వాహ్.. ఆసక్తిగా ఖాకీల ప్రయత్నం

by Anukaran |
వాహ్.. ఆసక్తిగా ఖాకీల ప్రయత్నం
X

దిశ, క్రైమ్ బ్యూరో : యావత్తు ప్రపంచాన్ని కరోనా వైరస్ అల్లకల్లోలం చేస్తోంది. వైరస్ దాడి ప్రారంభమై ఎనిమిది నెలలు గడుస్తోంది. రెండు నెలలు పూర్తి స్థాయిలో లాక్ డౌన్, మరో రెండు నెలలుగా అన్ లాక్‌‌డౌన్ కొనసాగుతున్నా.. నివారణకు ఎలాంటి మెడిసిన్ రాకపోవడంతో ప్రజల్లో నేటికీ భయాందోళనలు నెలకొన్నాయి. కరోనా నివారణా చర్యల్లో పోలీసు శాఖ అనేక కార్యక్రమాల్లో పాల్గొన్నా.. బాధితులను రికవరీ చేసేందుకు ప్రత్యేక కార్యక్రమాన్ని నిర్వహిస్తోంది. సమాజంలో శాంతి భద్రతలను కాపాడుతూనే.. మరో వైపు సామాజిక బాధ్యతగా ప్లాస్మా దాతలను ఏకతాటిపైకి తీసుకొస్తూ.. కరోనా బాధితులకు ప్రాణదాతలుగా నిలుస్తున్నారు. ఈ క్రమంలో కరోనా పాజిటివ్ నుంచి కోలుకున్న వారి జాబితాను ప్రత్యేక పోర్టల్‌లో నమోదు చేస్తూ.. ప్లాస్మా గ్రహీతలను కూడా అదే జాబితాలో అందుబాటులో ఉంచుతున్నారు. ప్మాస్మా దాత, ప్లాస్మా గ్రహీతల మధ్య అనుసంధానకర్తగా పోలీసులు వ్యవహరిస్తున్నారు. పలువురికి ఆదర్శంగా నిలుస్తున్నారు.

దాతలకు, గ్రహీతలకు ప్రత్యేక వేదిక..

కరోనా వైరస్ నేపథ్యంలో ప్రజల ప్రాణాలను కాపాడటంలో పోలీసులు ప్రముఖ పాత్ర పోషిస్తున్నారు. అందులో భాగంగా లాక్‌డౌన్ అమలు, క్వారంటైన్ కేంద్రాలు, పాజిటివ్ రోగులను ఆస్పత్రులకు తీసుకెళ్లడం, కంటైన్మెంట్ జోన్ల విషయంలో తమ ప్రాణాలకు తెగించి విధుల్లో భాగస్వామ్యం అయ్యారు. అయితే, కరోనాకు ఎంతకీ పరిష్కారం లభించడం లేదని భావించిన సైబరాబాద్ పోలీస్ కమిషనర్ వీసీ సజ్జనార్ కరోనా‌ను జయించిన యోధుల నుంచి ప్లాస్మా సేకరించే కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. అందుకు డొనేట్ ప్లాస్మా డాట్ ఎస్సీఎస్సీ డాట్ ఇన్ అనే వెబ్ సైట్ (donateplasma.scsc.in)ను రూపొందించారు. కరోనా నుంచి కోలుకున్న వారిలో యాంటీ బాడీస్ డెవలప్ అయిన వారు తమ ప్మాస్మాను ఇతర కొవిడ్ పేషెంట్లకు దానం చేయాలని ప్రచారం ప్రారంభించారు. అంతే కాకుండా, ఈ వెబ్ సైట్ లో దాతల పేర్లను, గ్రహీతల జాబితాను ఉంచుతున్నారు. దీంతో దాతలకు మేము ఫలానా పేషెంట్‌కు ప్లాస్మా డొనేట్ చేశామనే సమాచారం డైరెక్ట్‌గా తెలుసుకునే వీలుంది. ఇలా ఇప్పటి వరకూ సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో 195 మంది ప్లాస్మా దాతలను గుర్తించారు. అయితే, ఒక్కో డోనర్ వారి బ్లడ్ లో డెవలప్ చెందిన ప్మాస్మా కణాల ఆధారంగా ఒక్కరికి ఇవ్వొచ్చా.. లేదా ఇద్దరికీ ఇవ్వడానికి అవకాశం ఉందా అనే విషయాన్ని వైద్యులు చెబుతారు. ఈ ప్రకారం ఇప్పటి వరకూ సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్ వీసీ సజ్జనార్ నేతృత్వంలో 195 మంది దాతలు సుమారు 300 మంది కరోనా రోగులకు తమ ప్లాస్మాను అందించారు. వీరిలో దాదాపు 20 మందికి పైగా పోలీసులు ఉన్నారు. రాచకొండ కమిషనరేట్ పరిధిలో ప్లాస్మా దాతలు 50 మంది పోలీసు సిబ్బంది ఉన్నారు.

ప్లాస్మా దాతల కోసం వెయిటింగ్

హైదరాబాద్ నగర పోలీసులు చేపడుతున్న ఈ కార్యక్రమంపై కొవిడ్ పేషెంట్లు చాలా సంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు. ప్లాస్మా గ్రహీతలు కొవిడ్ నుంచి కోలుకున్న తర్వాత వారి ఆనందానికి అవధు ల్లేవు. దీంతో కరోనా నుంచి సురక్షితంగా బయట పడడమే కాకుండా, ప్లాస్మా దాతలుగా సమాజంలో మంచి గుర్తింపును పొందుతున్నారు. పలువురికి ఆదర్శంగా నిలుస్తున్నారు. సైబరాబాద్, రాచకొండ, హైదరాబాద్ పోలీస్ కమిషనర్లు పలువురు ప్లాస్మా దాతలను రియల్ హీరోలుగా పోల్చుతున్నారు. ప్రోత్సాహకంగా సత్కరించడం, బహుమానాలను అందిస్తున్నారు. సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలో తమకు ప్లాస్మా కావాలంటూ ఇంకా 295 మంది జాబితా వెయిటింగ్ ఉండగా, ప్లాస్మా దాతల కొరత తీవ్రంగా ఉన్నట్టు అధికారులు చెబుతున్నారు. అదే విధంగా రాచకొండ పోలీస్ కమిషనరేట్ పరిధిలో 98 మంది ప్లాస్మా ఇచ్చేందుకు సిద్దంగా ఉన్నారు. హైదరాబాద్ నగరంలో సైబరాబాద్, రాచకొండ పోలీస్ కమిషనరేట్ పరిధిలో నిర్వహిస్తున్న ప్లాస్మా డొనేషన్ కార్యక్రమానికి స్ఫూర్తి పొందిన పూణే పోలీసులు కూడా పూణే ప్లాస్మా డాట్ ఇన్ (puneplasma.in) ఆన్ లైన్ వేదికను ఏర్పాటు చేశారు. ఆసక్తి కలిగిన ప్లాస్మా దాతలు, గ్రహీతలు donateplasma.scsc.in లో తమ పేర్లను నమోదు చేసుకోవాలని పోలీసులు సూచిస్తున్నారు.

ప్లాస్మా దానం సామాజిక బాధ్యత: వీసీ సజ్జనార్, సైబరాబాద్ సీపీ

రక్తదానం లాగానే ప్లాస్మానూ దానం చేయొచ్చు. సామాజిక బాధ్యతగా వ్యవహరించాలి. కరోనాను జయించిన వారిలో 21 లేదా 28 రోజుల్లో యాంటీ బాడీ సెల్స్ ఉత్పత్తి అవుతాయి. సుమారు 400 మి.లీ రక్తం ఇవ్వాలి. దీని నుంచి 70 మి.లీ ప్లాస్మాను వైద్యులు వేరు చేసి కరోనా పేషెంట్‌కు ఎక్కిస్తారు. దీంతో ఆ కరోనా రోగి కోలుకుంటాడు. ప్లాస్మాను దానం చేసిన వారికి తిరిగి 72 గంటల్లోనే మళ్లీ వారిలో వృద్ధి చెందుతుంది. ప్లాస్మా డొనేషన్ డ్రైవ్‌లలో తమ పేర్లను donateplasma.scsc.in వెబ్‌సైట్‌లో నమోదు చేసుకోవచ్చు. లేదా 90002 57058, 9490617440 నెంబర్లలో సంప్రదించొచ్చు.

Advertisement

Next Story

Most Viewed