కూలీగా మారిన పోలీస్ కానిస్టేబుల్

by Anukaran |
కూలీగా మారిన పోలీస్ కానిస్టేబుల్
X

దిశ, సిరిసిల్ల: చేతికందిన పండు నోటి కందని చందంగా మారింది కొత్తగా సెలెక్ట్ అయిన టీఎస్ఎస్‌పీ పోలీస్ కానిస్టేబుల్ అభ్యర్థుల పరిస్థితి. కానిస్టేబుల్ ఉద్యోగానికి సెలెక్ట్ అయి 10 నెలలు గడుస్తున్నా ప్రభుత్వం నుంచి ఎటువంటి పిలుపు అందలేదు. కొలువు వచ్చిందన్నా సంతోషంగా కన్నా ట్రైనింగ్‌కు పిలవడం లేదనే బాధనే వారిని వెంటాడుతున్నది. ఉద్యోగం వచ్చిందనే ధీమాతో కొందరు ప్రస్తుతం చేస్తున్న ఉద్యోగానికి రాజీనామా చేశారు. ఆర్థిక ఇబ్బందులు ఎదురవడంతో దిక్కుతోచని పరిస్థితుల్లో కొందరు దినసరి కూలీలుగా మారుతున్నారు.

పోలీస్ శాఖ వివిధ భాగాల్లో ఖాళీల భర్తీకీ 2018లో ప్రభుత్వం నోటిఫికేషన్ రిలీజ్ చేసింది. రాజన్న సిరిసిల్లకు చెందిన కొంత మంది యువత పోలీస్ ఉద్యోగాలపై ఉన్న మక్కువతో ప్రస్తుతం చేస్తున్న జాబ్‌కు రిజైన్ చేసి మరీ సన్నద్ధమయ్యారు. రాత పరీక్షల అనంతరం 2019 సెప్టెంబరు 24న ఫలితాలు విడుదలయ్యాయి. ఈ ఫలితాల్లో జిల్లాకు చెందిన కొంత మంది యువత తెలంగాణ స్టేట్ స్పెషల్ పోలీస్ (టీఎస్‌ఎస్‌పీ) కానిస్టేబుల్ అభ్యర్థులుగా సెలెక్ట్ అయ్యారు. సెలెక్ట్ అయి పది నెలలు గడుస్తున్నా వారికి ఇంత వరకు ప్రభుత్వం నుంచి ఎలాంటి పిలుపు అందలేదు. దీంత వారంతా దిక్కుతోచని పరిస్థితిలో పడ్డారు.

తోటి వారికి శిక్షణ…

వీరితో పాటు పరీక్షలు రాసిన సివిల్, ఏఆర్ విభాగాల్లో ఎన్నికైన అభ్యర్థులను ఈ ఏడాది జనవరి 17న కానిస్టేబుల్ శిక్షణకు ఆహ్వానించారు. వారికి మొదటి సెమిస్టర్ పూర్తయి రెండో సెమిస్టర్ పాఠాలు నడుస్తున్నాయి. కానీ టీఎస్‌ఎస్‌పీ కానిస్టేబుల్ అభ్యర్థులకు మాత్రం పది నెలలుగా ఎలాంటి పిలుపు అందడం లేదు. మరో రెండు, మూడు నెలల్లో తమ తోటివారు శిక్షణ పూర్తిచేసుకుని విధుల్లో చేరేందుకు సిద్ధమవుతున్నా తమకు మాత్రం ప్రభుత్వం నుంచి ఎలాంటి పిలుపు లేకపోవడంతో ప్రస్తుతం వీళ్లంతా డోలాయమాన స్థితిలో కొట్టుమిట్టాడుతున్నారు.

ఉపాధి కూలీలుగా..

కానిస్టేబుల్‌గా సెలెక్ట్ అయిన అభ్యర్థులు గత పది నెలలుగా తీవ్ర ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. కొలువచ్చిందనే దీమాతో ఉన్న ఉద్యోగానికి రాజీనామా చేశారు. దీంతో ఉపాధి కరువై కొంత మంది ఉపాధి హామీ కూలీలుగా, మరికొందరు భవన నిర్మాణ కార్మికులుగా, ఇంకొందరు వ్యవసాయ కూలీలుగా, చేతివృత్తులు చేస్తూ కాలం వెళ్లదీస్తున్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం తమ ధీన స్థితిని గుర్తించి ట్రైనింగ్ పిలిచి ఆదుకోవాలని కోరుతున్నారు.

Advertisement

Next Story