‘ఆగస్టు 5 చరిత్రలో నిలిచిపోయే రోజు’

by Shamantha N |
pm-modi
X

న్యూఢిల్లీ: ఆగస్టు 5వ తేదీ చరిత్రలో నిలిచిపోతుందని ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ తెలిపారు. ఇందుకు గల మూడు కారణాలను ఆయన వెల్లడించారు. రెండేళ్ల క్రితం ఆగస్టు 5న జమ్ము కశ్మీర్‌లో ఆర్టికల్ 370ని రద్దు చేశామని, గతేడాది ఆగస్టు 5న అయోధ్యలో రామ మందిర నిర్మాణానికి శంకుస్థాపన చేశామని, ఈ ఏడాది ఆగస్టు 5న ఒలింపిక్స్‌లో భారత పురుషుల హాకీ జట్టు జర్మనీపై గెలిచి కాంస్య పతకాన్ని సాధించిందని తెలిపారు. అందుకే ఈ తేదీ భారత చరిత్రలో నిలిచిపోతుందని వెల్లడించారు. యూపీలోని ‘ప్రధాన మంత్రి గరీబ్ కల్యాణ్ యోజన’(పీఎంజీకేవై) లబ్ధిదారులతో గురువారం వర్చువల్‌గా సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ప్రధాని మోడీ మాట్లాడుతూ.. ర్యాంకుల ద్వారా కాకుండా మెడల్స్ గెలవడం ద్వారా సరికొత్త భారత్‌ ప్రపంచ గుర్తింపును పొందుతున్నదని వెల్లడించారు. ఒలింపిక్స్‌లో జర్మనీపై గెలిచి కాంస్య పతకం సాధించిన భారత హాకీ జట్టుకు ప్రధాని అభినందనలు తెలిపారు. ఈ మేరకు జట్టు కోచ్ గ్రహమ్ రెయిడ్, కెప్టెన్‌ మన్‌ప్రీత్ సింగ్‌తో ఫోన్‌లో మాట్లాడారు. అనంతరం ఆయన పీఎంజీకేవైపై ఉత్తరప్రదేశ్ వ్యాప్తంగా భారీ అవగాహన క్యాంపెయిన్‌ను లాంచ్ చేశారు. అర్హులైన ప్రతి ఒక్కరూ ఈ పథకంతో లబ్ధి పొందాలని సూచించారు. ఈ భేటీలో యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ సైతం హాజరయ్యారు. కాగా, పథకం ద్వారా యూపీ వ్యాప్తంగా 15కోట్ల మంది లబ్ధి పొందుతున్నారని అధికారిక వర్గాలు ప్రకటించాయి.

ప్రతిపక్షాలది జాతి వ్యతిరేక చర్యలు

పార్లమెంట్‌లో పెగాసస్‌ స్పైవేర్‌పై చర్చ జరపాలంటూ పట్టుబడుతూ ఉభయ సభలను స్తంభింపజేస్తున్న ప్రతిపక్షాలపై ప్రధాని మోడీ మరోసారి ఫైర్ అయ్యారు. అలాంటివారు దేశ పురోగతిని అడ్డుకోలేరని నొక్కిచెప్పారు. ప్రతిపక్షాలు పార్లమెంట్‌ కార్యకలాపాలను సాగనివ్వకుండా ప్రజాధనం వృథా చేస్తున్నాయని విమర్శించారు. ప్రతిపక్షాల తీరు జాతి వ్యతిరేకమని, అభివృద్ధి మార్గాన్ని అడ్డుకోవడమే వారి అభిమతమని తెలిపారు. అభివృద్ధిలో దేశంలో గోల్‌పై గోల్ చేస్తుంటే, మరికొందరేమో తమ రాజకీయ ఎజెండాలు నెరవేర్చుకునేందుకు కోసం సెల్ఫ్ గోల్ కొట్టేందుకు యత్నిస్తున్నారని ఎద్దేవా చేశారు.

Advertisement

Next Story