తెరపైకి ‘ఇన్‌ఫార్మర్లు’

by  |
తెరపైకి ‘ఇన్‌ఫార్మర్లు’
X

దిశ, క్రైమ్ బ్యూరో : దాదాపు ఒకటిన్నర దశాబ్ద కాలంగా స్తబ్దుగా ఉన్న పోలీసు ఇన్‌ఫార్మర్ నెట్‌వర్క్ మళ్లీ తెరపైకి వస్తోంది. గతంలో మావోయిస్టుల కార్యకలాపాలను ఈ వ్యూహం ద్వారానే అదుపు చేయగలిగామని భావించిన పోలీసు బాస్ మహేందర్ రెడ్డి మళ్లీ ఆ దిశగా కసరత్తు చేస్తున్నారు. గ్రామస్థాయి నుంచి ఇన్‌ఫార్మర్ల వ్యవస్థను తిరిగి నిర్మించి బలోపేతం చేయడంపై దృష్టిపెట్టారు. మావోయిస్టుల కదలికలను వెంటనే పసిగట్టి ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించి వెంటనే గ్రేహౌండ్స్ బలగాలను రంగంలోకి దింపే యోచ‌న చేస్తున్నారు.

ఐదు రోజులు అక్కడే మకాం..

మావోయిస్టు నాయకుడు భాస్కర్ డైరీలో దొరికిన వివరాల మేరకు అనేక కోణాల నుంచి విశ్లేషిస్తున్న పోలీసు బాస్ ఆదిలాబాద్ జిల్లాలో ఐదు రోజుల పాటు మకాం వేయడం రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. జిల్లాలో ఇటీవల మావోయిస్టుల కదలికలు వెలుగులోకి వచ్చిన నేపథ్యంలో డీజీపీ పర్యటనకు ప్రాధాన్యం ఏర్పడింది. ఇన్‌ఫార్మర్ నెట్‌వర్క్ వ్యూహానికి తోడు కూంబింగ్ ఆపరేషన్లలో పాల్గొంటున్న పోలీసుల్లో ఎక్కువ మంది ఇటీవల రిక్రూట్ అయిన యువకులే కాబట్టి వారికి మావోయిస్టు కార్యకలాపాలను ఎదుర్కోవడంలో ఎలాంటి ప్రత్యక్ష అనుభవం లేనందువల్ల ఇకపైన అవలంబించాల్సిన వ్యూహం గురించి వివరించినట్లు తెలిసింది. గతంలో ఉన్న ఇన్‌ఫార్మర్ నెట్‌వర్క్ ఎలా ఉండేది? అప్పుడు పోలీసులకు సమాచారం ఇచ్చిన వ్యక్తులు ఇప్పుడు ఎక్కడున్నారు? వారితో పాటు కొత్తవారిని సమీకరించడం ఎలా? వారి నుంచి అందుతున్న సమాచారం మేరకు జిల్లాల పోలీసు అధికారుల మధ్య సమన్వయం చేయడం ఎలా? లాంటి అనేక అంశాలన్నీ చర్చకు వచ్చినట్లు తెలిసింది.

మావోయిస్టు పార్టీలోకి రిక్రూట్‌మెంట్ అవుతోందా..?

తెలంగాణలో హఠాత్తుగా మావోయిస్టుల కదలికలు ఎందుకు పెరిగాయి? స్థానికంగా రిక్రూట్‌మెంట్ జరుగుతోందా? ప్రజల నుంచి అందుతున్న మద్దతు ఏయే రూపాల్లో ఉంటోంది? సహకరిస్తున్నవారిలో రాజకీయ పార్టీలకు చెందినవారెవరు? అనే విష‌యాల‌పై డీజీపీ లోతుగా ఆరా తీసినట్లు తెలిసింది. ఆదివాసీలు, గిరిజనుల మద్దతు మావోయిస్టు పార్టీకి అందకుండా చేయాలనేది పోలీసుల వ్యూహం. ప్రభుత్వంపై స్థానికంగా ప్రజల్లో ఉన్న అసంతృప్తి ఏ స్థాయిలో ఉంది? దీన్ని మావోయిస్టు పార్టీ ఏ రకంగా వినియోగించుకునే అవకాశం ఉంది? అనే అంశాలు చ‌ర్చ‌కు వ‌చ్చిన‌ట్లు స‌మాచారం. రిక్రూట్‌మెంట్‌కు మావోయిస్టు పార్టీ చేపడుతున్న విధానాలు, ఆ పార్టీ పట్ల ఆకర్షితులవుతున్న యువత మనస్థత్వం, వారి ఆలోచనా స్థాయి.. ఇలా అనేక అంశాలపై పోలీసు అధికారులు అధ్యయనం చేస్తున్నారు.

త్వరలో పోలీసుశాఖలో బదిలీలు..?

మావోయిస్టు కార్యకలాపాల‌ను మొగ్గలోనే తుంచివేయాలనుకుంటున్న ప్రభుత్వం త్వరలో నిష్ణాతులైన పోలీసు అధికారులను ప్రభావిత ప్రాంతాల్లో ఉంచాలని భావిస్తోంది. గతంలో మావోయిస్టు కదలికలు ఉన్నప్పుడు చురుగ్గా వ్యవహరించిన పోలీసు అధికారులను ఇప్పుడు ఆ ప్రాంతాలకు బదిలీ చేయాలన్న ఆలోచన పోలీసుశాఖలో ఉన్నట్లు తెలుస్తోంది.


Next Story

Most Viewed