అడవిలో అమర వీరుల వారోత్సవాలు.. టార్గెట్ చేస్తున్న బలగాలు

by Sridhar Babu |
moaist
X

దిశ ప్రతినిధి, కరీంనగర్ : జూలై 28 నుంచి ఆగస్టు 3 వరకు మావోయిస్టు పార్టీ అమర వీరుల వారోత్సవాలు నిర్వహించేందుకు సమాయత్తం అయింది. పట్టున్న రాష్ట్రాల్లో అమరవీరులను స్మరిస్తూ సభలు, స్మారక స్థూపాలను నిర్మించే ప్రక్రియకు శ్రీకారం చుడుతోంది. ఈ సందర్భంగా విప్లవ పంథాలో వెళ్లి అమరులైన మావోయిస్టులకు నివాళులు అర్పించనుంది. మావోయిస్టు పార్టీ నాయకత్వం ఈ వారం రోజుల పాటు ప్రత్యేక కార్యక్రమాలను చేపట్టేందుకు రంగం సిద్ధం చేసుకోవడం ఆనవాయితీగా వస్తోంది.

జూలై 28 1972న నక్సల్బరీ వ్యవస్థాపకుడు చారుమజుందార్ మరణించారు. అలాగే 1982 జూలై 18న మరో విప్లవ నాయకుడు కన్హాయ్ ఛటర్జీ చనిపోయారు. వీరిద్దరి స్మృత్యర్థం జూలై 28 నుంచి వారం రోజుల పాటు మావోయిస్టు పార్టీ అమరవీరుల వారోత్సవాలను నిర్వహిస్తుంటోంది. ఈ ఏడాది దేశ వ్యాప్తంగా 160 మంది విప్లవకారులు మరణించారు. వీరందరిని స్మరిస్తూ ప్రత్యేకంగా వారోత్సవాలను నిర్వహించేందుకు సమాయత్తం అయింది మావోయిస్టు పార్టీ. కమ్యూనిస్టు సాయుధ పోరాటంలో ఈ వారోత్సవాలకు అత్యంత ప్రాధాన్యం ఇస్తారు.

హై అలర్ట్..

మావోయిస్టు పార్టీ వారోత్సవాలను పురస్కరించుకుని భారీ ఎత్తున కార్యక్రమాలు నిర్వహించే అవకాశాలు ఉన్నాయని గుర్తించి.. బలగాలు కూడా మావోయిస్టుల ఇలాకాలో కూంబింగ్ నిర్వహిస్తున్నాయి. మావోయిస్టులు ఛత్తీస్‌గఢ్‌లోని దండకారణ్య అటవీ ప్రాంతంలో క్రాంతీ కారి జనతన్ సర్కార్ పేరిట సమాంతర ప్రభుత్వం నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఛత్తీస్‌గఢ్ చుట్టు పక్కల రాష్ట్రాల్లో మావోయిస్టులు చొరబడి పలు కార్యక్రమాలు నిర్వహించే అవకాశాలు ఉన్నాయని నిఘా వర్గాలు అప్రమత్తం చేశాయి.

దీంతో, వారోత్సవాలకు ముందు మహారాష్ట్ర, ఛత్తీస్‌గఢ్, తెలంగాణ, ఏపీ, ఒరిస్సా రాష్ట్రాల సరిహద్దుల్లో జాయింట్ ఆపరేషన్లకు శ్రీకారం చుట్టారు. సరిహద్దు అటవీ ప్రాంతాల్లో ఆయా రాష్ట్రాల పోలీసులు సమన్వయంతో గాలింపు చర్యలను ముమ్మరం చేశారు. ఛత్తీస్‌గఢ్ సాయుధ మావోయిస్టులు ఆయా రాష్ట్రాల్లోకి చొరబడకుండా ఉండేందుకు పకడ్బంధీగా గస్తీ నిర్వహిస్తున్నారు. ఆయా రాష్ట్రాల ఆపరేషన్ బలగాలతో పాటు కేంద్ర పారా మిలటరీ బలగాలు కూడా మావోయిస్టులను కట్టడి చేసే పనిలో నిమగ్నం అయ్యాయి.

ఆగస్టు 3 వరకు సాగే వారోత్సవాలు ముగిసే వరకూ అటవీ ప్రాంతాల్లో జల్లెడ పట్టే పనిలో పడ్డాయి బలగాలు. మావోయిస్టులు చర్యలకు పూనుకునే అవకాశాలు కూడా ఉన్నందున వాటిని ముందస్తుగానే బందోబస్తు చేపట్టడం ఆరంభించాయి. వారోత్సవాలలో కేవలం సంస్మరణ సభలు నిర్వహించడమే కాకుండా ప్రత్యర్థులను, ప్రభుత్వాలను లక్ష్యంగా చేసుకుని దాడులకు పాల్పడే అవకాశాలు ఉన్నందున ఆయా రాష్ట్రాల పోలీసులు జాయింట్ ఆపరేషన్ చేపట్టాయి.

Advertisement

Next Story

Most Viewed