాం.


Next Story

Most Viewed